ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఎందరో బ్యాటర్లు తమ అద్భుత ప్రదర్శనతో అభిమానులను అలరించారు. అయితే, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాటర్ల జాబితాను పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. ఈ టాప్ 5లో నలుగురు భారతీయ ఆటగాళ్లు ఉండగా, కేవలం ఒకే ఒక్క విదేశీ ఆటగాడు చోటు సంపాదించుకున్నారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. 2008 నుండి 2025 వరకు మొత్తం 267 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 8,661 పరుగులు చేశాడు. ఐపీఎల్లో 8,000 పరుగుల మార్కును దాటిన ఏకైక ఆటగాడు కోహ్లీనే. ఒకే ఫ్రాంచైజీ ( తరపున 8,500 కంటే ఎక్కువ పరుగులు చేసిన రికార్డు కూడా కోహ్లీ పేరిట ఉంది. 2016 సీజన్లో కోహ్లీ ఏకంగా 973 పరుగులు చేసి, ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఆయన ఐపీఎల్ కెరీర్లో 8 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఈ జాబితాలో రెండో స్థానంలో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ ఇప్పటివరకు 272 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 7,046 పరుగులు సాధించాడు. ఐపీఎల్ కెరీర్లో 2 సెంచరీలు, 47 అర్ధసెంచరీలు బాదాడు. 2008లో డెక్కన్ చార్జర్స్ జట్టుతో ప్రస్థానాన్ని ప్రారంభించిన రోహిత్, ఆ తర్వాత ముంబై ఇండియన్స్ జట్టుకు బలమైన ఆటగాడిగా మారాడు. రోహిత్ కెప్టెన్సీలోనే ముంబై ఐదుసార్లు టైటిల్ గెలిచింది. ఇదిలా ఉంటే ఐపీఎల్లో అత్యంత నమ్మదగ్గ ఓపెనర్లలో ఒకడైన శిఖర్ ధావన్ మూడో స్థానంలో నిలిచాడు. 2008 నుండి 2024 మధ్య 222 మ్యాచ్‌లు ఆడిన ధావన్ మొత్తం 6,769 పరుగులు చేశాడు. లీగ్ హిస్టరీలో అత్యధిక అర్ధసెంచరీలు చేసిన టాప్ 5 ఆటగాళ్లలో ఒకడిగా ఉన్నాడు. ధావన్ తన కెరీర్లో మొత్తం 51 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
ఇక టాప్ 5లో ఉన్న ఏకైక విదేశీ ఆటగాడు డేవిడ్ వార్నర్. 184 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో వార్నర్ 6,565 పరుగులు చేశాడు.6,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లలో వార్నర్ బ్యాటింగ్ సగటే అత్యధికం. వార్నర్ ఐపీఎల్లో 4 సెంచరీలు, 62 అర్ధసెంచరీలు సాధించాడు. విదేశీ ఆటగాళ్లలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రికార్డు అతడిదే. మూడుసార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఏకైక ఆటగాడిగా వార్నర్ ఘనత సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం సురేష్ రైనా 5,528 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు. 2008 నుండి 2021 వరకు 205 మ్యాచ్‌లు ఆడిన రైనా, ఐపీఎల్లో 5,000 పరుగుల మార్కును అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. అందుకే రైనా అభిమానులు 'మిస్టర్ ఐపీఎల్' అని పిలుస్తారు. రైనా ఒక సెంచరీ, 39 అర్ధసెంచరీలు సాధించాడు.సీఎస్కే జట్టు నాలుగు సార్లు టైటిల్ గెలవడంలో రైనా కీలక పాత్ర పోషించాడు.