Top story: ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. ఐపీఎస్ వేధింపుల లవ్ స్టోరీ ముందు ప్రేమించాడు.. తుపాకీ చూపించి బెదిరించాడు.!

చట్టాన్ని రక్షించాల్సిన ఒక ఐపీఎస్ అధికారి.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎలా ఉంటుంది? సివిల్స్ సాధించి సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ఒక కాబోయే పోలీస్ బాస్.. సహచర మహిళా అధికారినే నరకయాతనకు గురిచేస్తే పరిస్థితి ఏంటి?

Post Published By: dialnews
Updated : 31 July 2026, 11:19 AM IST

చట్టాన్ని రక్షించాల్సిన ఒక ఐపీఎస్ అధికారి.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎలా ఉంటుంది? సివిల్స్ సాధించి సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ఒక కాబోయే పోలీస్ బాస్.. సహచర మహిళా అధికారినే నరకయాతనకు గురిచేస్తే పరిస్థితి ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వేధింపుల కేసు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన ఒక పరిచయం.. చివరకు తుపాకీ చూపి బెదిరించే స్థాయికి ఎలా వెళ్ళింది? హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించిన ఆ షాకింగ్ నిజాలు ఏంటి? IPS

ఆయన గతంలో ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేశారు. ఆ తర్వాత కష్టపడి చదివి, యూపీఎస్సీ పరీక్షలు రాసి 2025 బ్యాచ్‌లో ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ లో 2025 డిసెంబర్ నుంచి శిక్షణ పొందుతున్నారు. ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి దేశంలోనే అత్యున్నతమైన ఐపీఎస్ ఉద్యోగం సాధించడంతో అందరూ అతడిని అభినందించారు. కానీ, ఆ సక్సెస్ వెనుక ఒక కపట బుద్ధి దాగి ఉందన్న విషయం ఎవరికీ తెలియదు.

అసలు కథ ఎక్కడ మొదలైందంటే.. గతేడాది మధ్యలో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఉదయ్ కృష్ణారెడ్డికి ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారితో పరిచయం ఏర్పడింది. కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అయిన ఉదయ్ విజయ ప్రస్థానంపై ఇన్‌స్టాలో పెట్టిన ఒక పోస్ట్‌కు ఆ బాధితురాలు స్పందించారు. ఆ అమ్మాయి కూడా 2024 బ్యాచ్ ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల సెలవు తీసుకున్నానని, లీవ్ తర్వాత 2025 బ్యాచ్‌తో కలిసి ఎన్‌పీఏలో శిక్షణలో చేరుతానని ఆమె ఉదయ్‌తో చెప్పారు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య మొదట స్నేహం కుదిరింది. ఆ తర్వాత ఎన్‌పీఏ అకాడమీలో శిక్షణ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం మరింత బలపడి, అది కాస్తా ప్రేమకు దారితీసింది. కొన్ని రోజుల పాటు సజావుగానే సాగిన వీరి బంధంలో ఆ తర్వాత మనస్పర్ధలు వచ్చాయి. అక్కడి నుంచే ఉదయ్ కృష్ణారెడ్డి అసలు రూపం బయటపడింది. మనస్పర్ధలు రాగానే ఆ మహిళా అధికారిణిని దారుణంగా వేధించడం మొదలుపెట్టాడు. "నువ్వు నన్ను వదిలేస్తే ఆత్మహత్య చేసుకుంటా" అంటూ పలుమార్లు బ్లాక్‌మెయిల్ చేశాడు.

అంతటితో ఆగకుండా, ఆమెకు ఆయుధాలు చూపించి ప్రాణభయానికి గురిచేశాడు. తీవ్ర ఆగ్రహంతో బాధితురాలి ల్యాప్‌టాప్‌ను విసిరికొట్టి ధ్వంసం చేశాడు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే.. ఒక ఐపీఎస్ చదువు చదివిన ఈ వ్యక్తి, ఆమెను డిజిటల్‌గా వేధించడానికి నకిలీ సామాజిక మాధ్యమ ఖాతాలు సృష్టించి బెదిరింపులకు దిగాడు. ఈ నరకాన్ని భరించలేని ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ధైర్యంగా హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ స్వయంగా రంగంలోకి దిగారు.

ఉదయ్ కృష్ణారెడ్డి నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని సజ్జనార్ స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి ఆరాంఘర్ వద్ద పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఉదయ్ కృష్ణారెడ్డి సినిమా స్టైల్‌లో ప్రయత్నించగా, అధికారులు చాకచక్యంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాజేంద్రనగర్‌లోని ఉప్పరపల్లి కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, న్యాయమూర్తి ఉదయ్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రస్తుతం మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్య నేతృత్వంలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Published : 
  • 31 July 2026, 11:19 AM IST