Top story: అలర్ట్: ఫోన్ స్క్రీన్ ఫ్రీజ్ అయిందా..? మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయినట్లే ఈ కొత్త UPI స్కామ్ గురించి తెలుసుకోండి..!.

మీరు ఎప్పుడైనా సోషల్ మీడియాలో ఏదైనా యాడ్ చూసి క్లిక్ చేసినప్పుడు లేదా ఏదైనా లింక్ ఓపెన్ చేసినప్పుడు మీ ఫోన్ స్క్రీన్ అస్సలు కదలకుండా ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయిందా? ఫోన్ హ్యాంగ్ అయిపోయిందని మీరు కంగారు పడ్డారా? అయితే జాగ్రత్త.

Post Published By: dialnews
Updated : 8 September 2026, 12:28 PM IST

మీరు ఎప్పుడైనా సోషల్ మీడియాలో ఏదైనా యాడ్ చూసి క్లిక్ చేసినప్పుడు లేదా ఏదైనా లింక్ ఓపెన్ చేసినప్పుడు మీ ఫోన్ స్క్రీన్ అస్సలు కదలకుండా ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయిందా? ఫోన్ హ్యాంగ్ అయిపోయిందని మీరు కంగారు పడ్డారా? అయితే జాగ్రత్త. అది కేవలం సాంకేతిక లోపం మాత్రమే కాకపోవచ్చు. మీ ఫోన్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని, మీ బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న సొమ్మంతా ఊడ్చేయడానికి సైబర్ నేరగాళ్లు పన్నుతున్న సరికొత్త 'ఫ్రోజెన్-స్క్రీన్ UPI స్కామ్' కావచ్చు. అవును, ప్రస్తుత రోజుల్లో సైబర్ మోసాలు చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి. మన చిన్న అజాగ్రత్తను ఆసరాగా చేసుకుని లక్షల రూపాయలు దోచేస్తున్నారు. ఈ రోజు ఈ వీడియోలో ఈ కొత్త స్కామ్ ఎలా జరుగుతుంది? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి?

సాధారణంగా మన ఫోన్ స్క్రీన్ ఫ్రీజ్ అయినప్పుడు మనం కంగారు పడతాం. సైబర్ నేరగాళ్లకు కావాల్సింది కూడా సరిగ్గా ఇదే. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణుల ప్రకారం.. ఈ ఫ్రోజెన్ స్క్రీన్ అనేది అసలైన మోసం కాదు, అది కేవలం మనల్ని తప్పుదోవ పట్టించడానికి చేసే ఒక పెద్ద డ్రామా మాత్రమే. మీరు ఏదైనా తెలియని లింక్ లేదా సోషల్ మీడియా ప్రకటనలపై క్లిక్ చేసినప్పుడు ఈ స్కామ్ యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత మీకు ఒక ఫేక్ ఎర్రర్ మెసేజ్ రావచ్చు లేదా కస్టమర్ సపోర్ట్ పేరుతో ఒక కాల్ రావచ్చు. మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిందని లేదా యూపీఐ అకౌంట్ లో లోపం ఉందంటూ మిమ్మల్ని భయపెడతారు. ఆ సమస్యను పరిష్కరించడానికి లేదా రివార్డులు ఇస్తామంటూ ఒక 'APK ఫైల్' డౌన్‌లోడ్ చేసుకోమని నమ్మిస్తారు.

ఒక్కసారి మీరు వారు చెప్పిన మాలీషియస్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేశారంటే, ఇక మీ ఫోన్ మీ చేతుల్లో ఉండనట్లే. ఈ ప్రమాదకరమైన యాప్‌లు మీ మొబైల్‌లోని 'యాక్సెసిబిలిటీ ', 'నోటిఫికేషన్' మరియు 'SMS' పర్మిషన్లను దొంగిలిస్తాయి. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఈ పర్మిషన్ల ద్వారా హ్యాకర్లు మీ ఫోన్ స్క్రీన్‌ను దూరం నుంచే నియంత్రించగలరు. వారు మీ స్క్రీన్‌ను ఫ్రీజ్ చేసి, మీరు ఏమీ చేయలేకుండా చేస్తారు. అదే సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో మీ బ్యాంకింగ్ యాప్స్ ఓపెన్ చేసి లావాదేవీలు జరుపుతారు. మీకు వచ్చే OTPలను కూడా ఈ యాప్స్ ద్వారా సైబర్ దొంగలు చదివేస్తారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. బ్యాంక్ సెక్యూరిటీని బ్రేక్ చేయకుండానే, కేవలం మీ ఫోన్ పర్మిషన్లను మరియు మిమ్మల్ని మానసికంగా తప్పుదోవ పట్టించి మీ UPI పిన్ లేదా పాస్‌వర్డ్ ఎంటర్ చేసేలా చేస్తారు. దీనివల్ల బ్యాంక్ సిస్టమ్‌కు కూడా ఇది మీరే చేసిన లావాదేవీలా కనిపిస్తుంది తప్ప మోసంగా గుర్తించడం కష్టమవుతుంది. మరి ఇలాంటి ఘోరమైన మోసాల బారిన పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? సైబర్ నిపుణులు చెప్తున్న ఈ గోల్డెన్ రూల్స్ కచ్చితంగా పాటించండి.

ఇంటర్నెట్ ఆపేయండి: మీ ఫోన్ స్క్రీన్ అనుమానాస్పదంగా ఫ్రీజ్ అయిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ మొబైల్ డేటా మరియు వైఫై కనెక్షన్లను వెంటనే ఆఫ్ చేయండి. దీనివల్ల హ్యాకర్లకు మీ ఫోన్‌తో ఉన్న రిమోట్ కనెక్షన్ కట్ అయిపోతుంది.

పిన్‌లు ఎంటర్ చేయకండి: స్క్రీన్ ఫ్రీజ్ అయినప్పుడు కంగారులో మీ యూపీఐ పిన్ లేదా బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను ఎంటర్ చేయడానికి అస్సలు ప్రయత్నించకండి.

యాప్ పర్మిషన్లు తనిఖీ చేయండి: మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అనవసరమైన యాప్‌లకు ఇచ్చిన యాక్సెసిబిలిటీ, ఎస్ఎంఎస్ పర్మిషన్లను వెంటనే రద్దు చేయండి మరియు ఆ యాప్‌ను డిలీట్ చేయండి.

స్క్రీన్ షేరింగ్ యాప్స్ వద్దు: బ్యాంక్ సిబ్బంది లేదా కస్టమర్ కేర్ ప్రతినిధులు ఎవరూ కూడా మీ సమస్యను పరిష్కరించడానికి ఎటువంటి థర్డ్ పార్టీ స్క్రీన్ షేరింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోమని అడగరనే విషయాన్ని గుర్తుంచుకోండి.

ఒకవేళ పొరపాటున మీ బ్యాంక్ సమాచారం సైబర్ దొంగల చేతికి చిక్కిందని మీకు అనిపిస్తే, వెంటనే మీ బ్యాంక్ అధికారిక నంబర్‌కు కాల్ చేసి అకౌంట్‌ను బ్లాక్ చేయించండి. అలాగే భారత ప్రభుత్వం అందిస్తున్న జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి వెంటనే ఫోన్ చేసి మీ ఫిర్యాదును నమోదు చేయండి. టెక్నాలజీ మన జీవితాలను ఎంత సులభతరం చేస్తుందో, అంతటి ప్రమాదాలను కూడా తెచ్చిపెడుతోంది. కాబట్టి అత్యాశకు పోయి ఉచిత ఆఫర్ల లింకులను క్లిక్ చేయకండి. ఈ సమాచారం మీ ఒక్కరికే కాదు, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా చాలా అవసరం.

Published : 
  • 8 September 2026, 12:28 PM IST