ఈరోజుల్లో టీ కొట్టు దగ్గర నుండి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు.. జేబులో రూపాయి లేకపోయినా మొబైల్ ఉంటే చాలు ద్వారా ఈజీగా పేమెంట్స్ చేసేస్తున్నాం. అయితే, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ, న్యూస్ ఛానల్స్ లోనూ ఒక వార్త విపరీతంగా హల్చల్ చేస్తోంది. అక్టోబర్ 15 నుండి రూ. 2,000 దాటితే యూపీఐ లావాదేవీలపై అదనపు ఛార్జీలు పడబోతున్నాయనే వార్త కోట్ల మంది సాధారణ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అసలు ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది? కేంద్ర ఆర్థిక శాఖ మరియు NPCI ఇచ్చిన క్లారిటీ ఏంటి..?
మొదట్లోనే మీకు ఒక గుడ్ న్యూస్. మీ లాంటి, నా లాంటి సామాన్య ప్రజలకు UPI లావాదేవీలు ఎప్పటికీ పూర్తిగా ఉచితం. దీనిపై కేంద్ర ప్రభుత్వం అత్యంత స్పష్టమైన నిరంతర హామీ ఇచ్చింది. ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి మీరు ఎంత డబ్బు పంపినా సరే, దానిపై రూపాయి కూడా ఛార్జ్ పడదు. అలాగే, మీరు ఏదైనా దుకాణంలో రూ. 2,000 లోపు చేసే చెల్లింపులపై కూడా ఎలాంటి అదనపు రుసుము ఉండదు. మరి ఛార్జీల గోల ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఈ ఛార్జీలు సాధారణ కస్టమర్ల కోసం కాదు, కేవలం వ్యాపారస్తుల కోసం మాత్రమే.
దీనిని సులభంగా అర్థం చేసుకోవడానికి కేంద్రం కొన్ని ఉదాహరణలు చెప్పింది.
మొదటి ఉదాహరణ - రెస్టారెంట్ బిల్లు: మీరు ఒక హోటల్‌కు వెళ్లి ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేశారు, అక్కడ బిల్లు రూ. 6,000 అయింది. అప్పుడు మీరు మీ మొబైల్ ద్వారా కరెక్ట్‌గా రూ. 6,000 మాత్రమే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేస్తారు. మీ అకౌంట్ నుండి అదనంగా ఒక్క రూపాయి కూడా కట్ అవ్వదు. కానీ, ఆ రూ. 2,000 దాటిన లావాదేవీపై పడే 0.4% ఛార్జీని అంటే 24 రూపాయలు సదరు రెస్టారెంట్ యజమాని మాత్రమే బ్యాంక్‌కు చెల్లిస్తాడు.
రెండో ఉదాహరణ - మొబైల్ ఫోన్: మీరు ఒక పెద్ద షాపులో రూ. 30,000 విలువైన మొబైల్ కొని యూపీఐ ద్వారా పే చేస్తే, మీ అకౌంట్ నుండి కేవలం రూ. 30,000 మాత్రమే కట్ అవుతుంది. దానిపై వచ్చే రూ. 120 ఛార్జీని ఆ మొబైల్ అమ్మిన వ్యాపారి భరిస్తాడు.
మూడో ఉదాహరణ - పెట్రోల్ బంక్ / రైల్వే టికెట్లు: మీరు కారుకు రూ. 5,000 పెట్రోల్ కొట్టించినా లేదా ఆన్లైన్ లో రైల్వే టికెట్లు బుక్ చేసినా.. రూ. 2,000 దాటినందుకు గాను కేంద్రం నిర్ణయించిన ఫ్లాట్ రూ. 5 ఛార్జీని ఆ పెట్రోల్ బంక్ లేదా రైల్వే సంస్థలే కట్టుకుంటాయి, కస్టమర్ కాదు.
అక్టోబర్ 15 నుండి అమల్లోకి రాబోయే ఈ కొత్త నిబంధనల ప్రకారం.. రూ. 2,000 దాటిన పెద్ద వ్యాపార లావాదేవీలపై 0.4% ఛార్జీ వర్తిస్తుంది. అయితే ఈ ఛార్జీ గరిష్టంగా రూ. 300 మాత్రమే ఉంటుంది. అంటే వ్యాపారి ఎంత పెద్ద మొత్తంలో పేమెంట్ అందుకున్నా రూ. 300 కంటే ఎక్కువ ఛార్జ్ పడదు. మరి చిన్న వ్యాపారుల పరిస్థితి ఏంటి? ఇక్కడే ప్రభుత్వం మరో ఊరటనిచ్చింది. నెలకు రూ. 1 లక్ష లోపు డిజిటల్ చెల్లింపులు అందుకునే చిన్న కిరాణా కొట్లు, వీధి వ్యాపారులకు ఈ ఛార్జీల నుండి పూర్తి మినహాయింపు ఇచ్చింది. క్రెడిట్ కార్డుల లాగా ఈ యూపీఐ ఛార్జీల భారాన్ని కస్టమర్లపైకి నెట్టడానికి వీల్లేదని, ఒకవేళ అలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని బ్యాంకులు, యూపీఐ యాప్ సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది.
సోషల్ మీడియాలో వస్తున్నట్లుగా సాధారణ ప్రజలకు యూపీఐ పై ఎలాంటి ఛార్జీలు పడవు, అది ఎప్పటికీ ఉచితమే. ఈ సరికొత్త ఛార్జీల ద్వారా వచ్చే ఆదాయాన్ని బ్యాంకులు మరియు పేమెంట్ యాప్స్ మౌలిక సదుపాయాల విస్తరణకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయడానికి వినియోగిస్తాయి. కాబట్టి తప్పుడు ప్రచారాలను నమ్మకండి