టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభానికి కేవలం ఒక్కరోజే మిగిలి ఉంది. ఇప్పటికే వార్మప్ మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. ఈ టోర్నమెంట్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా ఈ మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇప్పటికే కీలక బౌలర్లు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్న ఆస్ట్రేలియాకు హేజిల్‌వుడ్ దూరం కావడం కోలుకోలేని దెబ్బగా మారింది.జోష్ హేజిల్‌వుడ్ సూపర్-8 దశ నాటికి కోలుకుంటాడని ఆస్ట్రేలియా యాజమాన్యం భావించినప్పటికీ.. తాజా నివేదికల ప్రకారం అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి ఇంకా చాలా సమయం పడుతుందని తేలింది. ఆస్ట్రేలియా జాతీయ సెలక్టర్ టోనీ డోడెమైడ్ మాట్లాడుతూ.. "హేజిల్‌వుడ్ కోలుకోవడానికి మరింత సమయం పడుతుంది. అతనిని త్వరగా మైదానంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తే రిస్క్ పెరుగుతుంది. అందుకే అతడిని పక్కన పెట్టక తప్పలేదు" అని పేర్కొన్నారు.
ప్రస్తుతానికి హేజిల్‌వుడ్ స్థానంలో ఎవరినీ భర్తీ చేయడం లేదని.. అవసరాన్ని బట్టి తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో ఇదో విచిత్రమైన పరిస్థితిగా చెబుతున్నారు. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించగా.. టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఇప్పుడు హేజిల్‌వుడ్ కూడా తప్పుకోవడంతో 2011 మార్చి తర్వాత ఆస్ట్రేలియా జట్టు తమ 'బిగ్ త్రీ' స్టార్క్, కమిన్స్, హేజిల్‌వుడ్ పేసర్లు ఎవరూ లేకుండా ఆడుతున్న మొదటి ప్రపంచకప్ ఇదే కానుంది.
కీలక బౌలర్లు లేని ఈ తరుణంలో మిచెల్ మార్ష్ సేన తన బౌలింగ్ బలహీనతలను ఎలా అధిగమిస్తుందో చూడాలి.ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టులో ఫ్రంట్‌లైన్ పేసర్లుగా జేవియర్ బార్ట్లెట్, బెన్ ద్వార్షుయిస్ మాత్రమే పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నారు. పాకిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 3-0తో క్లీన్ స్వీప్ అయిన ఆస్ట్రేలియాకు, నెదర్లాండ్స్‌తో జరగాల్సిన వార్మప్ మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఫిబ్రవరి 11న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో ఆస్ట్రేలియా తన ప్రపంచకప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. అనంతరం జింబాబ్వే, శ్రీలంక , ఒమన్ లతో తలపడుతుంది.