ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన క్రికెట్ లీగ్ ఐపీఎల్ కొత్త సీజన్ శనివారం ప్రారంభం కానుంది. బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే తొలి పోరుతో ఈ సందడి మొదలవుతుంది. అయితే కొత్త సీజన్ మొదలవ్వడానికి ముందే అభిమానులు పాత రికార్డులు గుర్తు చేసుకుంటున్నారు.ఐపీఎల్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయం సాధించిన రికార్డు ముంబయి ఇండియన్స్ పేరిట ఉంది. 2017 సీజన్ లో ముంబయి జట్టు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను ఏకంగా 146 పరుగుల తేడాతో ఓడించింది. భారీ విజయాల జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తిరుగులేని జట్టుగా నిలుస్తోంది. 2016 సీజన్ లో గుజరాత్ లయన్స్‌ను ఆర్సీబీ 144 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ 249 పరుగుల భారీ స్కోరు సాధించగా, గుజరాత్ 18.4 ఓవర్లలో 104 రన్స్‌కే ఆలౌట్ అయింది. ఇదే కాకుండా అంతకుముందు ఆర్సీబీ 2015లో పంజాబ్‌పై 138 పరుగుల తేడాతో, 2013లో పుణె వారియర్స్‌పై 130 పరుగుల తేడాతో ఘనవిజయాలు సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఐపీఎల్ ప్రారంభ సీజన్ తొలి మ్యాచ్‌లోనే కేకేఆర్ జట్టు ఆర్సీబీని 140 పరుగుల తేడాతో ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
మరోవైపు సిక్సర్ల విషయంలో కూడా ముంబయి ఇండియన్స్ తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. గత 18 సీజన్లలో ముంబయి మొత్తం 1,823 సిక్సర్లు బాది అగ్రస్థానంలో నిలిచింది. రోహిత్ శర్మ, పోలార్డ్, హార్దిక్ పాండ్య వంటి హిట్టర్లు ఉండటమే దీనికి కారణం. ఇక ఆర్సీబీ 1,774 సిక్సర్లతో రెండో స్థానంలో ఉంది. ముంబయికి, ఆర్సీబీకి మధ్య సిక్సర్ల వ్యత్యాసం చాలా తక్కువగా ఉండటంతో, రానున్న సీజన్లో ఆర్సీబీ ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ 1,610 సిక్సర్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.
2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకే సీజన్లో రికార్డు స్థాయిలో 178 సిక్సర్లు బాది కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది. ఆ తర్వాతి ఏడాది పంజాబ్ కింగ్స్ కూడా అద్భుతంగా రాణించి 173 సిక్సర్లు కొట్టింది.
వ్యక్తిగత రికార్డుల విషయానికి వస్తే, ఐపీఎల్లో అత్యధిక ఫోర్లు బాదిన బ్యాటర్లలో విరాట్ కోహ్లీ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 267 మ్యాచులు ఆడిన కోహ్లీ అత్యధికంగా 771 ఫోర్లు బాదాడు. అతడి తర్వాత శిఖర్ ధావన్ 768, డేవిడ్ వార్నర్ 663, రోహిత్ శర్మ 640, అజింక్య రహానే 514 టాప్ 5లో ఉన్నారు. కోహ్లీ కేవలం ఫోర్లలోనే కాకుండా 8,661 పరుగులతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల వీరుడిగా కూడా టాప్‌లో కొనసాగుతున్నాడు. కాగా ఐపీఎల్ 2026 సీజన్ లో మరిన్ని కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది.