ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతోంది. మినీ వేలంలో 10 కాదు, 20 కాదు ఏకంగా 25.2 కోట్లు పెట్టి కేకేఆర్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ రికార్డు సృష్టించాడు. తీరా చూస్తే.. పేలవ ప్రదర్శనతో చెత్త రికార్డులు మూటగట్టుకుంటున్నాడు. వరుసగా మూడు మ్యాచుల్లోనూ అత్యంత పేలవ ప్రదర్శనతో పెవిలియన్ చేరి తీవ్ర విమర్శల పాలవుతూ వస్తున్నాడు.తొలి మ్యాచ్ లో 2 , తర్వాత 18 , తర్వాత 4.. ఇప్పటి వరకూ మూడు మ్యాచ్ లలో కలిపి కేవలం 24 పరుగులు చేశాడు. దీంతో కోటి రూపాయలకు ఒక పరుగు చేశాడంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి.
గ్రీన్ కు అన్ని కోట్లు పెట్టడం అవసరమా అన్న అభిప్రాయం అప్పుడే వినిపించింది. గతంలో అతని నుంచి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు పెద్దగా ఏమీ లేవు. అయినా కూడా కోల్ కతా ఏం ఆలోచించి అన్ని కోట్లు వెచ్చించిందో ఇప్పటికీ ఆశ్చర్యమే. జట్టుకు అవసరం అయినప్పుడు కూడా ఆడలేకపోతే.. అంత ధర పెట్టి దండగ అంటూ గ్రీన్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. అదే కాకుండా గ్రీన్ ఇప్పటి వరకు బౌలింగ్ కూడా చేయడం లేదు. ఈ విషయంపై కేకేఆర్ కెప్టెన్ రహానె కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తొలి మ్యాచ్ అనంతరం ఈ అంశంపై మీడియా ప్రశ్నించగా.. క్రికెట్ ఆస్ట్రేలియాకే సమాధానం తెలియాలంటూ సమాధానమిచ్చాడు.దీంతో కేకేఆర్ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా పర్యవేక్షణలో ఉన్న వెన్ను నొప్పి సమస్యల కారణంగా గ్రీన్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో బౌలింగ్ చేయడం లేదు. ఇది కేకేఆర్ జట్టు సమతుల్యతను దెబ్బతీసింది.
బలహీనమైన బౌలింగ్ విభాగాన్ని ఉపయోగించాల్సి వస్తోంది. గ్రీన్ ఎప్పుడు బౌలింగ్ ప్రారంభిస్తాడనే దానిపై స్పష్టత లేదు. దీంతో అతన్ని కేకేఆర్ తుది జట్టు నుండి తొలగించాలని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి గ్రీన్ సరిపోడని విశ్లేషించాడు. ఇదిలా ఉంటే ప్రైస్ ట్యాగ్ ఒత్తిడి గ్రీన్ పై పడినట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు. 25 కోట్లు పెట్టి కొన్న ప్లేయర్ ఎలా ఆడుతాడో అన్న ఆసక్తి ప్రతి అభిమానిలో ఉండటం సహజం. భారీ అంచనాలతో బరిలోకి దిగుతుండటంతో ప్లేయర్‌పై ఒత్తిడి పెరిగి ఇలా పేలవ ప్రదర్శన కనబరుస్తారనే వాదన వినిపిస్తోంది. గత సీజన్‌లో స్టార్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్‌ను కేకేఆర్ అత్యధిక ధరకు తీసుకుంది. అతడు కూడా ఎక్కువ ప్రభావం చూపలేకపోయాడు. ఫలితంగా కేకేఆర్ ఈ సీజన్ వేలానికి ముందు వెంకటేశ్ అయ్యర్‌ను వదిలేసింది. ప్రైస్ ట్యాగ్ ఒత్తిడిని అధిగమించి తర్వాతి మ్యాచుల్లో అయినా గ్రీన్ పుంజుకుంటాడో లేదో చూడాలి.