ముంబై ప్లే ఆఫ్స్ చేరుతుందా ? ఈక్వేషన్ ఇదే..!

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన చేస్తోంది. ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై.. ఈ సీజన్‌ను విజయంతో ఆరంభించింది. కానీ ఆ తర్వాత జట్టుకు పెద్దగా కలిసిరావడం లేదు.

Post Published By: dialnews
Updated : 5 May 2026, 9:15 PM IST

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన చేస్తోంది. ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై.. ఈ సీజన్‌ను విజయంతో ఆరంభించింది. కానీ ఆ తర్వాత జట్టుకు పెద్దగా కలిసిరావడం లేదు. ఆ తర్వాత ఆడిన 8 మ్యాచులలో ఏడింట్లో పరాజయం పాలైంది. 9 మ్యాచులలో రెండు విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో చివరి నుంచి రెండో ప్లేసులో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరుతుందా.. చేరాలంటే ఏం జరగాలి.. ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది. అసలు ప్లే ఆఫ్ చేరాలంటే ఎన్ని పాయింట్లు కావాలన్న దానిపైనా ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. 2022 సీజన్‌ నుంచి ఐపీఎల్‌లో 10 జట్లు పాల్గొంటున్నాయి.

లీగ్ స్టేజ్‌లో 8 విజయాలతో 16 పాయింట్స్ దక్కించుకునే జట్టు దాదాపుగా ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటుంది. ఏడు విజయాలు సాధించిన జట్లు సైతం ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంటుంది. కానీ అది నెట్ రన్ రేట్.. ఇతర జట్ల ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. లీగ్ స్టేజ్‌లో 6 విజయాలు సాధించి.. ప్లే ఆఫ్స్ చేరడం అరుదు. 2019లో సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రమే.. ఇలా ప్లే ఆఫ్స్ చేరింది.ఈ లెక్కన ప్రస్తుతం ముంబై ఇండియన్స్.. 9 మ్యాచులలో రెండింట్లో గెలిచింది.

ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగతా ఐదు మ్యాచులలో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. అలా గెలిచినా.. ప్లే ఆఫ్స్ చేరుతుందని కచ్చితంగా చెప్పలేం. అందుకు మిగతా జట్ల ప్రదర్శన.. ముంబై నెట్ రన్ రేట్ కూడా కీలకం అవుతుంది. ఒకవేళ ముంబై ప్లే ఆఫ్స్ చేరాలంటే కేవలం గెలవడం మాత్రమే కాకుండా.. ప్రతీ మ్యాచులోనూ మంచి నెట్ రన్ రేట్ సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఐపీఎల్ 2026లో ముంబై తన చివరి ఐదు మ్యాచులు లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్‌తో ఆడాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ జట్లను ముంబై ఓడించాలంటే.. సమష్టిగా రాణించాల్సి ఉంటుంది.

Published : 
  • 5 May 2026, 9:15 PM IST