టాలీవుడ్ నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో నిత్యం ట్రోలింగ్‌కు గురయ్యే సెలబ్రిటీలలో ఒకరు. సినిమాల్లో నటించడం, విభిన్నమైన టాక్ షోలతో ఆకట్టుకోవడం ఒకెత్తయితే.. ఆమె మాట్లాడే తెలుగు యాసను టార్గెట్ చేస్తూ నెటిజన్లు చేసే ట్రోల్స్ మరో ఎత్తు. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఎదురవుతున్న తీవ్ర వేధింపులు, ట్రోలింగ్ మరియు డిప్రెషన్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రసిద్ధ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' లో ప్రసారమవుతున్న ‘టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్’ అనే షోకి మంచు లక్ష్మి, నటుడు ‘వైవా’ హర్ష జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. యాంకర్ రష్మి గౌతమ్ ఈ షోకి హోస్ట్‌గా చేస్తోంది. ఇటీవల విడుదలైన 7వ ఎపిసోడ్ ప్రోమోలో ట్రోలింగ్ అంశంపై ఆసక్తికర చర్చ జరిగింది. "ఈ రోజుల్లో యంగ్ జనరేషన్లో డిప్రెషన్, యాంగ్జైటీలు పెరగడానికి అతిపెద్ద కారణం సోషల్ మీడియా ట్రోలింగే" అని యాంకర్ రష్మీ ప్రస్తావించింది. రష్మి వ్యాఖ్యలకు సపోర్ట్ చేస్తూ మంచు లక్ష్మి సంచలన విషయాలు వెల్లడించారు.
"నన్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అసలు వైవా హర్ష నుంచే ప్రారంభమైంది. మొదట్లో అతడు నన్ను అనుకరిస్తూ చేసిన కొన్ని స్ఫూఫ్‌లు, వీడియోలు నన్ను వ్యక్తిగతంగా, ఎమోషనల్‌గా తీవ్రంగా ప్రభావితం చేశాయి" అని లక్ష్మి ఓపెన్‌గా చెప్పారు. మంచు లక్ష్మి వ్యాఖ్యలపై వైవా హర్ష వెంటనే స్పందించాడు. "మీరు అంతగా బాధపడి ఉంటే మనస్ఫూర్తిగా క్షమించండి. నేను మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా గాయపరచడానికి లేదా హాని చేయాలనే ఉద్దేశంతో ఆ వీడియోలు చేయలేదు" అని వివరణ ఇస్తూ క్షమాపణలు కోరాడు. ట్రోలింగ్ కాలక్రమేణా ఎలా మారుతుందో వివరిస్తూ మంచు లక్ష్మి మరింత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పరిస్థితులు దారుణంగా దిగజారిపోయాయని చెప్పారు. "సోషల్ మీడియా వేధింపులు ఇప్పుడు ఏ స్థాయికి వెళ్లాయంటే.. కొందరు వికృత మనస్తత్వం ఉన్న వ్యక్తులు డైరెక్ట్ మెసేజెస్ ద్వారా తమ ప్రైవేట్ భాగాల ఫోటోలను కూడా నాకు పంపిస్తున్నారు" అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ట్రోలింగ్ అనేది కేవలం సరదా మీమ్స్‌తో ఆగిపోవడం లేదని, అది సైబర్ వేధింపులుగా మారి మనుషుల మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తోందన్నారు మంచు లక్ష్మి. ఆమె చేసిన ఈ వ్యాఖ్యల ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. సీనియర్ నటుడు మోహన్ బాబు కుమార్తెగా, ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన ఒక ప్రముఖ సెలబ్రిటీకే ఇలాంటి వికృత వేధింపులు ఎదురవుతుంటే, ఇక ఎలాంటి రక్షణ లేని సాధారణ అమ్మాయిలు, మహిళల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఆలోచించాలంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సైబర్ వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళల సేఫ్టీకి తగిన నిబంధనలు అమలు చేయాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.