అమ్మ పెట్టే అన్నం, సినిమా సక్సెస్ ఎప్పటికీ బోర్ కొట్టవు అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సక్సెస్ ఈవెంట్‌లో హైలైట్‌గా నిలిచాయి. ఈ చిత్ర విజయం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని, వింటేజ్ చిరంజీవితో పాటు ఆ రోజుల్లో చూసిన వింటేజ్ షీల్డ్ లను మళ్ళీ ఈ సినిమా ద్వారా చూడటం ఎంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. పాత రోజుల్లో సినిమా శతదినోత్సవ వేడుకల్లో షీల్డ్స్ అందుకోవడం ఎంత కిక్ ఇచ్చేదో, ఇప్పుడు ఈ సినిమా విజయం కూడా అదే స్థాయి ఆనందాన్ని పంచిందని ఆయన వెల్లడించారు. సినీ పరిశ్రమలోకి తమ పిల్లలను పంపడానికి భయపడే తల్లిదండ్రులకు ధైర్యాన్నిస్తూ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. మగ పిల్లలైనా, ఆడపిల్లలైనా ఇండస్ట్రీలోకి వస్తామంటే నిరభ్యంతరంగా ప్రోత్సహించాలని కోరారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదని, చిత్ర పరిశ్రమ ఒక అద్దం లాంటిదని ఆయన స్పష్టం చేశారు. మనం ఎలా ప్రవర్తిస్తామో, మనకు దక్కే ఫలితం కూడా అలాగే ఉంటుందని, మంచిగా ఉంటే మంచే జరుగుతుందని పరిశ్రమ వాతావరణంపై ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు.
సినిమా నిర్మాణం, బడ్జెట్ కంట్రోల్ గురించి మాట్లాడుతూ మెగాస్టార్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇండస్ట్రీలో ఎవరి వర్కింగ్ స్టైల్ వారిదని చెబుతూనే, కొందరు అవుట్ డోర్ యూనిట్ బిల్లులు ఎక్కువగా వేస్తున్నారనే విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఈ సినిమా విషయంలో మాత్రం నిర్మాతలు, దర్శకులు పక్కా ప్రణాళికతో వ్యవహరించారని మెచ్చుకున్నారు. అనుకున్న బడ్జెట్‌లో, కేవలం 85 రోజుల్లోనే ఈ సినిమాను పూర్తి చేయగలగడం గొప్ప విషయమని.. ఇది నిర్మాతలకు ఎంతో మేలు చేసిందని తెలిపారు. కేవలం తన సినిమా విజయం గురించే కాకుండా, సంక్రాంతికి విడుదలైన ఇతర సినిమాల గురించి కూడా చిరంజీవి సానుకూలంగా స్పందించారు. సంక్రాంతి బరిలో నిలిచిన అన్ని సినిమాలు విజయవంతం అవ్వడం ఎంతో సంతోషకరమని, ఇది చిత్ర పరిశ్రమకు శుభపరిణామమని అన్నారు.
పోటీతత్వం పక్కనపెట్టి, అన్ని సినిమాలు ఆడాలని కోరుకోవడం ద్వారా ఇండస్ట్రీ పెద్దగా తన హుందాతనాన్ని మరోసారి చాటుకున్నారు. చివరగా తన వయసు, కష్టం గురించి వచ్చిన కామెంట్స్‌పై చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. ఈ వయస్సులో కూడా ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? అని కొందరు అంటుంటే తనకు భావోద్వేగం కలుగుతోందని అన్నారు. అయితే తనకు కష్టపడటంలోనే అసలైన ఆనందం ఉందని, ఆ కష్టానికి తగిన ఉత్సాహం తన అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రశంసల నుంచే లభిస్తుందని మనసు విప్పి చెప్పారు. ఆ ప్రేమే తనను ఇంకా ఉత్సాహంగా పని చేసేలా ముందుకు నడిపిస్తోందని ముగించారు.