Top story: అమరావతి అభివృద్ధి పేరుతో అరాచకం.. మైనింగ్‌ సెస్‌ దోచేస్తున్న AMR సంస్థ..!

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ఆగిరిపల్లి మండలం కనసానిపల్లి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్రమ గ్రావెల్ మైనింగ్ దందా యథేచ్ఛగా సాగుతోంది. అమరావతి రాజధాని నిర్మాణ అవసరాల పేరుతో అనుమతులు పొంది, నిబంధనలను బొందపెడుతూ యంత్రాలతో మైనింగ్ నిర్వహిస్తున్న తీరుపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Post Published By: dialnews
Updated : 31 August 2026, 1:00 PM IST

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ఆగిరిపల్లి మండలం కనసానిపల్లి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్రమ గ్రావెల్ మైనింగ్ దందా యథేచ్ఛగా సాగుతోంది. అమరావతి రాజధాని నిర్మాణ అవసరాల పేరుతో అనుమతులు పొంది, నిబంధనలను బొందపెడుతూ యంత్రాలతో మైనింగ్ నిర్వహిస్తున్న తీరుపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి జమకావాల్సిన మైనింగ్ సెస్‌కు గండికొడుతూ AMR ప్రైవేట్ సంస్థ అడ్డగోలుగా సాగిస్తున్న అక్రమాలపై గ్రామస్థులు సమరశంఖం పూరించారు. కనసానిపల్లి వద్ద గ్రావెల్ లోడుతో వెళ్తున్న AMR సంస్థకు చెందిన లారీలను అడ్డుకుని, సిబ్బందిని నిలదీయడంతో ఆగిరిపల్లి ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మైనింగ్ నిబంధనల ప్రకారం క్వారీ నుంచి ఖనిజాన్ని రవాణా చేసే ప్రతి వాహనానికి సంబంధిత మైనింగ్ శాఖ నుంచి అనుమతి పొంది, చెల్లించాల్సిన ‘మైనింగ్ సెస్‌’కు రశీదు పొందాలి.

ఈ సెస్‌ సొమ్ము నేరుగా ప్రభుత్వ ఖజానాకు ఆదాయంగా జమ అవుతుంది. కానీ, కనసానిపల్లి పరిసర క్వారీల్లో ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మైనింగ్ శాఖ ప్రభుత్వ అధికారిక రశీదులకు బదులుగా AMR ప్రైవేట్ సంస్థకు చెందిన సిబ్బంది రోడ్డుపై చెక్ పోస్టు ఏర్పాటు చేసి, తమ సొంత స్లిప్పులు ఇస్తూ లారీలను పంపుతున్నారు. క్వారీ నుంచి వెళ్తున్న గ్రావెల్ లారీలను అడ్డుకున్న గ్రామస్థులు వాళ్లను నిలదీశారు. లారీలో ఉన్న గ్రావెల్ లోడుకు మైనింగ్ సెస్‌ చెల్లించారా లేదా పరిశీలించకుండా ప్రైవేట్ స్లిప్పులు ఎలా ఇస్తున్నారంటూ అడ్డుకున్నారు. దీనికి స్పష్టమైన సమాధానం చెప్పలేకపోయిన AMR కంపెనీ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో మైనింగ్ అక్రమాలపై అనుమానాలు మరింత బలోపేతమయ్యాయి. అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి పనుల కోసం గ్రావెల్ అవసరం ఉందనే నెపంతో ప్రభుత్వం నుంచి క్వారీ అనుమతులు తీసుకున్నారు. అయితే, ఇక్కడ తవ్విన గ్రావెల్ మాత్రం రాజధానికి కాకుండా వ్యాపార స్వార్థం కోసం ఇతర ప్రాంతాలకు తరలిపోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

కనసానిపల్లి నుంచి రోజుకు వందలాది లారీల్లో క్వారీ రాయి, గ్రావెల్‌ను నున్న, పామర్రు, విజయవాడ తదితర ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ వెంచర్లకు, పారిశ్రామిక అవసరాలకు అక్రమంగా తరలిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారని గ్రామస్థులు చెప్తున్నారు. గత ప్రభుత్వ హయాంలోనూ ఇదే కనసానిపల్లికి అనుకుని ఉన్న తోటపల్లి క్వారీలో భారీగా అక్రమ మైనింగ్ జరగడంతో మైనింగ్ శాఖ అధికారులు విచారణ జరిపి, అప్పట్లో 3 కోట్లకు పైగా ఫైన్ విధించారు. ఇంతటి ఘనచరిత్ర ఉన్న ప్రాంతంలో.. ప్రభుత్వం మారినా, అధికారులు మారినా అక్రమ క్వారీయింగ్ తీరు మాత్రం మారకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండికొడుతూ ప్రైవేట్ స్లిప్పులతో AMR సంస్థ దందా సాగిస్తున్నా.. మైనింగ్ శాఖ అధికారులు కనీసం అటువైపు చూడకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. మైనింగ్ రశీదుల స్థానంలో AMR కంపెనీ బిల్లులతో రవాణా చేయడం నిబంధనల ప్రకారం ఎంత వరకు సక్రమమనే దానిపై మైనింగ్ శాఖ, AMR సంస్థ బహిరంగ ప్రకటన చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

అడ్డగోలుగా సాగుతున్న గ్రావెల్ తోడకం వల్ల ఆగిరిపల్లి ప్రాంతంలోని కొండలు కరిగిపోతున్నాయి. కొండలను పిండి చేస్తూ జరుపుతున్న పేలుళ్లు, భారీ వాహనాల రాకపోకలతో గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర దుమ్ము, ధూళి రేగుతోంది. దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినడమే కాకుండా, సమీపంలోని మామిడి, పామాయిల్ తోటలపై దుమ్ము పేరుకుపోయి తీవ్ర పంట నష్టం జరుగుతోంది. అంతేకాకుండా, పరిమితికి మించిన లోడుతో వందలాది లారీలు తిరగడంతో గ్రామీణ రహదారులు పూర్తిగా ధ్వంసమై గుంతలమయంగా మారాయి. రాజధాని పేరుతో జరుగుతున్న ఈ అక్రమ దోపిడీని తక్షణమే అరికట్టాలని, అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న AMR సంస్థపై, పన్నుల ఎగవేతకు సహకరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆగిరిపల్లి, కనసానిపల్లి ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మైనింగ్ అధికారులు వెంటనే స్పందించి క్వారీలపై దాడి చేసి తనిఖీలు చేపట్టకపోతే, ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామంటున్నారు గ్రామస్థులు.

Published : 
  • 31 August 2026, 1:00 PM IST