వ్యూహాత్మక న్యూక్లియర్ వెపన్స్.. ఉక్రెయిన్ వార్‌జోన్‌లో టెర్రర్ పుట్టిస్తున్న డెడ్లీ వెపన్స్ ఇవే.పుతిన్ ఎక్కడ ఈ అస్త్రాలను సంధిస్తారో అన్న ఆందోళన ప్రపంచాన్ని టెన్షన్ పెడుతోంది. చిత్రంగా ఉక్రెయిన్‌కు బదులు మాస్కో వర్గాలే టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ పేరు వినగానే వణుకుతున్నాయని బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ చేసింది. ఎందుకంటే, ఒక్కసారి ఈ అస్త్రాలు గర్జించడం మొదలైతే అణు యుద్ధం ఆరంభమైనట్టే. టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్.. స్ట్రాటజిక్ అణ్వస్త్రాల కంటే పరిమాణంలో, తీవ్రతలో భిన్నంగా ఉంటాయి. వీటిని నిర్దిష్ట ప్రాంతంలో శత్రువుల సైనిక స్థావరాలు, బంకర్లు లేదా భారీ బలగాల సమీకరణలను తక్షణమే తుడిచిపెట్టడానికి ఉపయోగిస్తారు. వీటి విధ్వంసక సామర్థ్యం పరిమితమే అయినా... విస్ఫోటనం తర్వాత వెలువడే భయంకర రేడియేషన్, కాలుష్యం, ప్రాణనష్టం మాత్రం అపారంగా ఉంటాయి. ఒక్కసారి యుద్ధరంగంలో వీటిని ప్రయోగిస్తే, అది ప్రపంచాన్ని నిరోధించలేని పూర్తి స్థాయి అణు యుద్ధం వైపు నెట్టివేసే ప్రమాదం ఉంది. అందుకే, బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ ప్రపంచాన్ని భయపెడుతోంది.
భీకర యుద్ధంలో రష్యా పలుమార్లు అణు హెచ్చరికలు చేసింది. వాటినికి పాశ్చాత్య దేశాలు వ్యూహాత్మక బెదిరింపుగానే చూశాయి. కానీ ప్రస్తుత సమీకరణాలు పూర్తిగా మారాయి. పుతిన్ రాజకీయ భవిష్యత్తు, రష్యా ఆధిపత్యం రెండూ ఈ యుద్ధ ఫలితంపైనే ఆధారపడి ఉన్నాయి. పుతిన్ దృష్టిలో యుద్ధం ఎంతకాలం సాగినా నష్టం లేదు కానీ, అందులో ఎట్టిపరిస్థితుల్లో ఓటమి పాలవ్వకూడదు. ఈ పరిస్థితుల్లో సంప్రదాయ యుద్ధంలో లక్ష్యాలు నెరవేరకపోతే, రష్యా ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి పుతిన్ అణు బటన్ నొక్కడానికి కూడా వెనుకాడరని మాస్కోలోని అధికార యంత్రాంగమే తీవ్రంగా భయపడుతోంది. ఈ తీవ్ర సంక్షోభాన్ని అమెరికా గతంలోనే అత్యంత సున్నితంగా విశ్లేషించింది. రష్యా ఏ రూపంలోనైనా అణ్వాయుధాన్ని ప్రయోగిస్తే, దానికి ప్రతిస్పందనగా పశ్చిమ కూటమి రంగంలోకి దిగి రష్యా సైనిక స్థావరాలను ధ్వంసం చేస్తుందని హెచ్చరించింది. పరిస్థితి చేయిదాటి పోకుండా అటు చైనా, ఇటు భారత్ వంటి కీలక గ్లోబల్ శక్తుల ద్వారా మాస్కోపై తెరవెనుక భారీ స్థాయిలో దౌత్యపరమైన ఒత్తిడి తెచ్చారు.
నిజానికి.. సీఐఏ చీఫ్ రాట్క్లిఫ్ అత్యవసరంగా మాస్కోకు వెళ్లి మంతనాలు జరపడం చూస్తుంటే బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ నిజమే అనిపిస్తోంది. వాషింగ్టన్ ఈ పర్యటన వివరాలను బయటకు చెప్పనప్పటికీ, అందులోని ప్రధాన ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. రష్యా తన దుందుడుకుతనాన్ని ఇతర యూరోప్ దేశాలపైకి మళ్లించవద్దని, ముఖ్యంగా బాల్టిక్ ప్రాంతాన్ని వివాదంలోకి లాగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వాషింగ్టన్ చివరి హెచ్చరిక జారీ చేసినట్లు దౌత్య వర్గాలు భావిస్తున్నాయి. పశ్చిమ దేశాల నిఘా వర్గాల తాజా నివేదికల ప్రకారం.. రష్యా తన లక్ష్య సాధన కోసం యూరోప్‌పై హైబ్రిడ్ వార్ఫేర్ను తీవ్రతరం చేయనుంది. ఇందులో ప్రభుత్వ వ్యవస్థలను కూల్చేసే సైబర్ దాడులు, గ్యాస్ పైప్లైన్లు-కమ్యూనికేషన్ కేబుల్స్ వంటి కీలక మౌలిక వసతుల విధ్వంసం, తూర్పు యూరోపియన్ దేశాల సరిహద్దుల్లో రహస్య సైనిక చొరబాట్లు ప్రధాన భాగం కానున్నాయని నివేదికలు పేర్కొన్నాయి.
ముఖ్యంగా నాటో ముఖద్వారమైన పోలాండ్ వంటి దేశాలు ప్రస్తుతం తీవ్ర భయాందోళనలో ఉన్నాయి. పోలాండ్ సరిహద్దుల్లో ఉద్దేశపూర్వకంగా డ్రోన్లు లేదా మిస్సైళ్లతో కవ్వింపులకు పాల్పడటం, లేదా తామే దాడులు జరిపి ఆ నిందను ఉక్రెయిన్‌పై నెట్టేసే ఫాల్స్-ఫ్లాగ్ ఆపరేషన్లకు రష్యా తెరతీసే ప్రమాదం ఉందని పాశ్చాత్య నిఘా నివేదికలు హెచ్చరిస్తున్నాయి. నాటో సహనాన్ని పరీక్షించి, సభ్య దేశాలమధ్య చీలిక తేవడమే ఈ కవ్వింపుల వెనుక ఉన్న అసలు ఎత్తుగడగా కనిపిస్తోంది. మరోవైపు, పశ్చిమ దేశాలతో చర్చలు ఇక సమయం వృథా అని భావిస్తున్న పుతిన్, క్షేత్రస్థాయిలో దాడుల తీవ్రతను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. రాజధాని కీవ్‌లోని అత్యంత కీలక పాలనా కేంద్రాలతో పాటు ఇతర ప్రధాన నగరాల మౌలిక వసతులపై భారీ స్థాయి బాలిస్టిక్ క్షిపణి వర్షం కురిపించాలని క్రెమ్లిన్ ప్రణాళికలు రచిస్తోంది. పాశ్చాత్య ఆర్థిక ఆంక్షలు ఎన్ని విధించినా, దేశ ఆర్థిక వ్యవస్థపై ఎంత భారపడినా యుద్ధాన్ని విరమించే ఆలోచనే లేదని పుతిన్ తన అంతర్గత వర్గాలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఈ వివాదాన్ని మరింత ప్రమాదకర స్థాయికి నెడుతున్న మరో ప్రధాన అంశం.. నాటో అందిస్తున్న సహాయం. ఉక్రెయిన్‌కు అమెరికా, యూరోప్ దేశాలు కేవలం ఆయుధాలే కాకుండా, ఉపగ్రహాల ద్వారా రష్యా సైనిక కదలికల నిఘా సమాచారాన్ని అందిస్తున్నాయి. ఈ సమాచారంతో రష్యా ప్రధాన భూభాగంపై జరుగుతున్న దీర్ఘశ్రేణి దాడులను పుతిన్ ఉక్రెయిన్ దాడులుగా చూడటం లేదు. ఇవి నేరుగా నాటో రష్యాపై చేస్తున్న దాడులేనని, తాము నేరుగా పశ్చిమ దేశాల సైన్యంతోనే పోరాడుతున్నామని క్రెమ్లిన్ భావిస్తోంది. ఇదే పరిస్థితులను అణు సంక్షోభం వైపు నెడుతోంది. అమెరికా తరఫున రాయబారులు కొత్త రాజీ ఫార్ములాలతో మాస్కోకు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఇరుపక్షాల మధ్య నెలకొన్న తీవ్ర అవిశ్వాసం వల్ల శాంతి ఒప్పందం కుదిరే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు.