వాతావరణ మార్పుల ప్రభావంతో మన దేశంలో మునుపెన్నడూ లేనంతగా పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. భారతదేశంలో వాతావరణ సరళిపై గత 52 ఏళ్ల డేటాను విశ్లేషించి శాస్త్రవేత్తలు చేపట్టిన అధ్యయనంలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే దక్షిణ భారతదేశం అత్యంత వేగంగా పొడిబారిపోతోందని మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీవ్రమైన కరువు ప్రమాదాన్ని ఎదుర్కొంటోందని ఈ అధ్యయనం హెచ్చరించింది. భారత వాతావరణ శాఖ, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించాయి. ఉత్తర భారత్ లేదా ఇతర ప్రాంతాలతో పోల్చితే, దక్షిణ భారతదేశంలో కరువు పరిస్థితులు అతివేగంగా విస్తరిస్తున్నాయి.
2000వ సంవత్సరం తర్వాతి నుంచి దక్షిణాదిలోని దాదాపు 40 శాతానికి పైగా భూభాగం పలుమార్లు తీవ్ర కరువు కోరల్లో చిక్కుకుంది. తూర్పు తీరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలు అత్యంత ప్రమాదకరమైన కరువు ముప్పు పరిధిలో ఉన్నాయి. ఇందులో ఏపీ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. 1980ల నాటి పరిస్థితులతో పోలిస్తే, 2011–2021 మధ్యకాలంలో కరువు ప్రభావానికి గురైన ప్రాంతం 20 శాతం నుండి 30 శాతానికి పెరిగింది. పరిశోధకులు గత 52 ఏళ్ల ఐఎమ్‌డీ డేటాను విశ్లేషించడానికి 'ఇండియా క్లైమేట్ ఎక్స్‌ట్రీమ్స్ ఇండెక్స్' అనే ప్రత్యేక సూచీని రూపొందించారు. దీనికోసం పగటి ఉష్ణోగ్రతలు, రాత్రి వేళల్లో వేడి, ఉక్కబోత, వడగాల్పులు, వర్షాభావం, కరువు వంటి 7 కీలక అంశాలను ప్రామాణికంగా తీసుకున్నారు.
ఈ పరిశోధన అంచనా ప్రకారం ఈ తీవ్రమైన కరువు పరిస్థితుల వల్ల పలు రంగాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందులో మొదటిది వ్యవసాయ రంగం. వర్షపాతం తగ్గడం, భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడంతో పంట దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. రెండోది తాగునీటి ఎద్దడి. భూగర్భ జలాలు ఇంకిపోవడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తీవ్ర నీటి కొరత ఏర్పడుతుంది. ఈ ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు ఆరోగ్య, ఆర్థిక పరంగా కూడా సమస్యలు ఎదుర్కునే ప్రమాదముంది. విపరీతమైన వేడి, ఉక్కబోత మరియు నీటి ఎద్దడి వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుంది. వ్యవసాయ ఆధారిత రాబడులు తగ్గడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమయ్యే ప్రమాదం ఉంది. ఈ తీవ్రమైన ముప్పు నుండి బయటపడటానికి నిపుణులు ప్రభుత్వాలకు కొన్ని కీలక సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాలు వ్యవసాయం, నీటిపారుదల, మౌలిక వసతులు మరియు ఆరోగ్య రంగాల్లో వాతావరణ మార్పులను తట్టుకునేలా తక్షణ చర్యలు చేపట్టాలి. కేవలం రాష్ట్ర లేదా జిల్లా సగటుల ఆధారంగా కాకుండా, చిన్న చిన్న గ్రామాలు, మండలాల వారీగా నీటి లభ్యతను పర్యవేక్షించే అధునాతన వ్యవస్థలను అందుబాటులోకి తేవాలి. ఈ 'క్లైమేట్ ఇండెక్స్' ఆధారంగా ప్రతి ఏటా ఎక్కడెక్కడ నీటి కొరత లేదా కరువు వచ్చే అవకాశం ఉందో ముందే అంచనా వేసి తగిన ప్రత్యామ్నాయ ప్రణాళికలను రూపొందించుకోవాలి. వర్షపు నీటి నిల్వ, సముద్రపు నీటి శుద్ధి, డ్రిప్ ఇరిగేషన్ వంటి ఆధునిక సాగు పద్ధతులను విస్తృతంగా ప్రోత్సహించాలి. వాతావరణ మార్పులు అనేవి కేవలం ఊహాగానాలు కావని, ఈ 52 ఏళ్ల సమగ్ర అధ్యయనం స్పష్టం చేసింది. ఇప్పటి నుంచే ప్రభుత్వాలు, ప్రజలు అప్రమత్తమై నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేయకపోతే రాబోయే రోజుల్లో నీటి చుక్క కోసం తీవ్ర ఇబ్బందులు పడక తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.