టీమిండియాలోకి ఆకిబ్ నబీ ? ఇంగ్లాండ్ టూర్ కు ఛాన్స్…!

జమ్మూ కశ్మీర్‌కు చెందిన యువ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీపై భారత క్రికెట్ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అతని ప్రదర్శనను ప్రశంసిస్తూ, త్వరలోనే జాతీయ జట్టుకు ఎంపిక కావడం

Post Published By: dialnews
Updated : 2 March 2026, 11:55 AM IST

జమ్మూ కశ్మీర్‌కు చెందిన యువ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీపై భారత క్రికెట్ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అతని ప్రదర్శనను ప్రశంసిస్తూ, త్వరలోనే జాతీయ జట్టుకు ఎంపిక కావడం ఖాయమని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ పర్యటన నుంచే అతడి అంతర్జాతీయ కెరీర్ మొదలయ్యే అవకాశం ఉందని తెలిపాడు. గంగూలీ తన ఎక్స్ ఖాతాలో బీసీసీఐ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌లను ట్యాగ్ చేస్తూ కష్టాలు మనుషులను మరింత బలంగా మారుస్తాయనీ, ఆకిబ్ నబీ జాతీయ జట్టులోకి అడుగుపెట్టే దశకు చేరుకున్నాడనీ ట్వీట్ చేశాడు.

రంజీ ట్రోఫీ 2026 సీజన్‌లో జమ్మూ కశ్మీర్ జట్టు చరిత్ర సృష్టించింది. ఎనిమిది సార్లు విజేత అయిన కర్ణాటకను ఓడించి ఫైనల్‌లో విజయం సాధించింది. ఈ విజయంలో ఆకిబ్ నబీ కీలక పాత్ర పోషించాడు. హుబ్లీ వేదికగా జరిగిన ఫైనల్‌లో అతడి బౌలింగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. చాలాసార్లు ఐదు వికెట్లు తీసి తన సత్తా చాటుకున్నాడు. ఈ ప్రదర్శనపై భారత మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. దేశానికి ఆడాలనుకునే యువత అందరూ ఆకిబ్ నబీ మార్గంలో నడవాలన్నాడు. అతడి నిబద్ధత, కృషి అసాధారణమన్నాడు. టోర్నమెంట్ అంతటా అన్ని మ్యాచ్‌లు ఆడి, వివిధ వాతావరణ పరిస్థితుల్లోనూ 60 వికెట్లు తీసుకోవడం అతడి ప్రత్యేకతగా పేర్కొన్నాడు.

సౌకర్యాలు లేని ఊర్లో పెరిగిన నబి, చిన్నప్పటి నుంచి క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నాడు. సీనియర్‌ పర్వేజ్‌ రసూల్‌ మార్గదర్శకత్వంలో రోజూ 60 కిమీలు ప్రయాణించి శ్రీనగర్‌లో శిక్షణ తీసుకున్నాడు. 2019లో రాష్ట్ర జట్టులో చోటు సంపాదించాడు. మొదట్లో నెమ్మది వేగం, లైన్‌–లెంగ్త్‌ సమస్యలు ఉన్నాయి. జమ్మూ కోచ్‌ కృష్ణ కుమార్‌ సహాయంతో స్వింగ్, పేస్, కచ్చితత్వం మెరుగుపరిచి బ్యాట్స్‌మెన్స్‌కు సవాల్‌గా మారాడు.ఇక నబీ 2024–25లో 9 మ్యాచ్‌లు ఆడి 44 వికెట్లు తీశాడు. ఈసారి 60 వికెట్లు పడగొట్టాడు. విజయ్‌ హజారేలో హైదరాబాద్‌పై 114 పరుగులు చేయడంతోపాటు మూడు వికెట్లు తీశాడు. మొత్తం 40 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 151 వికెట్లు తీశాడు. 967 రన్స్‌ చేశాడు. ఐపీఎల్‌ ఆక్షన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 8.4 కోట్లతో నబీని కొనుగోలు చేసింది.

ఇదిలా ఉంటే జూలైలో ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లనున్న భారత్ ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ పర్యటన 2027 వన్డే వరల్డ్‌కప్‌కు సన్నాహకంగా కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ఆకిబ్ నబీకి అవకాశం ఇవ్వాలని గంగూలీ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం అతడి ఫిట్‌నెస్, దీర్ఘ స్పెల్స్ వేయగల సామర్థ్యం, మానసిక బలం సెలెక్టర్లను ఆకర్షిస్తున్నాయి. భారత సెలెక్షన్ కమిటీ కూడా ఇటీవల యువ ప్రతిభపై దృష్టి పెట్టింది. దాంతో ఆకిబ్ నబీ లాంటి ఆటగాళ్లకు రాబోయే రోజుల్లో జాతీయ జట్టులో చోటు దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

Published : 
  • 2 March 2026, 11:55 AM IST