బెన్ స్టోక్స్ ఈజ్ బ్యాక్…మూడో టెస్టుకు మళ్లీ కెప్టెన్సీ..!

న్యూజిలాండ్‌తో జూన్ 25 నుంచి ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్టుకు ఇంగ్లాండ్ జట్టులో బెన్ స్టోక్స్ , గస్ అట్కిన్సన్ జట్టులో చోటు దక్కించుకున్నారు. తొలి టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించిన తర్వాత లండన్ నైట్ క్లబ్‌లో జరిగిన సంఘటన

Post Published By: dialnews
Updated : 24 June 2026, 7:59 PM IST

న్యూజిలాండ్‌తో జూన్ 25 నుంచి ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్టుకు ఇంగ్లాండ్ జట్టులో బెన్ స్టోక్స్ , గస్ అట్కిన్సన్ జట్టులో చోటు దక్కించుకున్నారు. తొలి టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించిన తర్వాత లండన్ నైట్ క్లబ్‌లో జరిగిన సంఘటన తరువాత వీరిద్దరినీ జట్టు నుంచి తప్పించారు. కానీ మూడో టెస్టుకు ముందు వీరిద్దరూ తిరిగి జట్టులోకి వచ్చారు. బెన్ స్టోక్స్ తిరిగి సారథ్య బాధ్యతలు చేపడతాడని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది.లార్డ్స్‌తో న్యూజిలాండ్‌తో టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత జూన్ 8న స్టోక్స్, అట్కిన్సన్ ఇద్దరూ ఓ నైట్‌ క్లబ్‌కు వెళ్లారు. నిజానికి ఇలా వెళ్లేందుకు వారికి అనుమతి లేదు. అయినా ఈసీబీ నిబంధలను ఉల్లంఘించి వారు అక్కడికి వెళ్లారు.

నైట్ క్లబ్‌లో రగ్బీ ఆటగాడు టోటోవా ఔవాతో వీరు ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది.ఇదే సమయంలో ఓ సెక్యూరిటీ సిబ్బందికి కూడా గాయాలు కావడంతో విషయం ముదిరింది. దీంతో వారిని జట్టు నుంచి తప్పించారు. ఆ తర్వాత బెన్ స్టోక్స్, అట్కిన్సన్ వెళ్లి కౌంటీల్లో ఆడారు. కానీ ఈసీబీ సూచన మేరకు కౌంటీల్లో తమ తర్వాతి మ్యాచుకు వీరు దూరమయ్యారు. న్యూజిలాండ్‌తో మూడో టెస్టు కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు సంపాదించారు.

లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్.. న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. కానీ రెండో టెస్టులో మాత్రం 253 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. దీంతో రెండు టెస్టులు ముగిసే సరికి సిరీస్ 1-1తో సమమైంది. నిర్ణయాత్మక మూడో టెస్టు జూన్ 25 నుంచి ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచు ఫలితం సిరీస్ విజేత ఎవరో తేల్చనుంది.. ఇదిలా ఉంటే ఆదివారం ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ నిర్ణీత సమయం కంటే ఏకంగా 12 ఓవర్లను ఆలస్యంగా వేయడంతో 12 పాయింట్లను కోల్పోవాల్సి వచ్చింది. డబ్ల్యూటీసీ పట్టికలో ఆ జట్టు పర్సంటేజీ 34.72 శాతం నుంచి ఒక్కసారిగా 26.38 శాతానికి పడిపోయింది. ఈ టెస్టు మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్ ఖాతాలో 50 పాయింట్లు ఉన్నాయి. దీంతో ఇంగ్లాండ్ పాయింట్ల సంఖ్య 38కి పడిపోయింది.

Published : 
  • 24 June 2026, 7:59 PM IST