రఫ్ఫాడించిన రబాడ… సన్ రైజర్స్ ఘోర పరాజయం…!

ఐపీఎల్ లో టైటిల్ ఫేవరెట్ సన్ రైజర్స్ కు బిగ్ షాక్... ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా మారిన వేళ గుజరాత్ టైటాన్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. బౌలింగ్ లో అదరగొట్టినా బ్యాటింగ్ లో అట్టర్ ఫ్లాప్ అయింది.

Post Published By: dialnews
Updated : 13 May 2026, 12:50 PM IST

ఐపీఎల్ లో టైటిల్ ఫేవరెట్ సన్ రైజర్స్ కు బిగ్ షాక్... ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా మారిన వేళ గుజరాత్ టైటాన్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. బౌలింగ్ లో అదరగొట్టినా బ్యాటింగ్ లో అట్టర్ ఫ్లాప్ అయింది. పూర్తి ఫ్లాట్ వికెట్ కాకపోవడంతో హైదరాబాద్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కు దూసుకెళ్లిన గుజరాత్ ప్లే ఆఫ్స్ కు మరింత చేరువైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ కెప్టెన్ కమిన్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. హోంగ్రౌండ్ లో దూకుడుగా ఆడే అలవాటున్న గుజరాత్ టైటాన్స్ ను సన్ రైజర్స్ బౌలర్లు కంగారెత్తించారు. దీంతో ఆ జట్టు 26 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. గిల్ , బట్లర్ లను యువ పేసర్ ప్రఫుల్ హింగే త్వరగానే పెవిలియన్ కు పంపాడు. ఈ దశలో సాయి సుదర్శన్ , నిశాంత్ సింధు ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 38 పరుగులు జోడించారు.

నిశాంత్ ఔటైన తర్వాత సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. సన్ రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన వీరిద్దరూ స్కోర్ పెంచారు. నాలుగో వికెట్ కు 60 పరుగులు జోడించారు. సాయి సుదర్శన్ 44 బంతుల్లో 61 రన్స్ కు ఔటవగా.. వాషింగ్టన్ సుందర్ దూకుడు పెంచాడు. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. వాషింగ్టన్ జోరుతోనే గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేయగలిగింది. హోల్డర్ 11 నాటౌట్, తెవాటియా 4 నాటౌట్ గా నిలిచారు. సన్ రైజర్స్ బౌలర్లలో ప్రఫుల్ హింగే, సాకిబ్ హొస్సేన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. కమిన్స్ 20 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు.బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ 169 పరుగుల టార్గెట్ ను సునాయాసంగా ఛేదిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ గుజరాత్ బౌలర్లు ఆ అవకాశం ఇవ్వలేదు.

పేసర్లకు అనుకూలిస్తున్న పిచ్ పై చెలరేగిపోయారు. ముఖ్యంగా రబాడ అద్భుతమైన పేస్ తో దుమ్మురేపాడు. హెడ్ ను సిరాజ్ డకౌట్ గా పెవిలియన్ కు పంపిస్తే.. రబాడ వరుస ఓవర్లలో అభిషేక్ శర్మ , ఇషాన్ కిషన్ , స్మరన్ రవిచంద్రన్ లను ఔట్ చేశాడు. పవర్ ప్లేలోనే హైదరాబాద్ నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. క్లాసెన్ , అరోరా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. సూపర్ ఫామ్ లో ఉన్న క్లాసెన్ క్రీజులో ఉండడంతో అభిమానులు ఆశలు వదులుకోలేదు. అయితే క్లాసెన్ ను హోల్డర్ పెవిలియన్ కు పంపాడు. నితీశ్ రెడ్డి కూడా ఔటవడంతో సన్ రైజర్స్ ఓటమి ఖాయమైపోయింది. తర్వాత టెయిలెండర్లను ఔట్ చేసేందుకు గుజరాత్ కు ఎంతో సమయం పట్టలేదు. సన్ రైజర్స్ 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. రబాడ 3 , హోల్డర్ 3 , ప్రసిద్ధ కృష్ణ 2 వికెట్లు పడగొట్టారు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ కు ఇదే అత్యల్ప స్కోరు.

Published : 
  • 13 May 2026, 12:50 PM IST