టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ అంటూ జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. లార్డ్స్ లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలకబోతున్నాడంటూ నానా హడావుడి చేశారు. తీరా చూస్తే అస్సలు రిటైర్మెంట్ ఆలోచనే లేదంటూ హిట్ మ్యాన్ తాపీగా చెప్పాడు. అయితే అంతకుముందు జరిగిన రిటైర్మెంట్ ప్రచారం అంతా పీఆర్ స్టంట్ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోహిత్ పీఆర్ టీమ్ ఆడిన డ్రామా అంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు. ఇందుకు తగ్గ ఆధారాలను కూడా వారు ప్రస్తావిస్తున్నారు. వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడిన రోహిత్ శర్మపై సానుభూతిని పెంచేందుకు ఈ పీఆర్ స్టంట్‌కు తెరలేపారని ఆరోపిస్తున్నారు.
ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో రోహిత్ శర్మ ఔటవ్వగానే ఈ రిటైర్మెంట్ వార్తలు వచ్చాయి. ముందు ఈ విషయాన్ని సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ దేవంద్ర పాండే సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించాడు. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల నుంచి రోహిత్ శర్మను సెలెక్టర్లు తప్పించారని, ఈ విషయాన్ని అతనికి కూడా తెలియజేశారని పేర్కొన్నాడు.అంతేకాకుండా భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలని చెప్పారని, లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డేనే రోహిత్‌కు ఆఖరి మ్యాచ్ కావచ్చని పేర్కొన్నాడు. ఆ కాసేపటికే ఈ ట్వీట్ ఆధారంగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక కథనాన్ని ప్రచురించింది. అనంతరం చాలా మంది జర్నలిస్ట్‌లు, ఇతర మీడియా సంస్థలు, వెబ్‌సైట్స్ ఈ వార్తలు రాసాయి.
ఈ వార్తలతో రోహిత్ అభిమానులు అలర్ట్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌పై విమర్శలు గుప్పించారు. చివరకు ఈ వార్తలపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పందించి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. రోహిత్ శర్మ ఆడాలనుకున్నంత కాలం జట్టులో ఉంటాడని సైకియా స్పష్టం చేశాడు. లార్డ్స్ వన్డేలో రోహిత్ శర్మ విధ్వంసకర శతకంతో చెలరేగి ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. అయితే ఇదంతా పీఆర్ స్టంట్ అని కొందరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ముందు రిటైర్మెంట్ విషయాన్ని బయటపెట్టిన దేవంద్ర పాండే.. రోహిత్ శర్మకు అత్యంత సన్నిహితుడని కామెంట్ చేస్తున్నారు. తనను తప్పించాలని చూస్తే ఏం జరుగుతుందో అనేది మేనేజ్‌మెంట్‌కు తెలియజేయడానికి రోహిత్ పీఆర్ టీమ్ ఆడిన డ్రామా అని అభిప్రాయపడుతున్నారు.మరికొందరు మాత్రం అభిమానుల నుంచి వచ్చిన వ్యతిరేకతతో బీసీసీఐ వెనకడుగు వేసిందని కామెంట్ చేస్తున్నారు.