భారత క్రికెట్ ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్ వారసుడిగా భారీ అంచనాల మధ్య కెరీర్ ప్రారంభించిన అర్జున్ టెండూల్కర్‌పై సోషల్ మీడియాలో తరచూ విమర్శలు, ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. ఆయనపై తండ్రికి తగ్గ తనయుడు కాదంటూ కొందరు దారుణంగా కామెంట్ల వర్షం కురిపిస్తుంటారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్ లో అర్జున్ టెండూల్కర్ తన ఆఫ్-ఫీల్డ్ లైఫ్ గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. తన వ్యక్తిగత అలవాట్లు, స్నేహాల గురించి మనసు విప్పి మాట్లాడాడు. ఐపీఎల్ 2026 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మారిన అర్జున్ టెండూల్కర్.. ఈ కొత్త సీజన్ ప్రారంభానికి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
శుభంకర్ మిశ్రా నిర్వహించిన ఇంటర్వ్యూలో అర్జున్ టెండూల్కర్ మాట్లాడుతూ.. తనకు క్రికెట్ ఆడే స్నేహితులు చాలా తక్కువని వెల్లడించాడు.సచిన్ టెండూల్కర్ వారసుడిగా ఉండటంతో అర్జున్‌పై ఎప్పుడూ భారీ అంచనాలు ఉంటాయి. దీనివల్ల సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్, విమర్శలు వస్తుంటాయి. దీనిపై అర్జున్ ఘాటుగా స్పందించాడు. విమర్శలంటే నాకు భయం లేదన్నాడు.
తనపైన ఎన్నో ట్రోల్స్ వచ్చాయనీ అవన్నీ పట్టించుకోనన్నాడు.
మనసు ప్రశాంతంగా ఉండేందుకు తనకున్న ఐదు కుక్కలతో గడుపుతానంటూ చెప్పుకొచ్చాడు. తన తండ్రి సచిన్ టెండూల్కర్‌ను కాకుండా ఇతర క్రికెటర్లలో ఎవరంటే ఎక్కువ ఇష్టమని అడగ్గా.. ఠక్కున యువరాజ్ సింగ్ పేరు చెప్పాడు. కాగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో బుమ్రా, బౌల్ట్ వంటి స్టార్ బౌలర్ల మధ్య అర్జున్‌కు ఎక్కువ అవకాశాలు రాలేదు. ఇప్పుడు లఖ్‌నవూలో షమీ, మయాంక్ యాదవ్ వంటి వారితో పోటీ పడుతూ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు.అయితే, బౌలర్‌గానే కాకుండా బ్యాటర్‌గా కూడా రాణించగల సత్తా అర్జున్‌కు ఉంది. ఈ సామర్థ్యమే లక్నో జట్టులో లోయర్-మిడిల్ ఆర్డర్‌లో అతనికి చోటు దక్కుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కెరీర్ ఆరంభం నుంచి ఎదురవుతున్న ఒత్తిడిని పక్కన పెట్టి, ఈ సీజన్లో అర్జున్ టెండూల్కర్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటాడో లేదో చూడాలి.