రహానే రిటైర్మెంట్.. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై.!

భారత క్రికెటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సోషల్ మీడియాలో క్యాప్ 278 సైనింగ్ ఆఫ్ అనే క్యాప్షన్‌తో భావోద్వేగ వీడియోను షేర్ చేస్తూ తన కెరీర్‌కు ముగింపు పలికినట్లు వెల్లడించాడు.

Post Published By: dialnews
Updated : 31 July 2026, 3:04 PM IST

భారత క్రికెటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సోషల్ మీడియాలో క్యాప్ 278 సైనింగ్ ఆఫ్ అనే క్యాప్షన్‌తో భావోద్వేగ వీడియోను షేర్ చేస్తూ తన కెరీర్‌కు ముగింపు పలికినట్లు వెల్లడించాడు. జీవితంలో ప్రతిదానికీ ఒక ఆరంభం, ముగింపు ఉంటాయనీ, బ్యాటింగ్‌లో సరైన టైమింగ్ ఎంత ముఖ్యమో, ఇప్పుడు ఆట నుంచి తప్పుకోవడానికి కూడా ఇదే సరైన సమయమని భావిస్తున్నానంటూ రహానే ఎమోషనల్ అయ్యాడు.2011లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన రహానే, టీమిండియా సాధించిన అనేక చారిత్రక విజయాల్లో భాగమయ్యాడు. దేశం తరఫున అన్ని ఫార్మాట్లలో కలిసి 195 మ్యాచ్‌లు ఆడిన రహానే, ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో అత్యంత కీలకమైన ప్లేయర్‌గా ఎదిగాడు.

కెరీర్‌లో 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన రహానే, టెస్టుల్లో 5,000 పైచిలుకు పరుగులు చేసి భారత జట్టుకు ఎన్నో క్లిష్ట సమయాల్లో అండగా నిలిచాడు. రహానే 38.46 సగటుతో మొత్తం 5077 పరుగులు సాధించాడు. టెస్టుల్లో 12, వన్డేల్లో మూడు శతకాలు సాధించాడు. విదేశీ గడ్డపై నమ్మదగిన మిడిల్-ఆర్డర్ బ్యాటర్‌గా రాణించిన రహానే, తన 12 టెస్ట్ సెంచరీలలో ఎనిమిదింటిని విదేశాల్లోనే సాధించాడు. 2023లో భారత్ తరఫున చివరిసారి టెస్ట్ మ్యాచ్ ఆడాడు.రహానే కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచే ఘట్టం 2020-21 ఆస్ట్రేలియా పర్యటన.

విరాట్ కోహ్లీ గైర్హాజరీలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రహానే, మెల్‌బోర్న్ టెస్టులో చిరస్మరణీయ సెంచరీ సాధించడమే కాకుండా, పటిష్టమైన ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపైనే ఓడించి భారత్‌కు చారిత్రక బోర్డర్-గావస్కర్ ట్రోఫీని అందించాడు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే ఎప్పుడూ జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేసే వ్యక్తిగా క్రికెట్ ప్రపంచంలో అతడికి ప్రత్యేక గుర్తింపు ఉంది.అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ, ఆటతో తన బంధం కొనసాగుతుందని, యువ ఆటగాళ్లకు మార్గదర్శనం చేస్తూ క్రికెట్‌కు తిరిగి సేవ చేస్తానని రహానే తెలిపాడు. తన ఈ సుదీర్ఘ ప్రయాణంలో అండగా నిలిచిన బీసీసీఐ, ముంబై క్రికెట్ అసోసియేషన్, కుటుంబ సభ్యులు, కష్టసుఖాల్లో తోడుగా ఉన్న క్రికెట్ అభిమానులకు రహానే హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాడు.

Published : 
  • 31 July 2026, 3:04 PM IST