ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 65 పరుగుల భారీ తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్‌తో భారీ స్కోర్ అందిస్తే.. ఆ తర్వాత బౌలర్లు నిప్పులు చెరిగి కేకేఆర్ పతనాన్ని శాసించారు.ఈడెన్ గార్డెన్స్ లో ఛేజింగ్ జట్టుకే మంచి రికార్డున్న నేపథ్యంలో టాస్ గెలిచిన కోల్ కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ పిచ్ కావడంతో సన్ రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ , ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడారు. తొలి ఓవర్లో ఆచితూచి ఆడిన వీరిద్దరూ తర్వాత రెచ్చిపోయారు. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్నిహోరెత్తించారు. దీంతో పవర్ ప్లేలోనే సన్ రైజర్స్ 84 పరుగులు చేసింది.
ఈ సీజన్ లో ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోరు. ఇప్పటి వరకూ జరిగిన 6 మ్యాచ్ లలో ముంబై మాత్రమే పవర్ ప్లేలో 80 రన్స్ చేసింది. అభిషేక్ , హెడ్ తొలి వికెట్ కు 34 బంతుల్లోనే 82 పరుగులు జోడించారు. హెడ్ 21 బంతుల్లోనే 46 , అభిషేక్ శర్మ 21 బంతుల్లో 48 పరుగులు చేసారు. ఒక దశలో వీరిద్దరి దూకుడు చూస్తే సన్ రైజర్స్ 8 ఓవర్లలోనే 110 పరుగులతో 250 ప్లస్ స్కోరు సాధించేలా కనిపించింది. అయితే ఇషాన్ కిషన్, అభిషేక్ వరుసగా ఔటవడంతో ఆ జోరుకు కాసేపు బ్రేక్ పడింది. తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ జోడీ స్కోరుబోర్డును ముందుకు తీసుకెళ్లింది. ఇద్దరూ ధాటిగా ఆడుతూ 53 బంతుల్లో 82 పరుగులు జోడించారు. నితీష్ 24 బంతుల్లో 39 , క్లాసెన్ 35 బంతుల్లో 52 పరుగులు చేయగా... సన్ రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 226 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో ముజరబానీ 4 వికెట్లు తీయగా.. వైభవ్ అరోరా 2, త్యాగి 1, అంకుల్ రాయ్ 1 వికెట్ పడగొట్టాడు.
తర్వాత భారీ లక్ష్యఛేదనను కోల్ కతా నైట్ రైడర్స్ దూకుడుగానే ఆరంభించింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ఫిన్ అలెన్ తొలి ఓవర్లోనే చుక్కలు చూపించాడు. 3 ఫోర్లు, 2 సిక్సర్లతో సహా 25 పరుగులు బాదాడు. దూకుడు మీదున్న అలెన్ ను హర్షదూబే పెవిలియన్ కు పంపించాడు. భారీ షాట్లు ఆడే క్రమంలో రహానే ఔటవగా.. కామెరూన్ గ్రీన్ అనూహ్యంగా రనౌటయ్యాడు. దీంతో పవర్ ప్లేలో 74 పరుగులు చేసిన కేకేఆర్ 3 కీలక వికెట్లు కూడా చేజార్చుకుంది. ఈ దశలో రఘువంశీ, రింకూ సింగ్ ఇన్నింగ్స్ కొనసాగించారు. వీరిద్దరూ30 బంతుల్లో 46 పరుగులు జోడించారు. రఘువంశీ కూడా రనౌటవడం, వెంటనే అంకుల్ రాయ్, రమణ్ దీప్ సింగ్ ఔటయ్యారు. తర్వాత రింకూ సింగ్ ధాటిగా ఆడినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోవడంతో కేకేఆర్ ఓటమి ఖాయమైపోయింది. మిగిలిన బ్యాటర్లు ఔటయ్యేందుకు ఎంతో సమయం పట్టలేదు. దీంతో కోల్ కతా 161 పరుగులకు ఆలౌటైంది. సన్ రైజర్స్ బౌలర్లలో ఉనాద్కట్ 3, మలింగ 2, నితీష్ 2 వికెట్లు తీసారు. సన్ రైజర్స్ కు ఈ సీజన్ లో ఇది తొలి విజయం. అటు కేకేఆర్ కు వరుసగా రెండో ఓటమి.