బిగ్‌బాష్ లీగ్ చరిత్రలోనే తొలిసారి విదేశాల్లో మ్యాచ్ నిర్వహించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా సిద్ధమైంది. క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా భారత గడ్డపై విదేశీ టోర్నీకి సంబంధించిన తొలి మ్యాచ్ జరగనుంది. 2026-2027 సీజన్‌కు సంబంధించిన బీబీఎల్ పూర్తి షెడ్యూల్‌ను ఆసీస్ క్రికెట్ బోర్డు విడుదల చేసింది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌ను చెన్నైలోని చెపాక్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 12న మెల్బోర్న్ రెనిగేడ్స్, పెర్త్ స్కార్చర్స్ మధ్య ఈ చారిత్రక మ్యాచ్ జరగనుంది.భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఇటీవల ప్రకటించిన నిర్ణయానికి అనుగుణంగా ఈ మ్యాచ్‌కు చెన్నై వేదికగా ఎంపికైంది.
అదే రోజు ఆస్ట్రేలియా–న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు నాలుగో రోజు ఆట కూడా కొనసాగనుండటంతో క్రికెట్ అభిమానులకు డబుల్ ట్రీట్ లభించనుంది. విదేశీ ఆరంభ మ్యాచ్ భారత్‌లో జరగిన అనంతరం ప్రధాన బీబీఎల్ సీజన్ మొత్తం డిసెంబర్ 15 నుంచి ఆస్ట్రేలియాలోనే ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్, గత సీజన్ రన్నరప్ సిడ్నీ సిక్సర్స్‌తో గబ్బా వేదికగా తలపడనుంది. ఈసారి కూడా లీగ్ దశలో మొత్తం 40 మ్యాచ్‌లు, 4 ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. జనవరి 17న లీగ్ మ్యాచ్ పూర్తి కానున్నాయి. అనంతరం జనవరి 19న తొలి క్వాలిఫయర్, 20న నాకౌట్, 23న ఛాలెంజర్, 26న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.నాలుగేళ్ల విరామం తర్వాత క్రిస్మస్ ఈవ్ రోజున బీబీఎల్ మ్యాచ్ జరగనుంది.
మెల్బోర్న్ రెనిగేడ్స్, హోబార్ట్ హారికేన్స్ జంక్షన్ ఓవల్ వేదికగా ఆ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాయి. కొత్త ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేసిన తర్వాత ఆ మైదానంలో జరగనున్న తొలి బీబీఎల్ మ్యాచ్ ఇదే. ఈ సీజన్లో ‘డిజిగ్నేటెడ్ బ్యాటర్ అండ్ ఫీల్డర్’ అనే కొత్త నిబంధనను అమలు చేయనున్నారు.ఈ రూల్ ప్రకారం జట్లు ఒక ఆటగాడిని కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే, మరొకరిని కేవలం ఫీల్డింగ్‌కు మాత్రమే ఉపయోగించుకోవచ్చు. ప్రత్యేక బ్యాటర్ కోటాలో ఎంపిక చేసిన ఆటగాడు కేవలం బ్యాటింగ్ మాత్రమే చేయగలడు, బౌలింగ్ లేదా ఫీల్డింగ్ చేయడానికి అనుమతి లేదు. ఒకవేళ జట్టు డెసిగ్నేటెడ్ బ్యాటర్‌ను ఎంచుకుంటే, తప్పనిసరిగా 'డెసిగ్నేటెడ్ ఫీల్డర్' ను కూడా ప్రకటించాలి. ఈ ఆటగాడు వికెట్ కీపింగ్ సహా ఫీల్డింగ్ చేయవచ్చు కానీ బౌలింగ్ లేదా బ్యాటింగ్ చేయడానికి వీలు లేదు. ఈ రూల్ ఉపయోగించుకోవడం ఆయా జట్ల ఇష్టం. వాడకుంటే తమ తుది జట్టుతోనే బరిలోకి దిగొచ్చు.