ఐపీఎల్ 2026 ఇంకా ముగియక ముందే ఆటగాళ్ల వేలం, ట్రేడ్ వార్తలు బయటకు వస్తున్నాయి. ఐపీఎల్ 2027కి ముందు అన్ని జట్లలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని ఫ్రాంఛైజీలు తమ తమ జట్లలో ఏ ప్లేయర్లను ఉంచుకోవాలి, ఏ ప్లేయర్లను వదిలేయాలన్న క్లారిటీకి వచ్చేశాయి. వచ్చే ఏడాది అన్ని ఫ్రాంఛైజీలు భారీగా ప్లేయర్లను బయటకు పంపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో హార్దిక్ పాండ్యా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. హార్దిక్ పాండ్యాను ట్రేడ్ ద్వారా దక్కించుకునేందుకు నాలుగు ఫ్రాంఛైజీలు ప్రయత్నిస్తున్నట్లు నెట్టింట కథనాలు వస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీలు ఇప్పటికే హార్దిక్‌తో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.
ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ హార్దిక్‌ను ట్రేడ్‌లో దక్కించుకోవాలంటే శివమ్ దూబే, ఆయుష్ మాత్రే లేకపోతే ఖలీల్ అహ్మద్‌ను ముంబైతో ట్రేడ్ చేసే అవకాశం ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా ప్రస్తుతం సరైన కెప్టెన్ లేకపోవడంతో ఇబ్బంది పడుతోంది. కామెరూన్ గ్రీన్ లేక రింకూ సింగ్‌తోపాటు కార్తీక్ త్యాగీని ముంబైకి ఆఫర్ చేసే అవకాశం ఉంది.ఇక లక్నో సూపర్ జెయింట్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెటర్ టామ్ మూడీ ఇప్పటికే రిషభ్ పంత్‌ను వదిలేస్తున్నట్లు హింట్ ఇచ్చాడు. దాంతో ఐపీఎల్ 2027లో హార్దిక్‌ను తీసుకుని రిషభ్ పంత్‌తో పాటు మరో పేసర్‌ని ముంబైకి ఇచ్చే అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్ కూడా హార్దిక్‌ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. అందుకోసం యశస్వి జైస్వాల్, సందీప్ శర్మను ముంబైకి ఇచ్చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు నెట్టింట వార్తలు వస్తున్నాయి.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2027లో జట్టు మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మూడేళ్ల పాటు ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా దారుణంగా విఫలమయ్యాడు. ఐపీఎల్ 2024లో ముంబైని పదో స్థానానికి పడేసిన పాండ్యా, ఐపీఎల్ 2025లో క్వాలిఫయర్ 2 వరకూ చేర్చాడు. ఈ ఏడాది మంచి ప్లేయర్లను ఇచ్చినప్పటికీ తొమ్మిదో స్థానానికి పరిమితం చేశాడు. ముంబై ఇండియన్స్ యాజమాన్యం కూడా హార్దిక్ కెప్టెన్సీపై అసంతృప్తిలోనే ఉన్నట్లు అర్థమవుతోంది. వచ్చే ఏడాదికి హార్దిక్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించాలని ముంబై చూస్తున్నట్లు నేషనల్ మీడియా కథనాలు వెల్లడిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా హార్దిక్ పాండ్యా ట్రేడ్ వార్తలు కూడా బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఐపీఎల్ 2027లో హార్దిక్ ముంబైలోనే కొనసాగుతాడా లేక బయటకు వెళ్తాడా అన్నది చూడాలి.