బాబా వంగా అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది ప్రపంచవ్యాప్తంగా జరగబోయే విపత్తులు, సంచలన పరిణామాల గురించిన భవిష్యవాణులు. బల్గేరియాకు చెందిన ఈ అంధురాలైన ఆధ్యాత్మిక వేత్త చేసిన ఎన్నో అంచనాలు నిజమయ్యాయి. అందుకే ఆమె పేరుతో ఏ వార్త వచ్చినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయిపోతుంది. తాజాగా 2026 సంవత్సరం ద్వితీయార్ధం.. అంటే జూలై నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుందనే దానిపై బాబా వంగా అంచనాలు అంటూ ఒక వార్త నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ అంచనాల ప్రకారం, రాబోయే ఆరు నెలల పాటు ప్రధానంగా ఐదు రాశుల వారికి తిరుగులేదని, అద్భుతమైన విజయాలు సాధిస్తారని తెలుస్తోంది. ఇందులో మొదటిది వృషభ రాశి. వీరికి 2026 చివరి ఆరు నెలలు అత్యంత అనుకూలంగా ఉండబోతున్నాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి, అద్భుతమైన అవకాశాలు వస్తాయి. పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందుకొని ఆర్థికంగా మరింత బలోపేతం అవుతారు.
రోండోది సింహ రాశి. గత కొంత కాలంగా వీరు పడుతున్న ఇబ్బందులు ఈ ఆరు నెలల్లో క్రమంగా తగ్గిపోతాయి. కెరీర్‌లో అద్భుతమైన పురోగతి ఉంటుంది. ముఖ్యంగా రాజకీయాలు, పరిపాలన, నాయకత్వ స్థానాల్లో ఉన్న వారికి సమాజంలో మంచి గుర్తింపు, పదోన్నతులు లభిస్తాయి. మూడోది కన్య రాశి. ఉద్యోగస్తులకు తమ రంగాల్లో మంచి అవకాశాలు మెరుగుపడతాయి. వ్యాపారం చేసేవారికి ఇది తమ బిజినెస్‌ను విస్తరించుకోవడానికి సరైన సమయం. చేతికి డబ్బులు బాగా అందడంతో పాటు, భవిష్యత్తు కోసం మంచి మొత్తంలో పొదుపు కూడా చేయగలుగుతారు. నాలుగోది వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఊహించని విధంగా ధనలాభం కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే ఛాన్స్ ఉంది. వ్యాపారులకు కూడా ఈ సమయం లాభదాయకంగా ఉండి, మంచి లాభాలు కళ్లజూస్తారు.
ఐదోది మకర రాశి. ఎప్పటి నుంచో వీరు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సమయం వచ్చేసింది. ఆఫీసులో కొత్త బాధ్యతలు తీసుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరగడంతో పాటు, ఆర్థికంగా కూడా బాగా స్థిరపడతారు. బాబా వంగా పేరుతో సర్క్యులేట్ అవుతున్న ఈ జోస్యం ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. కానీ సోర్సెస్ మరియు ఫ్యాక్ట్ చెకర్స్ విశ్లేషణ ప్రకారం.. బాబా వంగా ఎప్పుడూ కూడా ఇలా జ్యోతిష్యుల తరహాలో పలానా రాశి వారికి ఇలా ఉంటుంది అని రాశిఫలాలను చెప్పలేదు. ఆమె ప్రధానంగా ప్రపంచ స్థాయి సంఘటనలు, యుద్ధాలు, వాతావరణ మార్పుల గురించి మాత్రమే అంచనాలు చెప్పేవారు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం కొందరు ఈ తరహా ట్రెండ్స్ సృష్టిస్తూ ఉంటారు. కాబట్టి, ఈ ఐదు రాశుల వారు ఈ వార్తను చూసి సంతోషించినా, దీనికి శాస్త్రీయమైన ఆధారాలు లేవని, కేవలం నమ్మకం మీద ఆధారపడిన సమాచారంగా మాత్రమే పరిగణించాలని నిపుణులు సూచిస్తున్నారు.