ఇద్దరు ఎస్ఐలు ప్రైవేట్ వాహనంలో , సివిల్ డ్రెస్ లో గంజాయితో దొరికారు. వాళ్లు తాగి ఉన్నారు. ఒక ఆటోని యాక్సిడెంట్ చేయడంతో ఇదంతా బయట పడింది. మీరైతే ఏమనుకుంటారు? ప్రభుత్వం ఇద్దరు ఎస్ఐల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడుతుంది అనుకుంటారు. పోలీసుల దగ్గర గంజాయి ఎలా వచ్చిందో దర్యాప్తు చేస్తారని భావిస్తారు.! కానీ అక్కడ అది ఏం జరగలేదు.కొద్దిసేపటికి పోలీసులే గంజాయి పట్టుకున్నారట. నిందితుడు మాత్రం పారిపోయాడంట. అతని దగ్గర దొరికిన గంజాయిని తీసుకుని వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది అంట. ఎస్సై ఇద్దరు నిర్దోషిలంట. గంజాయి పట్టుకోవడానికి సివిల్ డ్రెస్ లో వెళ్లారు అంట. కథ బాగుంది కదూ. ప్రకాశం జిల్లా పోలీసులు చెబుతున్న కథ ఇది.
ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలోని శంకవరప్పాడు గ్రామంలో స్విఫ్ట్ డిజైర్ కారు...ఓ ఆటోను ఢీకొట్టింది.
కారు ముందు, సైడ్ భాగాలు ధ్వంసమయ్యాయి. యాక్సిడెంట్ చేసిన కారు నెంబర్ AP27 CB 4789. ఆటోలో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. యాక్సిడెంట్ కాగానే కారును చుట్టుముట్టారు స్థానికులు. అంతలోనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో ఉన్న బల్లికురవ ఎస్సై నాగరాజు, సంతమాగులూరు ఎస్సై నాగమల్లేశ్వరరావును ఘటనాస్థలం నుంచి అద్దంకి పోలీసులు తప్పించారు. తర్వాత ఈ కారు డిక్కీని తెరవకుండా అద్దంకి సీఐ సుబ్బరాజు, ఎస్సై సాయికుమార్ యత్నించారు. దీంతో స్థానికులు, వైసీపీ శ్రేణులకు అనుమానం వచ్చింది. డిక్కీ తెరవాల్సిందేనని పట్టుబట్టారు. కారు డోర్లు తీసి లోపల, సీట్ల కింద ఏమున్నాయో వీడియోలు తీశారు. వీడియోలు తీస్తుంటే పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. స్థానికులకు సీన్లో నుంచి తప్పించుకుని వెళ్లింది ఇద్దరు ఎస్సైలని అర్థమైంది. దీంతో పట్టువీడలేదు. తగ్గేదే లే అంటూ అద్దంకి సీఐతోనూ, పోలీసులతోనూ వాగ్వాదానికి దిగారు. కారులోపల వీడియోలు తీసేసరికి మద్యం బాటిళ్లు బయటపడ్డాయి. చివరికి డిక్కీ తీసి చూస్తే పెద్ద బస్తాలో గంజాయి కనిపించేసరికి జనం షాక్ అయ్యారు.మద్యం బాటిళ్లు, గంజాయి మాత్రమేనా...డిక్కీలో పోలీస్ యూనిఫామ్స్ కూడా దొరికాయి.
ఈ యాక్సిడెంట్ జరగడానికి ముందు బల్లికురవ ఎస్సై నాగరాజు లిక్కర్ పార్టీ ఇచ్చారు. గంగమ్మ గుడి ఆవరణలో వందమందికి లంచ్ ఇచ్చారు ఎస్సై నాగరాజు. ఈ పార్టీకి దర్శి, సంతమాగలూరుతో పాటు మిగిలిన పోలీస్ స్టేషన్ల నుంచి చాలామంది పోలీసులు వెళ్లారు. గంగమ్మ గుడి సమీపంలో ఒక రూం తీసుకుని ఫూటుగా మద్యం సేవించారు. ఆ మత్తులోనే మధ్యాహ్నం 3గంటలకు ఎస్సై నాగరాజు సంతమాగలూరు ఎస్సైతో కలిసి కారులో బయల్దేరారు. తాగిన మత్తులో డ్రైవింగ్ సరిగా చేయలేక అద్దంకిలో ఆటోని ఢీకొట్టారు. ఎస్సైలు ప్రయాణిస్తున్న కారులో గంజాయి ఎక్కడిది అంటే..25 రోజులు వెనక్కి వెళ్లాలి. గత నెల 22న ఒక గంజాయి గ్యాంగ్‌ను పట్టుకున్నారు పోలీసులు. ఆ గ్యాంగ్ దగ్గర దొరికిన దాంట్లో సగం దాచి పెట్టారని, ఇప్పుడు కారులో కనిపించిన గంజాయి కూడా అదేనని అనుమానాలున్నాయి.
అయితే వీటన్నిటిని ప్రకాశం జిల్లా పోలీసులు అడ్డంగా కొట్టి పడేశారు. సంఘటన జరిగిన 24 గంటల వరకు ఎవరు ఏమి మాట్లాడలేదు. మంత్రి రియాక్ట్ అవలేదు. అసెంబ్లీలో చర్చకు రాలేదు. జిల్లా ఎస్పీ కూడా మాట్లాడలేదు. ప్రశాంతంగా టైం తీసుకుని చక్కని కథ ప్లాన్ చేశారు. పోలీసుల దగ్గర దొరికిన గంజాయి కొద్దిసేపటి క్రితం దొరికిందని చెప్పారు ఎస్పీ. మరి నిందితులు ఎక్కడ అంటే.... తప్పించుకొని పారిపోయారు అంట.
కారులో మద్యం బాటిల్స్ ఎందుకు వచ్చినాయి అని అడిగితే మాటలు లేవు. పోలీసులు ఎందుకు ఉన్నారు అని అడిగితే సమాధానం లేదు. ఆ కార్ ఎవరిది....? ప్రైవేట్ వెహికల్ లో గంజాయి పెట్టుకొని తిరగాల్సిన అవసరం పోలీసులకు ఏంటి? గంజా గ్యాంగులను పట్టుకోవడానికి... ప్రైవేట్ కార్లో వెళ్తారా అని ప్రశ్నిస్తే.... మీరు అలాంటివి అడగకూడదు అని అంటారు.
సివిల్ డ్రెస్‌లో ఇద్దరు ఎస్సైలు ఈ కారులో ఎందుకు ఉన్నారు, ఈ కారులో గంజాయి ఎక్కడిది? యాక్సిడెంట్ అయ్యాక ఇద్దరు ఎస్సైలను అద్దంకి పోలీసులు ఎందుకు తప్పించారు, కారు లోపల వీడియో తీస్తుంటే ఎందుకు అడ్డుకునే యత్నం చేశారు, డిక్కీ ఓపెన్ చేయకుండా ఎందుకు అడ్డుకున్నారు...ఇలా ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో ఇంకో హైలైట్ కచ్చితంగా ప్రస్తావించాలి. తాము అడ్డుకుంటే ఆగని స్థానికులను అద్దంకి పోలీసులు సెల్‌ఫోన్ కెమెరాలతో చిత్రీకరించారు. చుట్టూ ఉన్నవారి ఫేస్‌లు కనిపించేలా అదేపనిగా వీడియోలు తీశారు. ఎందుకిలా వీడియోలు తీశారనేది కూడా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.ఏ ప్రశ్నకి పోలీసుల నుంచి సమాధానం లేదు. కిందటి నెల్లూరు రికవరీ చేసిన గంజాయిని పోలీసులే అమ్ముకోవడానికి దాచుకున్నారా? లేక ప్రత్యర్థులపై, అమాయకులపై గంజాయి కేసులు పెట్టడానికి అనువుగా దాచిపెట్టుకున్నా రా అన్నది ప్రస్తుతానికి పరమాత్ముడికి ఎరిక. తాత్కాలికంగా మాత్రం నిజాన్ని ఆరడుగుల గొయ్యి తీసి కప్పి పెట్టేసారు పోలీసులు.