ఒక్క క్షణం ఆలోచించండి. మీరు ప్రశాంతంగా మీ ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్నారు లేదా నిద్రపోతున్నారు. సడన్‌గా మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ గట్టిగా అరుస్తూ ఒక వార్నింగ్ మెసేజ్ చూపించింది.. "ఇంకొక 30 సెకన్లలో మీ ఏరియాలో భారీ భూకంపం రాబోతోంది.. వెంటనే బయటకు వెళ్లండి" అని. మీరు ఆ మెసేజ్ చూసి వెంటనే ఇల్లు వదిలి బయటకు రాగానే.. సరిగ్గా 30 సెకన్లకు భూమి భయంకరంగా కంపించింది. నిజంగా ఇది వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా స్టోరీలా ఉంది కదూ? కానీ నిన్న వెనిజులా దేశంలో సరిగ్గా ఇదే జరిగింది. అక్కడ వచ్చిన ఒక భారీ భూకంపం నుండి మిలియన్ల మంది ప్రాణాలను కేవలం వారి జేబులో ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లు కాపాడాయి. అసలు శాస్త్రవేత్తలకే సాధ్యం కాని ఈ అద్భుతాన్ని గూగుల్ ఎలా సాధ్యం చేసింది? మన ఫోన్ మనకు ఎలా అలర్ట్ ఇస్తుంది?
అసలు విషయానికి వస్తే.. వెనిజులా దేశంలో రీసెంట్గా 7.2 మరియు 7.5 తీవ్రతతో వందేళ్లలోనే అత్యంత భయంకరమైన భూకంపాలు సంభవించాయి. అక్కడ ప్రభుత్వ పరంగా ఎలాంటి 'భూకంప హెచ్చరిక వ్యవస్థ' లేదు. కానీ, భూమి కంపించడానికి కొన్ని సెకన్ల ముందు.. కొందరికైతే కొన్ని నిమిషాల ముందే వారి ఆండ్రాయిడ్ ఫోన్లలో లౌడ్ అలర్ట్స్ వచ్చాయి. పెరికల్స్ శాంచెజ్ అనే ఒక రైటర్ తన ఫోన్ లో వచ్చిన అలర్ట్ చూసి, తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని ఇల్లు వదిలి రోడ్డు మీదికి వచ్చేసాడు. తను బయటకు వచ్చిన తర్వాతి క్షణమే బిల్డింగ్లు దద్దరిల్లడం స్టార్ట్ అయ్యాయి. అంటే.. కేవలం ఆ ఒక్క చిన్న మొబైల్ నోటిఫికేషన్ వల్ల కొన్ని వేల మంది ప్రాణాలు దక్కాయి.
మరి గవర్నమెంట్‌కే తెలియని భూకంపం గూగుల్‌కు ఎలా తెలిసింది? దీని వెనుక ఉన్నది క్రౌడ్‌సోర్స్ డేటా. బాసు.. మన ఆండ్రాయిడ్ మొబైల్స్ లో ఒక చిన్న సెన్సార్ ఉంటుంది, దాని పేరు 'యాక్సిలెరోమీటర్'. మనం ఫోన్‌ను అడ్డంగా తిప్పినప్పుడు స్క్రీన్ రొటేట్ అవుతుంది చూశారా? అది ఈ సెన్సార్ వల్లే జరుగుతుంది. భూకంపం వచ్చేటప్పుడు భూమి లోపల రెండు రకాల తరంగాలు వస్తాయి. మొదటిది పి-వేవ్స్.. ఇవి చాలా వేగంగా ప్రయాణిస్తాయి కానీ వీటి వల్ల పెద్దగా ఊపు తెలియదు. రెండవది ఎస్-వేవ్స్.. ఇవి కాస్త స్లోగా వస్తాయి కానీ ఇవే బిల్డింగ్‌లను కూల్చేసేంత ప్రమాదకరమైనవి.
మీ ఫోన్ ఒక టేబుల్ మీద కదలకుండా ఉన్నప్పుడు.. భూమి లోపల వచ్చే ఆ చిన్న పి-వేవ్స్ వైబ్రేషన్‌ను మీ ఫోన్ లోని సెన్సార్ వెంటనే గుర్తిస్తుంది. వెంటనే ఆ సిగ్నల్‌ను గూగుల్ డేటా సెంటర్‌కు పంపుతుంది. అలా ఒకే ఏరియాలో ఉన్న వేలాది ఫోన్ల నుండి ఒకేసారి సిగ్నల్స్ వెళ్లగానే.. గూగుల్ సర్వర్స్ అక్కడ భూకంపం వస్తోందని కన్ఫర్మ్ చేసుకుంటాయి. కాంతి వేగంతో ప్రయాణించే ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ద్వారా.. ఆ ఏరియా చుట్టుపక్కల ఉన్న మిగతా మిలియన్ల మంది ఆండ్రాయిడ్ యూజర్లకు క్షణాల్లో అలర్ట్స్ పంపేస్తాయి.
గూగుల్ మాత్రమే కాదు.. ప్రపంచంలో జపాన్, అమెరికా, మెక్సికో లాంటి దేశాల్లో అత్యంత అధునాతన ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయి. ముఖ్యంగా జపాన్ లో 'S-Net' అనే వ్యవస్థ ఉంది. వీరు సముద్రం అడుగున వేల కిలోమీటర్ల పొడవునా కేబుల్స్, సెన్సార్లను అమర్చారు. దీనివల్ల సముద్రంలో భూకంపం రాగానే 20 సెకన్ల ముందే భూకంప హెచ్చరికలు, 20 నిమిషాల ముందే సునామీ హెచ్చరికలు ఇవ్వగలుగుతున్నారు. కానీ.. ఇలాంటి కోట్లాది రూపాయల ఖరీదైన టెక్నాలజీ లేని దేశాల్లో, గూగుల్ ఆండ్రాయిడ్ సిస్టమ్ పేద ప్రజలకు ఒక వరంగా మారింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ల (250 కోట్ల) కన్నా ఎక్కువ ఫోన్లు ఈ నెట్‌వర్క్‌లో పనిచేస్తున్నాయి.
చూశారుగా.. సైన్స్ అండ్ టెక్నాలజీ మన ప్రాణాలను కాపాడటానికి ఏ రేంజ్లో హెల్ప్ అవుతుందో. మరి మీ మొబైల్ లో కూడా 'Google Earthquake Alerts' ఆప్షన్ ఆన్ లో ఉందో లేదో ఇప్పుడే మీ ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి 'Safety & Emergency' లేదా 'Location' లో చెక్ చేసుకోండి. ఒకవేళ ఆఫ్ లో ఉంటే వెంటనే ఆన్ చేసుకోండి, ఎందుకంటే ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు.