Top story: కొబ్బరి నీళ్లలో సైనైడ్‌ కలిపి.. AE నూకరాజు ఫ్యామిలీ సూసైడ్‌ కేసులో మరో ట్విస్ట్‌..!

ఏపీలో కలకలం రేపిన పంచాయతీరాజ్ AE నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో రోజుకో షాకింగ్ విషయం వెలుగులోకి వస్తోంది. 25 కోట్ల ఆస్తిని కాజేయాలనే దురాశతోనే ఈ కుట్రకు ప్లాన్ చేసినట్లు నిందితుడు సాధిక్ ఖాన్ పోలీసుల కస్టడీ విచారణలో అంగీకరించాడు.

Post Published By: dialnews
Updated : 12 September 2026, 1:47 PM IST

ఏపీలో కలకలం రేపిన పంచాయతీరాజ్ AE నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో రోజుకో షాకింగ్ విషయం వెలుగులోకి వస్తోంది. 25 కోట్ల ఆస్తిని కాజేయాలనే దురాశతోనే ఈ కుట్రకు ప్లాన్ చేసినట్లు నిందితుడు సాధిక్ ఖాన్ పోలీసుల కస్టడీ విచారణలో అంగీకరించాడు. సర్పవరం పోలీసులు నిందితుడు సాధిక్ ఖాన్‌ను అదుపులోకి తీసుకుని దాదాపు 200లకు పైగా ప్రశ్నలతో విచారించారు. ప్రారంభంలో పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినప్పటికీ, సైనైడ్ విక్రయించిన కెమికల్ వ్యాపారుల సాక్ష్యాలు, డిజిటల్ ఆధారాలు ముందు పెట్టడంతో సాధిక్ తన నేరాన్ని పూసగుచ్చినట్లు ఒప్పుకున్నాడు. పోలీసు విచారణలో సాధిక్ ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. జగదీశ్వరరెడ్డిని అంతం చేయడానికి అతడు చాలాకాలంగా పథకం రచించాడు. తాను రైఫిల్ షూటర్ అని, ప్రాక్టీస్ కోసం రసాయనం అవసరమని హైదరాబాద్‌లోని వ్యాపారులను నమ్మించి థాలియం పొటాషియం, సైనైడ్ కొనుగోలు చేశాడు. ముందుగా జగదీశ్వరరెడ్డికి కొబ్బరి నీళ్లలో విష పదార్థాన్ని కలిపి ఇచ్చాడు.

ఆ తర్వాత అతడు అనారోగ్యంతో కాకినాడ ఆసుపత్రిలో చేరగా, అక్కడ కూడా చికిత్స పొందుతున్న సమయంలో 3 నుంచి 4 సార్లు విషం ఇచ్చినట్టు అంగీకరించాడు. అయితే, మెరుగైన వైద్యం కోసం జగదీశ్వరరెడ్డిని హైదరాబాద్ తరలించడంతో అతడు కొంత కోలుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. అయినా వదలకుండా సాధిక్ ఖాన్ మళ్లీ సైనైడ్ పంపించగా, దానిని వాడిన మరుసటి రోజే జగదీశ్వరరెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. జగదీశ్వరరెడ్డి చనిపోయిన తర్వాత ఆయన భార్య సౌజన్యను పెళ్లి చేసుకుంటే, వాళ్ల కుటుంబానికి ఉన్న సుమారు 25 కోట్ల ఆస్తి మొత్తం తన వశమవుతుందని సాధిక్ ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే సౌజన్యపై, ఆమె కుటుంబంపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చాడు. ఈ ఆస్తిని సాధిక్ పేరిట రాయడానికి సౌజన్య తండ్రి, ఏఈ నూకరాజు తీవ్రంగా నిరాకరించారు. ఆస్తిని మనవడు రియాన్ష్ కార్తికేయ పేరిట లేదా కుటుంబంలోని మరొకరి పేరిట రాస్తామని స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహించిన సాధిక్, "ఆస్తి కోసమే నేను ఇదంతా చేశాను" అంటూ నూకరాజు కుటుంబాన్ని తీవ్రంగా బెదిరించాడు.

కుటుంబ రహస్యాలు, వీడియోలను బయటపెడతానని బ్లాక్‌మెయిల్ చేశాడు. అంతేకాకుండా మతమార్పిడికి కూడా ఒత్తిడి తెచ్చినట్లు ఆధారాలు లభించాయి. సాధిక్ ఖాన్ వేధింపులు, బెదిరింపులు తట్టుకోలేక ఏఈ నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్యలు తమ 10 ఏళ్ల మనవడు రియాన్ష్ కార్తికేయతో కలిసి రాజమండ్రి గోదావరి రైలు-రోడ్డు వంతెన పైనుంచి నదిలోకి దూకేశారు. ఈ దారుణ ఘటనలో నూకరాజు, మీనా, సౌజన్య ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోగా, అదృష్టవశాత్తూ చిన్నారి రియాన్ష్ వంతెన గ్రిల్స్‌కు చిక్కుకోవడంతో జాలర్లు రక్షించారు. ఆత్మహత్యకు ముందు నూకరాజు వాట్సాప్ ద్వారా జిల్లా కలెక్టర్, ఎస్పీలకు పంపిన సూసైడ్ నోట్ ఈ కేసును మలుపు తిప్పింది.

ఆ నోట్‌లో తమ చావుకు సాధిక్ ఖాన్ వేధింపులే కారణమని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం పరారైన సాధిక్ ఖాన్‌ను పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అరెస్టు చేసి తీసుకువచ్చారు. దర్యాప్తులో భాగంగా సర్పవరం పోలీసులు సాధిక్ షూటింగ్ అకాడెమీని సీజ్ చేసి, అక్కడ ఉన్న 30 రైఫిళ్లు, ల్యాప్‌టాప్‌లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సాధిక్ ఉపయోగించిన విష పదార్థ నమూనాలను పోలీసులు సీజ్ చేశారు. తన వేధింపుల వల్ల ఆ కుటుంబం అంత తీవ్ర నిర్ణయం తీసుకుంటుందని తాను ఊహించలేదని సాధిక్ తెలిపినప్పటికీ, పక్కా ఆధారాలతో అతడిపై హత్య, బ్లాక్‌మెయిలింగ్, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద పోలీసులు ఛార్జ్‌షీట్ సిద్ధం చేస్తున్నారు.

Published : 
  • 12 September 2026, 1:47 PM IST