Top story: సెప్టెంబర్‌ మొత్తం సెగలే ఈ ఎండలకు అసలు కారణం ఇదే..!

సెప్టెంబర్ నెల రాగానే వర్షాకాలం ముగింపు దశకు చేరుకుంటూ.. వాతావరణంలో చల్లటి గాలులు, ఆహ్లాదకరమైన మార్పులు కనిపిస్తాయి. కానీ ఈ సంవత్సరం తెలంగాణలో పరిస్థితి తలకిందులైంది. వర్షాలు కురిసి హాయిగా ఉండాల్సిన సెప్టెంబర్‌ నెలలో.. వేసవి కాలాన్ని తలపించేలా భానుడు

Post Published By: dialnews
Updated : 19 September 2026, 1:35 PM IST

సెప్టెంబర్ నెల రాగానే వర్షాకాలం ముగింపు దశకు చేరుకుంటూ.. వాతావరణంలో చల్లటి గాలులు, ఆహ్లాదకరమైన మార్పులు కనిపిస్తాయి. కానీ ఈ సంవత్సరం తెలంగాణలో పరిస్థితి తలకిందులైంది. వర్షాలు కురిసి హాయిగా ఉండాల్సిన సెప్టెంబర్‌ నెలలో.. వేసవి కాలాన్ని తలపించేలా భానుడు భగభగా మండుతున్నాడు. పగలు, రాత్రి తేడా లేకుండా ఉంటున్న ఉక్కపోత, తీవ్రమైన వేడితో జనం అల్లాడిపోతున్నారు. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ అదనంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నాయి. వాతావరణ శాఖ మరియు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంఘం గణాంకాల ప్రకారం, సెప్టెంబర్ ఆరంభంలో పగటి పూట ఉష్ణోగ్రతలు 30-31 డిగ్రీల సెల్సియస్‌గా, రాత్రి వేళల్లో 20-22 డిగ్రీల సెల్సియస్‌గా ఉండాలి. కానీ.. సెప్టెంబర్ మధ్యనాటికి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 34 నుండి 38 డిగ్రీలకు చేరుకోగా, కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 40 డిగ్రీల మార్కును తాకుతున్నాయి.

రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 24 నుంచి 27 డిగ్రీల వరకు నమోదు కావడం.. రాత్రివేళల్లో తీవ్రమైన ఉక్కపోతకు కారణమవుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల, నిర్మల్ వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అత్యంత విచిత్రమైన రీతిలో పెరిగాయి. హైదరాబాద్‌లో కూడా గచ్చిబౌలి, బాలానగర్, కాప్రా, నల్గొండలోని గుర్రంపోడు వంటి ప్రాంతాల్లో 37 నుండి 39.5 డిగ్రీల వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ విపరీతమైన వేడికి ప్రధాన కారణం తీవ్రమైన ఎల్-నినో ప్రభావం. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడానిని 'ఎల్-నినో' అంటారు. ప్రస్తుతం భూమధ్యరేఖ పసిఫిక్ ప్రాంతంలో తీవ్రమైన ఎల్-నినో పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీని వల్ల భారత ఉపఖండంపై ద్రోణి బలహీనపడటంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడాల్సిన అల్పపీడనాల సంఖ్య తగ్గింది. ఫలితంగా తెలంగాణకు అందాల్సిన స్థిరమైన నైరుతి రుతుపవనాల వర్షాలు తగ్గిపోయాయి.

మేఘాలు లేకపోవడం, నేరుగా సోలార్ రేడియేషన్ కూడా ఈ ఉష్టోగ్రతలకు మరో కారణం. ఆగస్టు మరియు సెప్టెంబర్ తొలి భాగంలో రుతుపవనాలు బలహీనపడటం వల్ల సుదీర్ఘ పొడి వాతావరణం ఏర్పడింది. ఆకాశం నిర్మలంగా, మేఘాలు లేకుండా ఉండటం వల్ల పగటిపూట సోలార్‌ రేడియేషన్‌ నేరుగా భూమిని తాకుతోంది. దీంతో పగటి ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. గాలిలో అధిక తేమ కూడా భరించలేని ఈ ఉక్కపోతకు మరో కారణంగా మారుతోంది. వర్షాలు పడకపోయినా గాలిలో తేమ శాతం 70 శాతానికి పైగా నమోదు కావడం మరొక ముప్పుగా మారింది. గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు మేఘాలు లేకపోతే, భూమి విడుదల చేసే వేడి అంతరిక్షంలోకి వెళ్లకుండా వాతావరణంలోనే బందీ అవుతుంది. దీనివల్ల చెమట సులభంగా ఆవిరి కాక ఉక్కపోత తీవ్రమవుతోంది.

మరోపక్క హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి నగరాల్లో విస్తరిస్తున్న కాంక్రీట్ కట్టడాలు, తార్‌ రోడ్లు.. పగటిపూట వేడిని పీల్చుకుని, రాత్రి వేళల్లో ఆ వేడిని బయటకు వదులుతున్నాయి. దీంతో రాత్రిళ్లు కూడా చల్లదనం బొత్తిగా కరువై వేసవి వాతావరణం నెలకొంటోంది. సాధారణంగా ఈపాటికి సమృద్ధిగా వర్షాలు కురవాల్సి ఉండగా, ఎల్-నినో ప్రభావం వల్ల ఆగస్టు మాసంలో సాధారణం కంటే దాదాపు 38% నుండి 64% తక్కువ వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ మూడో వారం నాటికి కూడా రాష్ట్రంలో సగటు వర్షపాతం తీవ్ర లోటులోనే కొనసాగుతోంది. తుఫానులు, నిరంతర చినుకుల బదులుగా హఠాత్తుగా పిడుగులతో కూడిన కుండపోత వర్షాలు కురిసి మళ్ళీ పొడి వాతావరణం ఏర్పడే విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, రానున్న 4 నుంచి 5 రోజుల్లో స్థానిక ద్రోణుల ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల వల్ల పెరిగిన ఉష్ణోగ్రతల నుండి తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ, ఇది శాశ్వత చల్లదనాన్ని ఇవ్వదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎల్-నినో తీవ్రత ఎక్కువగా ఉన్నందున, ఈ సారి రాబోయే శీతాకాలంపై కూడా దీని ప్రభావం పడి వేడి గాలులు, తక్కువ చలి నమోదు అయ్యే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవకపోవడం, చెరువులు, జలాశయాల్లో నీటిమట్టం అనుకున్నంతగా పెరగకపోవడంతో రాబోయే రోజుల్లో తాగునీటి మరియు సాగునీటి ఎద్దడి తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఏకధాటిగా కరువు పరిస్థితులు నెలకొనడం వల్ల ఖరీఫ్ పంటలు ఎండిపోయే ప్రమాదంలో పడ్డాయి. అకస్మాత్తుగా మారిన ఉష్ణోగ్రతలు, విపరీతమైన ఉక్కపోత వల్ల ప్రజలు డిహైడ్రేషన్, వడదెబ్బ, చర్మ సమస్యలు మరియు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. మొత్తానికి, సెప్టెంబర్ మాసంలో నెలకొన్న ఈ "వేసవి సెగలు" వాతావరణ మార్పుల తీవ్రతకు స్పష్టమైన సంకేతంగా నిలుస్తున్నాయి. ప్రకృతిని కాపాడుకోవడంలో మరియు పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టడంలో తగిన శ్రద్ధ వహించకపోతే రాబోయే కాలంలో మరింత తీవ్రమైన వాతావరణ విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ పరిస్థితులు హెచ్చరిస్తున్నాయి.

Published : 
  • 19 September 2026, 1:35 PM IST