Top story: ఆ 38 మంది మావోలు ఎక్కడ ?

మావోయిస్ట్‌ కీలక నేతల లొంగుబాటుతో ఆపరేషన్‌ కగార్‌ చరమాంకానికి చేరింది. మావోయిస్ట్‌ పార్టీ.. ఇక పూర్తిగా అంతమయ్యే దశకు చేరుకుంది.

Post Published By: dialnews
Updated : 27 February 2026, 10:26 AM IST

మావోయిస్ట్‌ కీలక నేతల లొంగుబాటుతో ఆపరేషన్‌ కగార్‌ చరమాంకానికి చేరింది. మావోయిస్ట్‌ పార్టీ.. ఇక పూర్తిగా అంతమయ్యే దశకు చేరుకుంది. పార్టీలో 55 మంది మాత్రమే మిగిలి ఉన్నారని గతంలో చెప్పిన పోలీసులు ఇప్పుడు 17 మంది మాత్రమే మిగిలి ఉన్నారని చెప్తున్నారు. అంటే ఈ మిగిలిన 38 మంది మావోలు ఎక్కడ ? వాళ్లంతా గుర్తులు మార్చుకుని అరణ్యాన్ని వదిలేశారా.. లేదంటే ప్రాణాలు పోయి ఈ ప్రపంచాన్నే వదిలేశారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

ఆపరేషన్‌ కగార్‌తో మావోయిస్ట్‌ పార్టీ చరమాంకానికి చేరింది. మావోయిస్టు ఉద్యమానికి సంబంధించి తెలంగాణ నుంచి ఇక మిగిలింది 11 మంది మావోయిస్టులు మాత్రమేనని రాష్ట్ర పోలీస్ శాఖ వెల్లడించింది. రీసెంట్‌గా అగ్ర నేతల లొంగుబాటుతో.. పార్టీలో మిగిలిన వారు ఎందరు అనే అంశం ఆసక్తికరంగా మారింది. జనవరి 3న పీఎల్బీఏ-1 బెటాలియన్ కమాండర్ బర్సే దేవా సరెండర్ కార్యక్రమంలో.. కేవలం 17మంది మాత్రమే మావోయిస్ట్‌ పార్టీలో మిగిలారని పోలీస్ శాఖ తెలిపింది. కానీ అంతకు ముందు 55 మంది ఉన్నారని పేర్కొంది. కానీ ఇప్పుడు 17 మందే ఉన్నారని చెప్పడంతో ఆ మిగిలిన 38 మంది ఏమయ్యారు అనేది చర్చనీయాంశంగా మారింది.

మావోయిస్ట్‌ పార్టీ దాదాపు ఖాళీ అయ్యింది. కానీ కొందరు అగ్ర నేతలు గణపతి, పసునూరి నరహరి, ముప్పిడి సాంబయ్య, వార్తా శేఖర్, జోడె రత్నాబాయి, నక్క సుశీల, రంగబోయిన భాగ్య, బడిశ ఉంగా, మాడ్వి అడుమే. కాశపోగు భవాని, కుంజం ఇడ్బల్ ఇలా 11 మంది పార్టీలో క్రియాశీలంగా ఉన్నట్లు రాష్ట్ర నిఘా వర్గాలు గుర్తించాయి. అగ్రనేతల లొంగుబాటుకు ముందు డిసెంబర్, జనవరి నెలలో మూడు సార్లు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో లొంగుబాటు సమావేశాలు జరిగాయి. డిసెంబర్‌ 19న నిర్వహించిన కార్యక్రమంలో 55 మావోలు ఉన్నారని చెప్పిన పోలీసులు.. బర్సే దేవా లొంగుబాటు సమయంలో మాత్రం 17 మందే మిగిలి ఉన్నారని చెప్పారు. ఆ సమయంలో మావోయిస్ట్ పార్టీ కూడా ఈ విషయంలో స్పష్టత ఇవ్వలేదు.

వీళ్ల సంగతి ఇలా ఉంటే.. దాదాపు 50 ఏళ్ల నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉన్న దేవరకొండ సత్యనారాయణ అలియాస్‌ బుక్క సత్తన్న ఆచూకీ లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హన్మకొండ జిల్లా గూడూరుకు చెందిన సత్తన్న జమ్మికుంటలో 10వ తరగతి వరకూ చదువుకున్నారు. తరువాత పెద్దపల్లి ఐటీఐ చేశారు. ఆ సమయంలోనే రాడికల్‌ స్టూడెంట్ వింగ్‌లో పని చేశారు. అక్కడి నుంచి 1975లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పుడు వెళ్లిన సత్తన్న తల్లి చనిపోయినా కూడా తిరిగి ప్రజా జీవితంలోకి రాలేదు. చాలా కాలం నుంచి సత్తన్న ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. అసలు బతికే ఉన్నారా లేదా అనేది కూడా క్లారిటీ లేదు. ఇలా సత్తన్న ఒక్కరే కాదు. తెలంగాణలోని ప్రతీ జిల్లా నుంచి ఉద్యమంలోకి వెళ్లి కనుమరుగైపోయిన మావోయిస్ట్‌లు ఉన్నారు.

ఈ 38 మంది మావోయిస్టు కేడర్ కుటుంబ సభ్యులు తమ వారి రాక కోసం ఎదురు చూస్తున్నారు. తిప్పిరి తిరుపతి లొంగిపోయిన సమయంలో ఈ 38 మంది గురించి సమాచారం తెలుస్తుందని అంతా భావించారు. కానీ వాళ్ల నుంచి కూడా ఎలాంటి స్పస్టత రాలేదు. ఈ 38 పార్టీలో కొనసాగుతున్నారా లేదా ? అనే అంశంపై ఎలాంటి ఆధారాలు లేవని నిఘా వర్గాలు చెప్తున్నాయి. వాళ్ల అంచనా ప్రకారం.. అజ్ఞాతంలో ఉన్న సమయంలోనే ఈ కేడర్ ఉద్యమానికి పూర్తిగా దూరమై ఉండొచ్చని భావిస్తున్నారు. కొందరు గుర్తింపులు మార్చుకొని ఎక్కడో సాధారణ జీవితం గడుపుతూ ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.

Published : 
  • 27 February 2026, 10:26 AM IST