పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు మునుపెన్నడూ లేని విధంగా ముదురుతున్నాయి. ఇరాన్‌పై మరోసారి అత్యంత భీకరమైన దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతోందా? ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఎన్నికల లెక్కల కోసం ఇరాన్, లెబనాన్ లేదా పాలస్తీనా ప్రాంతాలపై సరికొత్త దాడులకు స్కెచ్ వేశారా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ నివేదికలు. ఈ ఉద్రిక్తతల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఇజ్రాయెల్‌కు ఏకంగా 40 వేల అత్యంత శక్తివంతమైన, వినాశకరమైన బాంబులను సరఫరా చేసేందుకు ట్రంప్ అంగీకరించారు. అసలు ఈ ఒప్పందం వెనుక ఉన్న రహస్యాలేంటి? అమెరికా ఇచ్చిన ఈ ఆయుధాలతో పశ్చిమ ఆసియాలో ఎలాంటి యుద్ధ మేఘాలు కమ్ముకోబోతున్నాయి?
వివరాల్లోకి వెళితే.. పశ్చిమ ఆసియాలో ఇజ్రాయెల్ ఒంటరి అవుతున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నెతన్యాహుకు భారీ ఊరటనిచ్చింది. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం, ఇజ్రాయెల్‌కు అత్యంత ప్రాణాంతకమైన ఆయుధాలను విక్రయించేందుకు ట్రంప్ అంగీకరించారు. ఇందులో భాగంగా ఒక్కొక్కటి 2,000 పౌండ్ల బరువుండే 40 వేల భారీ బాంబులను అమెరికా సరఫరా చేయనుంది. ఈ ప్యాకేజీలో 20,000 'MK 84' బాంబులు, మరో 20,000 'BLU-117' బాంబులతో పాటు 20,000 'I-2000 పెనెట్రేటర్' వార్హెడ్లు కూడా ఉన్నాయి. గతేడాది కాంగ్రెస్ సమీక్షా ప్రక్రియను పక్కనబెట్టి మరీ ట్రంప్ యంత్రాంగం దాదాపు 3 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను ఇజ్రాయెల్‌కు విక్రయించింది. గతంలో జో బైడెన్ ఈ 2,000 పౌండ్ల బాంబుల సరఫరాను నిలిపివేయగా, ట్రంప్ అధికారంలోకి రాగానే మళ్లీ వీటి రవాణాను పునరుద్ధరించడం గమనార్హం.
మరి ఇంత భారీ ఎత్తున ఆయుధాలను ఇజ్రాయెల్ ఎందుకు సేకరిస్తోంది? దీని వెనుక ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పొలిటికల్ మైండ్ గేమ్ ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇజ్రాయెల్‌లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో జాతీయవాదాన్ని రగిల్చేందుకు, అక్కడి అల్ట్రా-ఆర్థడాక్స్ యూదుల మద్దతు కూడగట్టేందుకు నెతన్యాహు వ్యూహాలు రచిస్తున్నారు. అందుకోసమే ఇరాన్‌పై మరోసారి మెరుపు దాడి చేయడమా, లేదా లెబనాన్‌ను టార్గెట్ చేయడమా అనే ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు, పాలస్తీనాపై మరోసారి విరుచుకుపడి వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని పూర్తిగా ఇజ్రాయెల్‌లో విలీనం చేసుకోవాలనే 'గ్రేటర్ ఇజ్రాయెల్' ప్లాన్ కూడా నెతన్యాహు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల కోసమే ఈ 2,000 పౌండ్ల బాంబులను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ భారీగా నిల్వ చేసుకుంటోంది.
కేవలం ఆయుధాలు ఇవ్వడమే కాదు, ఇరాన్ దాడుల నుంచి ఇజ్రాయెల్‌ను రక్షించేందుకు అమెరికా సైన్యం నేరుగా రంగంలోకి దిగింది. ఇటీవల జోర్డాన్‌పై ఇరాన్ క్షిపణి దాడి చేసిన సమయంలో పెంటగాన్ తన అత్యంత ఖరీదైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను యాక్టివేట్ చేసింది. కేవలం గత వారంలోనే 70కి పైగా హై-ఎండ్ ఎయిర్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్లను అమెరికా ప్రయోగించింది. ఇందులో ఒక డజనుకు పైగా అత్యంత శక్తివంతమైన 'థాడ్' ఇంటర్సెప్టర్లు ఉన్నాయి. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి జూన్ నెల వరకు అమెరికా దాదాపు 1,700 పేట్రియాట్ ఇంటర్సెప్టర్లను, 200 పైగా థాడ్ ఇంటర్సెప్టర్లను వాడేసింది. అలాగే అమెరికా నావికాదళ నౌకలు ఇరాన్ డ్రోన్లు, మిస్సైళ్లను అడ్డుకోవడానికి 150 స్టాండర్డ్ మిస్సైళ్లను ప్రయోగించాయి.
అమెరికా ఇజ్రాయెల్ కోసం ఇంతగా ఆయుధ సంపత్తిని ఖర్చు చేయడంపై అంతర్జాతీయ రక్షణ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా లాంటి ప్రధాన శత్రువును పక్కనబెట్టి, ట్రంప్ ప్రభుత్వం తన దృష్టిని పశ్చిమ ఆసియాపై కేంద్రీకరించిందని, అమెరికా తన విలువైన వనరులను ఇక్కడ వృథా చేస్తోందని విమర్శిస్తున్నారు. మరోవైపు, ఇజ్రాయెల్ గాజా మరియు లెబనాన్ ప్రాంతాలలో ఈ 2,000 పౌండ్ల బాంబులను విచ్చలవిడిగా ఉపయోగిస్తోందని, దీనివల్ల వేలాది మంది సాధారణ పౌరుల ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయని మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. అమెరికా ఇచ్చిన 40 వేల బాంబుల అండతో ఇజ్రాయెల్ పశ్చిమ ఆసియాలో ఎలాంటి కల్లోలాన్ని సృష్టించబోతుందో.