2026 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు టైటిల్‌కు కేవలం రెండు అడుగుల దూరంలో ఉంది. మార్చి 5వ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌తో భారత్ తలపడనుంది. అయితే, ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ జట్టు మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. టోర్నీ ఆరంభంలో అద్భుతంగా రాణించిన సూర్య, ఆ తర్వాత వరుసగా తక్కువ స్కోర్లకే పరిమితం కావడం సెమీఫైనల్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ టోర్నీని ఘనంగా ప్రారంభించాడు. అమెరికాపై జరిగిన తొలి మ్యాచ్‌లో 84 పరుగులతో విరుచుకుపడి జట్టుకు విజయాన్ని అందించాడు. కానీ, ఆ తర్వాత ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా 40 పరుగుల మార్కును దాటలేకపోయాడు. ప్రస్తుతం ఏడు మ్యాచుల్లో 38.50 సగటుతో 231 పరుగులు చేసిన సూర్య, జట్టులో టాప్ స్కోరర్‌గా ఉన్నప్పటికీ, తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ముఖ్యంగా 135 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉన్నప్పటికీ, కీలక సమయాల్లో వికెట్ పారేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
సూర్యకుమార్ యాదవ్ భారత బ్యాటింగ్ లైనప్ లో అత్యంత కీలకమైన నంబర్ 4 స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. మిడిల్ ఓవర్లలో పరుగులు రాబట్టడం, భారీ స్కోరుకు పునాది వేయడం ఇక్కడ ప్రధాన బాధ్యత. అయితే సూర్య విఫలమవుతుండటంతో మిడిల్ ఆర్డర్ మొత్తం కుప్పకూలుతోంది. మరోవైపు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి టాప్ ఆర్డర్ బ్యాటర్లు నిలకడగా రాణించలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మిడిల్ ఆర్డర్ బాధ్యతను సూర్య మోయాల్సి ఉండగా, అతను ఫామ్ కోల్పోవడం భారత్‌కు పెద్ద మైనస్‌గా మారింది.
సాధారణంగా పవర్ ప్లే ముగిసిన తర్వాత మిడిల్ ఓవర్లలో బ్యాటర్లు వేగంగా పరుగులు సాధిస్తే, చివర్లో వచ్చే లోయర్ ఆర్డర్ బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుంది. కానీ సూర్యకుమార్ యాదవ్ మధ్య ఓవర్లలో త్వరగా అవుట్ అవ్వడం వల్ల రింకూ సింగ్ వంటి ఫినిషర్లపై ఒత్తిడి పెరుగుతోంది. మిడిల్ ఆర్డర్ తన బాధ్యతను సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల, డెత్ ఓవర్లలో భారీ స్కోర్లు సాధించాలనే ఒత్తిడితో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు కూడా తక్కువ పరుగులకే అవుట్ అవుతున్నారు. ఇది జట్టు మొత్తానికి ఇబ్బందికరంగా మారింది.ఇంగ్లాండ్‌తో జరిగే సెమీఫైనల్ నాకౌట్ మ్యాచ్ కావడంతో, ఇక్కడ తప్పులకు తావులేదు. వాంఖడే స్టేడియం సూర్యకు హోమ్ గ్రౌండ్. ఇక్కడ అతనికి మంచి రికార్డు ఉంది. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తోపు అయిన సూర్య, తన ట్రేడ్ మార్క్ షాట్లతో సెమీఫైనల్లో ఫామ్ లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అతను క్రీజులో నిలబడితేనే భారత్ భారీ స్కోరు సాధించి ఫైనల్ చేరడం సాధ్యమవుతుంది.