టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తనదైన యాక్షన్ మార్క్ సెట్ చేసిన ‘మ్యాచో స్టార్’ గోపీచంద్ ఇప్పుడు సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన గోపీచంద్, ప్రస్తుతం తన కెరీర్లో 33వ సినిమాను పట్టాలెక్కించారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ మూవీ టైటిల్‌ను ప్రకటించేందుకు మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. గోపీచంద్ గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ‘గాజి’, ‘అంతరిక్షం’ వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన జాతీయ అవార్డు గ్రహీత సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో గోపీచంద్ తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నారు.
ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదల చేసిన పోస్టర్ చూస్తుంటే, ఇది ఒక పీరియడ్ డ్రామా కలగలిసిన అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోపీచంద్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్ర టైటిల్‌ను రేపు ఉదయం 11:17 గంటలకు అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ మేరకు విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ సినిమా మూడ్‌ను సెట్ చేస్తోంది.
‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ బ్యానర్‌పై శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. గోపీచంద్ కెరీర్‌ను గమనిస్తే, ఆయన యాక్షన్ సినిమాలకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే సంకల్ప్ రెడ్డి మార్క్ మేకింగ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సంకల్ప్ రాసుకున్న విభిన్నమైన కథాంశానికి గోపీచంద్ మేనరిజమ్స్ తోడైతే, వెండితెరపై ఒక విజువల్ వండర్ పక్కా అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా ఈ పోస్టర్ డిజైన్ చూస్తుంటే, గోపీచంద్ లుక్ కూడా చాలా కొత్తగా ఉండేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి 33వ చిత్రంతో ఈ మ్యాచో హీరో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతారో లేదో చూడాలి.