యార్కర్ల స్పెషలిస్ట్ కు ఏమైంది…? ఒక్క వికెట్ కూడా తీయని బుమ్రా…!

క్రికెట్ ప్రపంచంలో బ్యాటర్ల గుండెల్లో వణుకు పుట్టించే బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా. అతని కచ్చితమైన యార్కర్లు, బౌన్సర్లు, స్లోయర్ బాల్స్ ఆడేందుకు బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడల్లా ప్రతీ కెప్టెన్ బుమ్రాకే బంతిని అందిస్తాడు.

Post Published By: dialnews
Updated : 14 April 2026, 6:15 PM IST

క్రికెట్ ప్రపంచంలో బ్యాటర్ల గుండెల్లో వణుకు పుట్టించే బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా. అతని కచ్చితమైన యార్కర్లు, బౌన్సర్లు, స్లోయర్ బాల్స్ ఆడేందుకు బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడల్లా ప్రతీ కెప్టెన్ బుమ్రాకే బంతిని అందిస్తాడు. బ్యాటర్లు రాజ్యమేలుతున్న టీ20 క్రికెట్‌లోనూ బుమ్రా బంతితో సత్తా చాటాడు. ఎంత ఫ్లాట్ ఫిచ్ అయినా బుమ్రా బౌలింగ్‌లో ఎదురుదాడికి దిగాలంటే బ్యాటర్లు జంకుతారు. అలాంటి బుమ్రా ఇప్పుడు తేలిపోతున్నాడు.ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఆడిన బుమ్రా ఒక్క వికెట్ తీయలేకపోయాడు. 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ కూడా బుమ్రా బౌలింగ్‌ను చితగ్గొట్టాడు. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్ బాదిన బుడ్డోడు.. తొలి మూడు బంతుల్లో రెండు సిక్స్‌లు బాది బుమ్రా పేరుకున్న భయాన్ని తొలగించాడు.

అంతేకాకుండా బుమ్రా బౌలింగ్ తనకు అంత భీకరంగా ఏం లేదని చెప్పాడు. ఈ బుడ్డోడి ప్రభావమో ఏమో తెలియదు కానీ.. ఇతర జట్ల బ్యాటర్లు కూడా బుమ్రాను అలవోకగా బాదుతున్నారు. వైభవ్ సూర్యవంశీ ఫియర్‌లెస్ బ్యాటింగ్‌తో బుమ్రా అంటే భయం పోయిందని యశస్వి జైస్వాల్ చెప్పడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. గతేడాది ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ముంబై చివరి మ్యాచ్‌లోనూ బుమ్రా వికెట్ పడగొట్టలేదు. తాజా సీజన్‌లో కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌ల్లోనూ బుమ్రా వికెట్ సాధించలేకపోయాడు. వికెట్ తీయడం దేవుడెరుగు తన శైలికి భిన్నంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. అతని బౌలింగ్ వైఫల్యం ముంబై ఇండియన్స్ విజయవకాశాలను దెబ్బతీస్తోంది. ఇది ఆ జట్టు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

ఆదివారం ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లోనూ బుమ్రా తేలిపోయాడు. 4 ఓవర్లు వేసి 35 పరుగులు సమర్పించుకున్నాడు. ఇతర బౌలర్ల కంటే కాస్త కట్టడిగానే వేసినా వికెట్ సాధించలేకపోయాడు. తన స్పెల్ ఆఖరి బంతి పూర్తయిన అనంతరం బుమ్రా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. వికెట్లు తీయాలనే ఒత్తిడి అతనిపై ఎంతగా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది.బుమ్రా తన ప్రధాన అస్త్రమైన యార్కర్లను సరిగ్గా ఉపయోగించడం లేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అతని వైఫల్యానికి కారణం ఇదేనని చెబుతున్నారు. వికెట్లు తీయాలనే ఒత్తిడిలో ఎక్కువ పరుగులు సమర్పించుకుంటున్నాడని విశ్లేషిస్తున్నారు. వికెట్ల కోసం కాకుండా.. ప్రత్యర్థి బ్యాటర్లను పరుగులు చేయకుండా కట్టడి చేయడంపై ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు.

Published : 
  • 14 April 2026, 6:15 PM IST