టీ20ల్లో 200 కొడతా తన టార్గెట్ చెప్పిన బుడ్డోడు…!

ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. లీగ్ దశలో ప్రపంచ స్థాయి బౌలర్లను కూడా ఊచకోత కోస్తూ తన జట్టును ప్లేఆఫ్స్ చేర్చడంలో ఈ బీహార్ కుర్రోడు కీలక పాత్ర పోషించాడు.

Post Published By: dialnews
Updated : 27 May 2026, 10:30 PM IST

ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. లీగ్ దశలో ప్రపంచ స్థాయి బౌలర్లను కూడా ఊచకోత కోస్తూ తన జట్టును ప్లేఆఫ్స్ చేర్చడంలో ఈ బీహార్ కుర్రోడు కీలక పాత్ర పోషించాడు. ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలిచి టాప్-4లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకుపోతున్న వైభవ్ సూర్యవంశీ.. తాజాగా క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఓ కీలక ప్రకటన చేశాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో డబుల్ సెంచరీ బాదుతానని వైభవ్ సూర్యవంశీ ధీమా వ్యక్తం చేశాడు. ఇటీవల ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ హోస్ట్ చేస్తున్న 'ది స్విచ్' అనే టాక్ షోలో వైభవ్ సూర్యవంశీ పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా పీటర్సన్‌తో మాట్లాడుతూ.. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ ఐపీఎల్‌లో నెలకొల్పిన ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగుల ఆల్‌టైమ్ రికార్డును తాను బద్దలు కొట్టాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. పూర్తి 20 ఓవర్లు క్రీజులో నిలబడి బ్యాటింగ్ చేయగలిగితే.. కచ్చితంగా క్రిస్ గేల్ రికార్డును దాటి డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకుంటానని వైభవ్ స్పష్టం చేశాడు.2013 ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున గేల్ చేసిన 175 పరుగుల రికార్డు ఇప్పటివరకు పదిలంగా ఉంది. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.

ఇప్పటివరకు ఆడిన 14 మ్యాచ్‌ల్లో 41.64 సగటుతో, ఏకంగా 232.27 అనే అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో 583 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 3 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో 5వ స్థానంలో ఉన్న వైభవ్.. లీగ్ దశలో అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన టాప్-5 బ్యాటర్లలో నంబర్ వన్‌గా నిలిచాడు. సిక్సర్ల సునామీతో మైదానాన్ని హోరెత్తిస్తున్న వైభవ్ సూర్యవంశీ.. ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా కూడా రికార్డు సృష్టించాడు. కేవలం 14 మ్యాచ్‌ల్లోనే అతను 53 భారీ సిక్సర్లు కొట్టాడు. 2012లో క్రిస్ గేల్ ఒకే ఐపీఎల్ సీజన్‌లో నమోదు చేసిన అత్యధిక సిక్సర్ల రికార్డును బ్రేక్ చేయడానికి వైభవ్ కేవలం 7 సిక్సర్ల దూరంలో మాత్రమే ఉన్నాడు.

Published : 
  • 27 May 2026, 10:30 PM IST