తమను ఛాంపియన్ జట్టు అని ఎందుకు పిలుస్తారో ఆస్ట్రేలియా మరోసారి రుజువు చేసింది. మహిళల టీ20 ప్రపంచకప్ ను రెండో సారి కైవసం చేసుకుంది. ఫైనల్లో ఉండే ఒత్తిడిని అలవోకగా అధిగమించిన కంగారూలు ఏడోసారి ట్రోఫీని ఎగరేసుకుపోయారు. అసలు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని జట్లు చాలానే ఉంటే ఆస్ట్రేలియా మాత్రం 8 సార్లు ఫైనల్ కు వెళ్లి ఏకంగా ఏడుసార్లు టైటిల్ ఖాతాలో వేసుకుంది. పురుషుల క్రికెట్‌లో ఆస్ట్రేలియా డామినేషన్ తగ్గినప్పటికీ.. మహిళల క్రికెట్‌లో మాత్రం వాళ్లకు తిరుగులేకుండా పోయింది.ఐసీసీ కప్పులు గెలవడం ఒక అలవాటుగా మార్చుకున్న ఆస్ట్రేలియా ఉమెన్స్ టీమ్.. 2026 మహిళల టీ20 ప్రపంచకప్ గెలుపుతో టీమ్ మొత్తం 14 ఐసీసీ ట్రోఫీలు సాధించిన ఘనతను అందుకుంది.
ఇందులో 7 వన్డే ప్రపంచకప్‌లు, 7 టీ20 ప్రపంచకప్‌లు ఉన్నాయి. ప్రపంచ మహిళల క్రికెట్ చరిత్రలో ఇంతటి విజయవంతమైన జట్టు మరొకటి లేదు. వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది.1978లో తొలి టైటిల్ గెలిచిన ఆ జట్టు, ఆ తర్వాత 1982, 1988, 1997, 2005, 2013, 2022లోనూ విజేతగా నిలిచి మొత్తం ఏడు సార్లు ట్రోఫీని సొంతం చేసుకుంది. దాదాపు ఐదు దశాబ్దాలుగా ప్రపంచ మహిళల వన్డే క్రికెట్‌లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. టీ20 ప్రపంచకప్‌లోనూ ఆస్ట్రేలియా అదే జోరు కొనసాగించింది. 2010లో తొలి టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన జట్టు, 2012, 2014, 2018, 2020, 2023, తాజాగా 2026లోనూ టైటిల్ సాధించి ఏడు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది.
ముఖ్యంగా 2018 నుంచి 2023 వరకు వరుసగా నాలుగు టీ20 ప్రపంచకప్‌లు గెలవడం వారి ఆధిపత్యానికి నిదర్శనం. నిన్న ఫైనల్ మ్యాచ్ లోనూ కంగారూలు పూర్తి ఆధిపత్యం కనబరిచారు. ఇంగ్లాండ్ ఏ దశలోనూ పెద్దగా పోటీనివ్వలేకపోయింది. లార్డ్స్ వేదికగా జరిగిన తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 150/4 పరుగులకే పరిమితమైంది. తర్వాత 151 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 17.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూ పాడుతూ ఛేదించింది. దీంతో ఫైనల్ మ్యాచ్ మజా అసలు కనిపించలేదంటూ చాలా మంది కామెంట్స్ చేశారు. అసలు మీకు బోర్ కొట్టదా.. ఇన్ని కప్పులా అంటూ ఆసీస్ జట్టుపై పలువురు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.