ఒక నిశ్చితార్థం జరిగిన అమ్మాయి, తన ప్రియుడితో కలిసి కాబోయే భర్తను కొండపై నుండి నెట్టి చంపేసింది. పూణేలోని లోహగఢ్ కోటపై జరిగిన కేతన్ అగర్వాల్ మరణం వెనుక ఉన్న అసలు కథ ఇదీ అంటూ మీడియా హల్‌చల్ చేస్తోంది. నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరిలను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అయితే ఇక్కడే ఒక మైండ్ బ్లాంకింగ్ ట్విస్ట్ ఉంది. బయట సమాజం వీళ్లను హంతకులుగా డిసైడ్ చేసేసింది కానీ.. కోర్టులో వీళ్లకు శిక్ష పడేలా చేయడం పోలీసుల వల్ల కావడం లేదు. ప్రస్తుతం పోలీసులు చేతులెత్తేసే పరిస్థితి కనిపిస్తోంది. సాంకేతిక ఆధారాలు లేక, ప్రత్యక్ష సాక్షులు దొరక్క చట్టం ముందు పోలీసులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? దొరికిన హంతకులు కూడా ఏ సాక్ష్యాలు లేవని ఎలా తప్పించుకోబోతున్నారు?
వివరాల్లోకి వెళ్తే.. జూన్ 18న జరిగిన ఈ ఘటనను మొదట ట్రెకింగ్ ప్రమాదంగా భావించారు. కానీ, 20 ఏళ్ల సియాకు ఈ అరేంజ్డ్ మ్యారేజ్ ఇష్టం లేక, తన ప్రియుడు చేతన్‌తో కలిసి కేతన్‌ను కొండపై నుండి నెట్టేసిందని పోలీసులు కనిపెట్టారు. నిందితులు ఇద్దరూ తామే చంపామని పోలీసుల ముందు ఒప్పుకున్నారు కూడా. కానీ ఇక్కడే చట్టంలోని అసలు ట్విస్ట్ ఉంది. భారతీయ న్యాయ వ్యవస్థ ప్రకారం పోలీస్ కస్టడీలో నిందితులు చెప్పే 'ఒప్పుకోళ్లకు' కోర్టులో అస్సలు విలువ ఉండదు. రేపు కోర్టు బోనులో నిలబడి.. 'పోలీసులు మమ్మల్ని కొట్టి బలవంతంగా సైన్ చేయించుకున్నారు' అని సియా చెప్తే, పోలీసులు రాసిన కథ మొత్తం స్క్రాప్ కింద మారిపోతుంది. మరి పోలీసులు ఈ నేరాన్ని ఎలా నిరూపించాలి? అక్కడే టెక్నికల్ ఇష్యూస్ మొదలవుతాయి.
ఈ కేసులో ఒకే ఒక్క ప్రత్యక్ష సాక్షి కూడా లేడు, అలాగే హత్య జరిగినప్పుడు తీసిన వీడియో రికార్డింగ్ కూడా లేదు. కాబట్టి, ఈ కేసు పూర్తిగా 'పరిస్థితుల ఆధారిత సాక్ష్యాల' పైనే ఆధారపడి ఉంది. భారత సుప్రీంకోర్టు 1984లో ఇచ్చిన 'శరద్ బిర్ధిచంద్ శారద' కేసు తీర్పు ప్రకారం.. పరిస్థితుల ఆధారిత కేసులలో ఐదు సూత్రాల గొలుసు ఖచ్చితంగా కనెక్ట్ అవ్వాలి. అంటే.. పోలీసులు సేకరించిన ప్రతి సాక్ష్యం ఒకదానికొకటి బలంగా ముడిపడి ఉండాలి. ఆ గొలుసులో ఏ ఒక్క లింక్ తెగినా, ఆ అనుమానం తాలూకు లాభం నిందితుడికే చెందుతుంది. లోహగఢ్ కేసులో ఆ గొలుసు చాలా బలహీనంగా ఉంది.
పోలీసులు సేకరించిన టెక్నికల్ ఆధారాలను ఒకసారి పరిశీలిస్తే..
మొదటిది మోటివ్ (ఉద్దేశం): సియా, చేతన్‌లు కేఫ్‌లో కలుసుకున్న సీసీటీవీ విజువల్స్, వాళ్ల ఫోన్ కాల్ డేటా కేవలం వాళ్లకు అఫైర్ ఉందనే విషయాన్ని లేదా వాళ్లు ప్లాన్ చేశారనే అనుమానాన్ని మాత్రమే నిరూపిస్తాయి. కానీ.. ఆ ప్లాన్‌ను వాళ్లు కోటపై అమలు చేశారనే దానికి అది సాక్ష్యం కాదు.
రెండవది లై డిటెక్టర్ టెస్ట్ వైఫల్యం: నిందితులకు లై డిటెక్టర్ (అబద్ధాలు కనిపెట్టే) పరీక్షలు చేయాలన్న పోలీసుల పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఎందుకంటే పోలీసుల దగ్గర బలమైన ఆధారాలు లేవు.
మూడవది ఆ కొన్ని అడుగుల రాయి: ఈ కేసు మొత్తం లోహగఢ్ కోటపై కేతన్ కిందపడిన ఆ కొన్ని అడుగుల రాయి చుట్టూనే తిరుగుతోంది. కేతన్ స్వయంగా కాలు జారి పడ్డాడా? లేదా ఎవరైనా తోశారా? ఒకవేళ తోస్తే.. అది కావాలని చంపడానికి తోశారా, లేక గొడవ జరుగుతున్నప్పుడు అనుకోకుండా జరిగిందా? ఈ టెక్నికల్ పాయింట్స్‌ను ఫోరెన్సిక్ పరంగా నిరూపించే బలమైన సైంటిఫిక్ ఆధారాలు పోలీసుల దగ్గర లేవు."
గతంలో దేశాన్ని కుదిపేసిన 2008 నాటి ఆరుషి తల్వార్ డబుల్ మర్డర్ కేసును ఇక్కడ లాయర్లు గుర్తు చేస్తున్నారు. ఆ కేసులో కూడా తల్లిదండ్రులే చంపారని మీడియా, ప్రజలు బలంగా నమ్మారు. కింది కోర్టు శిక్ష వేసినా.. హైకోర్టుకు వెళ్లేసరికి పరిస్థితుల ఆధారాల గొలుసులో లింకులు తెగిపోవడంతో ఆధారాలు లేక వాళ్లు నిర్దోషులుగా విడుదలయ్యారు. ఇప్పుడు సియా గోయల్ కేసు కూడా అదే దారిలో వెళ్లే ప్రమాదం కనిపిస్తోంది. కేవలం పత్రికల్లో వచ్చే హెడ్‌లైన్స్ కోర్టులో పని చేయవు. పోలీసులు ప్రతి క్లెయిమ్స్ ను పక్కా లీగల్ సాక్ష్యాలుగా మార్చకపోతే.. ఒక యువకుడి ప్రాణం పోయినా, హంతకులు మాత్రం చట్టంలోని లోపాల వల్ల ఈజీగా బయటపడిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. చూశారుగా.. సాంకేతిక ఆధారాలు లేకపోతే చట్టం ముందు పోలీసులు ఎంత బలహీనపడిపోతారో ఈ కేసు నిరూపిస్తోంది.