Top story: ఇస్రోకు భారీ షాక్.. సైంటిస్ట్ లు ఎందుకు రాజీనామా చేస్తున్నారు..? భయపడుతోన్న కేంద్రం..!

చంద్రయాన్-3, మంగళ్యాన్ వంటి అద్భుతమైన ప్రయోగాలతో ప్రపంచ దేశాల ముందు భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన సంస్థ మన ఇస్రో. అయితే ఇప్పుడు మన ఇస్రో ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

Post Published By: dialnews
Updated : 18 July 2026, 7:40 PM IST

చంద్రయాన్-3, మంగళ్యాన్ వంటి అద్భుతమైన ప్రయోగాలతో ప్రపంచ దేశాల ముందు భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన సంస్థ మన ఇస్రో. అయితే ఇప్పుడు మన ఇస్రో ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశం గర్వించదగ్గ ఎంతో మంది అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు ఇస్రోకు గుడ్ బై చెప్తున్నారు. అవును, గత కొన్ని నెలలుగా దాదాపు 100 మందికి పైగా సీనియర్ శాస్త్రవేత్తలు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయడం లేదా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందంటే.. గగన్‌యాన్ లాంటి ప్రతిష్టాత్మక మిషన్లకు ఆటంకం కలగకుండా ఉండటానికి కేంద్ర అంతరిక్ష శాఖ రంగంలోకి దిగి, శాస్త్రవేత్తల రాజీనామాలను అడ్డుకునేందుకు కఠినమైన రూల్స్ తీసుకురావాల్సి వచ్చింది. అసలు మన మేధావులు ఇస్రోను ఎందుకు వదిలి వెళ్తున్నారు? ప్రైవేట్ కంపెనీలు వాళ్లకు ఇస్తున్న ఆఫర్స్ ఏంటి? కేంద్రం తెచ్చిన కొత్త నిబంధనలు ఏంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు క్లియర్ గా తెలుసుకుందాం.

అసలు శాస్త్రవేత్తలు ఇస్రోను వదిలి వెళ్లడానికి మొదటి మరియు ప్రధాన కారణం.. భారతదేశంలో ప్రైవేట్ అంతరిక్ష రంగానికి తలుపులు తెరవడం. గత కొన్ని ఏళ్లుగా మన దేశంలో స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, పిక్సెల్ వంటి అనేక ప్రైవేట్ స్పేస్ స్టార్టప్‌లు వేగంగా వృద్ధి చెందాయి. ఈ కంపెనీల దగ్గర భారీగా ఫండింగ్ ఉండటంతో, ఇస్రోలో పనిచేసే టాలెంటెడ్ శాస్త్రవేత్తలకు వల వేస్తున్నాయి.

ఇస్రోలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వచ్చే జీతాల కంటే ఈ ప్రైవేట్ కంపెనీలు ఏకంగా 3 నుండి 5 రెట్లు ఎక్కువ జీతాలు ఆఫర్ చేస్తున్నాయి. కేవలం భారీ ప్యాకేజీలు మాత్రమే కాదు.. కంపెనీ షేర్లలో భాగస్వామ్యం (ESOPs), మెరుగైన గుర్తింపు మరియు కెరీర్‌లో వేగంగా ఎదిగేందుకు లీడర్‌షిప్ పాత్రలను ఇస్తున్నాయి. ప్రభుత్వ సంస్థల్లో ఉండే సాంప్రదాయ నిబంధనల కంటే, ఈ స్టార్టప్‌లలో ఉండే స్వేచ్ఛాయుత వాతావరణం, కొత్త ఐడియాలను వేగంగా అమలు చేసే అవకాశం యువ శాస్త్రవేత్తలను అమితంగా ఆకర్షిస్తోంది.

అయితే, శాస్త్రవేత్తల వలసలకు కేవలం డబ్బు ఒక్కటే కారణం కాదు అని అంతర్గత విశ్లేషణలు చెబుతున్నాయి. ఇస్రోలో ప్రాజెక్టులు ఆలస్యం కావడం కూడా మరో ముఖ్య కారణం. భారతదేశపు మొదటి మానవసహిత అంతరిక్ష యాత్ర 'గగన్‌యాన్' G1 టెస్ట్ ఫ్లైట్, అలాగే SSLV-L1 వంటి కీలకమైన మిషన్లు అనుకున్న సమయం కంటే చాలా ఆలస్యమవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నా ప్రయోగాలు వాయిదా పడుతుండటంతో శాస్త్రవేత్తలలో ఒక రకమైన అసంతృప్తి, నిరాశ పెరుగుతున్నాయి.

దీనికి తోడు, ఇస్రోలో సాంకేతిక మరియు పరిపాలనాపరమైన నిర్ణయాలన్నీ కేవలం చైర్మన్ కార్యాలయం నుంచే కేంద్రీకృతంగా సాగుతున్నాయని, క్షేత్రస్థాయిలో పని చేసే అధికారులకు పూర్తి స్వేచ్ఛ లేదా నిర్ణయాధికారాలు ఉండటం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. దీనివల్ల చిన్న ఆమోదాల ప్రక్రియ కూడా ఎంతో ఆలస్యమై, పని చేయాలనుకునే వారి ఉత్సాహం దెబ్బతింటోంది. ఈ మేధోవలసను ఇలాగే వదిలేస్తే గగన్‌యాన్ లాంటి దేశ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ప్రమాదంలో పడతాయని కేంద్ర ప్రభుత్వం గ్రహించింది.

అందుకే అంతరిక్ష శాఖ జూలై 14న ఒక సంచలన ఆదేశాన్ని జారీ చేసింది. ఈ కొత్త రూల్ ప్రకారం.. గగన్‌యాన్ లేదా ఇతర అత్యంత ప్రాధాన్యత కలిగిన మిషన్లలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు ఎవరైనా రాజీనామా చేయాలన్నా, లేదా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాలన్నా.. దాన్ని ఇస్రో మేనేజ్మెంట్ నేరుగా ఆమోదించడానికి వీల్లేదు. ఆ రాజీనామా పత్రాలను నేరుగా ఢిల్లీలోని అంతరిక్ష శాఖ ఉన్నతాధికారుల పరిశీలనకు పంపాలి. వారు ప్రతీ ఒక్కరి కేసును వ్యక్తిగతంగా పరిశీలించి, దేశ భద్రత లేదా ప్రాజెక్ట్ భవిష్యత్తుకు నష్టం లేదని నిర్ధారించుకున్నాకే ఆమోదం తెలుపుతారు. అంటే శాస్త్రవేత్తలు అంత సులభంగా ఇస్రోను వదిలి వెళ్లడానికి వీల్లేకుండా కేంద్రం చట్టపరమైన బ్రేకులు వేసింది.

ఇస్రోలో మొత్తం 14,600 మందికి పైగా సిబ్బంది ఉన్నారు. అందులో 100 మంది వెళ్లడం చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ, వెళ్లిపోయిన వారిలో చంద్రయాన్-3, గగన్‌యాన్ వంటి పరిశోధనల్లో ఏళ్ల తరబడి అనుభవం గడించిన కీ-సైంటిస్టులు ఉన్నారు. ప్రైవేట్ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడం మంచిదే అయినప్పటికీ.. మన ప్రభుత్వ సంస్థ అయిన ఇస్రోలోని మేధావులను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా కేంద్రంపై ఉంది. ఇందుకోసం శాస్త్రవేత్తల జీతభత్యాలు పెంచడంతో పాటు, వారికి పనిలో మరింత స్వేచ్ఛను కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Published : 
  • 18 July 2026, 7:40 PM IST