తెలుగు కథతో భాయిజాన్ బాక్సాఫీస్ కెవ్వు కేకే!

టాలీవుడ్ నిర్మత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ అంటేనే ఒక ప్రత్యేకమైన బ్రాండ్. వీళ్లిద్దరూ కలిసి ఇప్పటివరకు తీసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయి.

Post Published By: dialnews
Updated : 3 August 2026, 6:41 PM IST

టాలీవుడ్ నిర్మత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ అంటేనే ఒక ప్రత్యేకమైన బ్రాండ్. వీళ్లిద్దరూ కలిసి ఇప్పటివరకు తీసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే, ఈసారి వీళ్లు ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ మామూలుది కాదు! నేరుగా బాలీవుడ్ స్టార్ హీరో, 'భాయిజాన్' సల్మాన్ ఖాన్‌తో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను పట్టాలెక్కిస్తున్నారు. 'శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్' బ్యానర్‌పై రూపొందుతున్న ఈ బిగ్ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రస్తుతం ఫిల్మ్‌నగర్ వ్యాప్తంగా ఒక ఆసక్తికరమైన వార్త గుసగుసలుగా వినిపిస్తోంది. అదేంటంటే... సల్మాన్ ఖాన్ ఈ సినిమా కోసం తన పారితోషికాన్ని ఊహించని రేంజ్‌లో తగ్గించుకున్నారట.

అసలు మేటర్ ఏంటంటే... ప్రస్తుతం బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ రేంజ్ వేరు. ఆయన ఒక సినిమా ఒప్పుకుంటే దాదాపు 120 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు. కానీ, దిల్ రాజు – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా కోసం సల్మాన్ కేవలం 70 కోట్లు మాత్రమే తీసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.అంటే ఒక్క సినిమాకే దాదాపు 50 కోట్ల పారితోషికాన్ని తగ్గించుకున్నారు! ఈ రోజుల్లో టాప్ హీరోలు 5 కోట్లు కూడా తగ్గించుకోవడానికి వెనకాడుతున్న సమయంలో, భాయిజాన్ తీసుకున్న ఈ నిర్ణయం చూసి సినీ వర్గాలు షాక్ అవుతున్నాయి.
సల్మాన్ ఖాన్ ఇంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఎందుకు తగ్గించుకున్నారనే సందేహం మీకూ రావచ్చు. దీని వెనుక సల్మాన్ ఖాన్ ప్రాణస్నేహితుడు రఫీ కాజీ ఉన్నారట.

ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వడంలోనూ, దిల్ రాజు-సల్మాన్ ఖాన్‌ల మధ్య చర్చలు జరగడంలోనూ రఫీ కాజీ కీలక పాత్ర పోషించారు. తన ప్రాణస్నేహితుడి మాటను గౌరవిస్తూ, అలాగే సినిమా మేకింగ్ బడ్జెట్ భారం కాకూడదనే ఉద్దేశంతో సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒక హీరో తన పారితోషికం తగ్గించుకుంటే, ఆ మిగిలిన బడ్జెట్‌ను నిర్మాతలు సినిమా విజువల్స్, యాక్షన్ సీన్స్, మరియు క్వాలిటీ పెంచడానికి ఉపయోగిస్తారు. ఇది సినిమా విజయావకాశాలను పెంచడమే కాకుండా, నిర్మాతలకు కూడా మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. ఇక ఈ సినిమాలో మరో బిగ్ సర్ ప్రైజ్ ఏంటంటే... సల్మాన్ ఖాన్ సరసన సౌత్ 'లేడీ సూపర్ స్టార్' నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది! సల్మాన్ ఖాన్ మాస్ క్రేజ్, నయనతార నటన కలగలిస్తే థియేటర్లలో రచ్చ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని 2027 ఈద్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దిల్ రాజు పక్కా ప్రొడక్షన్ ప్లానింగ్, వంశీ పైడిపల్లి స్టైలిష్ మేకింగ్, సల్మాన్ ఖాన్ - నయనతార క్రేజీ కాంబినేషన్ చూస్తుంటే, 2027 ఈద్ కి బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు క్రియేట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

Published : 
  • 3 August 2026, 6:41 PM IST