సోషల్ మీడియాలో, న్యూస్ ఛానల్స్‌లో గత రెండు రోజులుగా ఒకటే బ్రేకింగ్ న్యూస్ మార్మోగిపోతోంది. అదేంటో తెలుసు కదా.. 'నందూస్ వరల్డ్' యూట్యూబర్ నందు అరెస్ట్ అయిపోయింది, ఎయిర్‌పోర్టులో దొరికేసింది, ఇక జైలుకే అంటూ థంబ్ నెయిల్స్ తో నెట్ ఇల్లాళ్లు, యూట్యూబ్ బాబాయిలు తెగ హడావుడి చేస్తున్నారు. కానీ అసలు నిజం ఏంటో తెలుసా బాసూ..? అక్కడ అసలు అరెస్టూ లేదు.. ఏం లేదు.. ఫ్యూచర్లో కూడా ఆమెను అంత ఈజీగా ఏం అరెస్ట్ చేయరు. ఎందుకంటే ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ లాగా అనిపిస్తోంది. లండన్ వీసాల పేరుతో కోట్లు వసూలు చేసింది, లుకౌట్ నోటీసులు ఉన్నాయి అని చెప్పి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగగానే పోలీసులు ఏదో పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్ని పట్టుకున్నట్టు బిల్డప్ ఇచ్చారు. తీరా చూస్తే ఏమైంది? నోటీసులు ఇచ్చి పంపించేశారు.
ఇక్కడే మనకు అసలైన డౌట్ వస్తోంది. ఈ హంగామా వెనుక అసలు ప్లాన్ ఏంటి..? కట్ చేస్తే.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక గట్టి ప్రచారం నడుస్తోంది. అదేంటంటే.. మన నందు గారు త్వరలోనే బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. అవును బాసూ.. బిగ్ బాస్ అంటేనే ఏంటి..? ఎంత కాంట్రవర్సీ ఉంటే అంత క్రేజ్, అంత హైప్. సరిగ్గా బిగ్ బాస్ సీజన్ నడుస్తున్న టైమ్‌లోనే ఈమె లండన్ నుంచి ఇండియాలో ల్యాండ్ అవ్వడం, సరిగ్గా ఎయిర్‌పోర్టులోనే పోలీసులు సీన్ క్రియేట్ చేయడం చూస్తుంటే ఇదంతా స్క్రిప్ట్ ప్రకారం జరిగినట్టు అనిపించట్లేదు..?
సాధారణంగా ఇలాంటి కేసులు ఉంటే సైలెంట్‌గా ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. కానీ మీడియాను పిలిచి మరీ ఇంత రచ్చ చేశారంటే.. రేపు బిగ్ బాస్ హౌస్ లోకి ఈమె అడుగుపెట్టేటప్పుడు వచ్చే మైలేజ్ కోసమే అని నెటిజన్లు కూడా గట్టిగా నమ్ముతున్నారు. అసలు పోలీసులు చేసిన హంగామా చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. లుకౌట్ నోటీసులని, ఎయిర్ పోర్టులో డిటైన్ చేశామని ఏవేవో పెద్ద పెద్ద పదాలు వాడారు. తీరా చూస్తే లాయర్లను పెట్టుకుని స్టేషన్ కి వెళ్లి, కూల్‌గా నోటీసులు అందుకుని వచ్చేసింది.
ఛానెల్స్ ఏమో ఏదో జైల్లో పెట్టేసినట్టు లైవ్‌లు పెట్టేసి నానా యాగి చేశాయి. బాధితులు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారని ఒక పక్క చెప్తుంటే.. పోలీసులు మాత్రం కేవలం విచారణ, నోటీసులు అంటూ కాలయాపన చేస్తున్నారు. అంటే దీనర్థం ఏంటి..? నందును నిజంగా అరెస్ట్ చేసే ఉద్దేశం ఎవరికీ లేదు. కేవలం కాసేపు కెమెరాల ముందు హడావుడి చేసి వదిలేయడానికే ఈ డ్రామా అంతా రక్తి కట్టించారు. ఏదేమైనా ఈ రోజుల్లో తప్పు చేసినా సరే, దాన్ని పబ్లిసిటీకి వాడుకుని సెలబ్రిటీలు అయిపోయే ట్రెండ్ నడుస్తోంది.
కోట్ల రూపాయల వీసా స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి.. రేపు పొద్దున హ్యాపీగా టీవీ స్క్రీన్ల మీద కనిపిస్తూ, బిగ్ బాస్ హౌస్‌లో గేమ్స్ ఆడుతుంటే జనాలు చూసి చప్పట్లు కొట్టాలా..? పోలీసులు చేసిన ఈ ఓరికే హంగామా అంతా చూస్తుంటే చట్టం తన పని తాను చేసుకుపోవడం లేదు.. చట్టం కేవలం బిగ్ బాస్ ప్రమోషన్స్ చేసుకుపోతోంది అన్నట్టుగా ఉంది. అరెస్ట్ అనేది ఊహాగానమే కానీ, నిజంగా ఆమెపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకునేలా కనిపించడం లేదు.