ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పల్నాడు జిల్లా కేంద్రంగా మరో సంచలన పొలిటికల్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇటీవల రెంటచింతల మండలంలో జరిగిన వైసీపీ యువజన విభాగం నాయకుడు నవులూరి చెన్నారెడ్డి హత్య కేసు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. ఈ దారుణ హత్యను వేరే పార్టీపై నెట్టి, స్థానిక నేతలను ఇరికించాలని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం ఆయనకే రివర్స్ అయిందా? అంటే అవుననే అంటున్నాయి తాజాగా బయటకు వచ్చిన ఆధారాలు. మృతుడి తండ్రి భాస్కరరెడ్డితో వైఎస్ జగన్ మాట్లాడిన పూర్తి నిడివి ఫోన్‌కాల్ ఆడియో, వీడియో సోషల్ మీడియాలో లీక్ అయి సంచలనం రేపుతోంది. "అన్నా. చంపింది మనోళ్లే" అంటూ మృతుడి తండ్రి స్వయంగా జగన్ ముందే నిజాలు ఒప్పుకోవడంతో వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అసలు ఆ ఫోన్ కాల్ లో ఏం జరిగింది? జగన్ ఎవరిని ఇరికించాలనుకున్నారు?
మొదట ఈ వివాదం వెనుక ఉన్న అసలు ఘటన ఏంటో మనం తెలుసుకోవాలి. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలకు చెందిన వైకాపా కార్యకర్త నవులూరి చెన్నారెడ్డి గురువారం రాత్రి మాచర్ల నుంచి తన గ్రామానికి ఒంటరిగా ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మార్గమధ్యంలో ఆయన్ను వెంబడించిన ప్రత్యర్థులు కారుతో బలంగా ఢీకొట్టారు. కింద పడిపోయిన చెన్నారెడ్డి కళ్లలో కారం చల్లి, అనంతరం దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. శవాన్ని రహదారి పక్కన పొలాల్లో పడేసి పరారయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న చెన్నారెడ్డి కుటుంబ సభ్యులు, తండ్రి భాస్కరరెడ్డి గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు.
అయితే, వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి ఆసుపత్రికి రాగా.. అక్కడున్న వైకాపా నాయకులు, మృతుడి మామ రంగారెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. "మీరే ఈ హత్య చేయించారు, మీ సోదరుల వర్గపోరే చెన్నారెడ్డి ప్రాణాలు తీసింది" అంటూ పిన్నెల్లి సోదరులను అక్కడే నిలదీశారు. ఈ గొడవ జరుగుతున్న సమయంలోనే.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురజాల ఆసుపత్రి నుంచే నేరుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ కలిపారు. పక్కనే ఉన్న మృతుడి తండ్రి భాస్కరరెడ్డికి ఫోన్ అందించారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఫోన్ తీసుకున్న జగన్.. భాస్కరరెడ్డిని పరామర్శిస్తూ, ఈ దారుణాన్ని తట్టుకోలేకపోతున్నానని, ఇది చాలా అన్యాయమని అన్నారు.
ఆ తర్వాత జగన్ వ్యూహాత్మకంగా.. "అరెరె.. ఎవరితో చేయించారు? ఎమ్మెల్యేలు ఎవరైనా సపోర్ట్ తీసుకుని చేయించారా?" అంటూ ఈ హత్య వెనుక ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేల హస్తం ఉందా అనే కోణంలో భాస్కరరెడ్డిని ప్రశ్నించారు. ఈ ప్రశ్న ద్వారా హత్యను రాజకీయంగా అవతలి పార్టీపైకి నెట్టాలనేది జగన్ ఆలోచనగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, జగన్ అడిగిన ప్రశ్నకు మృతుడి తండ్రి భాస్కరరెడ్డి ఇచ్చిన సమాధానం జగన్ ఊహకు కూడా అంది ఉండదు. భాస్కరరెడ్డి ఫోన్ లో ఏడుస్తూ.. "ఎమ్మెల్యే కాదు.. పాడు కాదు.. చంపింది మనోళ్లే అన్నా! మన మనుషులు కూడా తేలారు.. మనోళ్లే! సొంతోళ్లే.. బయటోళ్లు కాదు.. వేరే పార్టీ కాదు అన్నా.. మనోళ్లే!" అంటూ స్పష్టంగా చెప్పారు.
కారుతో గుద్ది, కళ్లలో కారం చల్లి, గొంతు కోసి చంపింది తమ సొంత పార్టీలోని వారేనని తండ్రి కుండబద్దలు కొట్టారు. దీంతో జగన్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తాను ఏదో అనుకుంటే, ఇక్కడ సీన్ రివర్స్ అయిందని గ్రహించిన జగన్.. ఏమీ మాట్లాడలేక కేవలం "హ.. సారీ అన్నా.. హ్లౌ..!" అంటూ నీళ్లు నమలడం లీకైన వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. భాస్కరరెడ్డి అలా నిజాలు చెబుతుండటంతో పక్కనే ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కంగారుపడి ఫోన్‌ను తన చేతికి తీసుకున్నారు. ఫోన్ తీసుకుని జగన్‌తో.. "అన్నా.. అన్నా.. మనవాడే ఉన్నాడు అన్నా.. భాస్కరరెడ్డి అన్న మనవాడు" అంటూ కవర్ చేయడానికి ప్రయత్నించారు.
దానికి జగన్.. "భాస్కరరెడ్డి అన్నను చూసుకోండి" అని చెప్పారు. పిన్నెల్లి ఇంకా ఏదో చెప్పబోతుండగా, ఇక అక్కడ మాట్లాడితే లాభం లేదని భావించిన జగన్.. వెంటనే ఫోన్ కట్ చేసేశారు. ఈ పూర్తి సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చేరడంతో.. వైకాపా అంతర్గత వర్గపోరే ఈ హత్యకు కారణమని, దీనిని రాజకీయంగా వాడుకోవాలని చూసిన జగన్ ప్లాన్ ఫెయిల్ అయిందని ప్రతిపక్షాలు గట్టిగా విమర్శిస్తున్నాయి. ఈ ఘటనతో పల్నాడు జిల్లా వైకాపాలో అంతర్గత విబేధాలు ఎంత పీక్స్ కు చేరాయో అర్థమవుతోంది. ఒక కార్యకర్త ప్రాణం పోతే, దాన్ని పరామర్శించే ఫోన్ కాల్ లో కూడా రాజకీయాలు వెతకడం ఏంటని సామాన్య జనాలు ప్రశ్నిస్తున్నారు.