బిగ్‌బాస్ ప్రిపరేషన్స్ మొదలవ్వక ముందే రచ్చ రంబోలాగా మారింది! బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 కోసం సాధారణ ప్రజలను ఎంపిక చేసేందుకు చేపట్టిన 'అగ్నిపరీక్ష సీజన్ 2' కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఇటీవల ఉప్పల్ బాలు వివాదం ముగియకముందే, తాజాగా నటి బిందు మాధవి చేసిన వ్యాఖ్యలు, దానికి కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అగ్నిపరీక్షలో భాగంగా టాప్ 15 కంటెస్టెంట్లను ఎంపిక చేసే టాస్క్‌లో ఓ ఆర్జే.. జడ్జిగా ఉన్న బిందు మాధవిని ఇంటర్వ్యూ చేశాడు. గతంలో బిగ్‌బాస్ ఓటీటీలో నటరాజ్ మాస్టర్ బిందు మాధవిని "శూర్పణఖ" అని విమర్శించిన విషయాన్ని ఆ కుర్రాడు ప్రస్తావించాడు.
దీనికి స్పందించిన బిందు మాధవి, "ఆ సమయంలో నేను చాలా ఇరిటేట్ అయ్యాను, కానీ అలాంటి వాళ్లు కూడా సమాజంలో లేదా షోలో ఉండాలి కాబట్టి థ్యాంక్స్ చెప్పాలి" అని కామెంట్ చేసింది.బిందు మాధవి కామెంట్స్‌పై సీరియస్ అయిన నటరాజ్ మాస్టర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సుదీర్ఘమైన వీడియోను విడుదల చేస్తూ ఘాటుగా సమాధానమిచ్చారు.బిగ్‌బాస్ ఓటీటీలో నిన్ను 'శూర్పణఖ' అన్నది నేనే. 'అలాంటోళ్లు ఉండాలి' అంటే అర్థం ఏంటి? నాతో మాట్లాడేటప్పుడు మాట జాగ్రత్తగా ఉండాలి" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నిపరీక్షకు వచ్చిన వాళ్లకు ఆ ప్లాట్‌ఫామ్ అవసరం కాబట్టి వాళ్లు అన్నీ భరిస్తారు. కానీ నాకు ఆ అవసరం లేదు.
నన్ను నొక్కి వక్కాణించి ప్రత్యేకంగా హైలైట్ చేయాల్సిన పనిలేదు" అని తెగేసి చెప్పారు. నువ్వు గెలిచానని గొప్పలు చెప్పుకో, పాపులారిటీ తెచ్చుకో, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకుని హడావుడి చేసుకో.. కానీ వేరే వాళ్ల గురించి తక్కువగా మాట్లాడకు" అంటూ హితవు పలికారు.
పెద్ద ప్లాట్‌ఫామ్‌పై తనను ఉద్దేశించి చేసిన "అలాంటి వాళ్లు" అనే మాటను వెనక్కి తీసుకోవాలని, అందరిలా ఊరుకోవడానికి తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశారు.ప్రస్తుతం నటరాజ్ మాస్టర్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. మరి ఈ వివాదంపై బిందు మాధవి లేదా బిగ్‌బాస్ టీమ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.