టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 100 సిక్స్‌ల మైలురాయి అందుకున్న తొలి బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాకుండా సుదీర్ఘ ఫార్మాట్‌లో 100 సిక్స్‌లు బాదిన తొలి భారత బ్యాటర్‌గా కూడా చరిత్రకెక్కాడు.తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో లాహిరు కుమార బౌలింగ్‌లో సిక్స్ బాది ఈ ఫీట్ సాధించాడు. ఇదే సిక్సర్‌తో హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. 89 ఇన్నింగ్స్‌ల్లోనే రిషభ్ పంత్ ఈ ఘనతను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన నాలుగో బ్యాటర్‌గా రిషభ్ పంత్ నిలిచాడు. టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ల జాబితాలో బెన్ స్టోక్స్ 138 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా, మెక్ కల్లమ్ 107 సిక్సర్లతో రెండో స్థానంలో నిలిచాడు. పంత్ మూడో స్థానంలో ఉన్నాడు.
రిషభ్ పంత్ హాఫ్ సెంచరీతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 193 పరుగులకు ఆలౌటైంది. పంత్‌తో పాటు దేవదత్ పడిక్కల్ 44 రాణించాడు. శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో నాలుగు వికెట్లు తీయగా.. ప్రబాత్ జయసూర్య మూడు వికెట్లు పడగొట్టాడు. కేశర నువాంత ఒక వికెట్ తీయగా.. లాహిరు కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగుల భారీ ఆధిక్యం లభించడంతో శ్రీలంక ముందు 372 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది.
ఈ భారీ లక్ష్యఛేదనలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంకకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. సిరాజ్, మానవ్ సుతార్, ప్రసిధ్ కృష్ణ నిప్పులు చెరగడంతో శ్రీలంక 54 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. నాలుగో రోజు ఆటలో ఇంకా 25 ఓవర్లకు పైగా ఆట మిగిలి ఉంది. పిచ్ బౌలింగ్‌కు అడ్వాంటేజ్‌గా మారింది. అయితే ఈ మ్యాచ్‌లో శ్రీలంకను రక్షించేది వరణుడు మాత్రమే. వరణుడు ఆటకు అంతరాయం కలిగిస్తే.. శ్రీలంక డ్రాతో గట్టెక్కుతుంది. లేదంటే చివరి రోజు భారత్ విజయం ఖాయమని చెప్పొచ్చు.