సినీ పరిశ్రమలో ఒక సినిమా విడుదలైన తర్వాత దాని ఫలితం గురించి రకరకాల చర్చలు జరగడం సాధారణం. అయితే సినిమా విడుదలైన తర్వాతే కాకుండా, ఆ చిత్రాల లోటుపాట్ల గురించి స్వయంగా హీరోల కుటుంబ సభ్యులే స్పందించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. తాజాగా టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు, నటుడు ఆనంద్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.సినిమా రంగంలో ఏ సినిమా ఏ విధంగా ఆడుతుందో ముందే అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కాదని ఆనంద్ దేవరకొండ అభిప్రాయపడ్డారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే కొన్ని సినిమాలు ఊహించని విధంగా నిరాశపరిస్తే, మరికొన్ని చిన్న సినిమాలు అనూహ్యమైన విజయాలను అందుకుంటాయని ఆయన తెలిపారు.
అయితే సినిమా ఫలితం ముందే తెలుసని హీరోలు లేదా నటులు స్పందించినప్పుడు ఆ వ్యాఖ్యలు ఎప్పుడూ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తాయని ఆయన పేర్కొన్నారు.విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కింగ్ డమ్'. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది. ఈ సినిమా గురించి ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.ఈ సినిమా ఎడిటెడ్ వెర్షన్‌ను చూసినప్పుడు కొన్ని విషయాలు తనకు పూర్తిగా అర్థం కాలేదని ఆనంద్ దేవరకొండ తెలిపారు. ముఖ్యంగా విజయ్ పాత్ర శ్రీలంకకు వెళ్లిన తర్వాత వచ్చే సన్నివేశాలు మరియు కథ కొంత కన్ఫ్యూజింగ్గా అనిపించాయని ఆయన నిజాయితీగా అంగీకరించారు. కింగ్ డమ్' చిత్రాన్ని రెండు భాగాలుగా కాకుండా ఒకే సినిమాగా తీసి ఉంటే బాగుండేదేమో అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
గతంలో విజయ్ దేవరకొండ నటించిన 'లైగర్' సినిమా ఫలితం గురించి కూడా ఆనంద్ దేవరకొండ గతంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. 'లైగర్' సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవచ్చని విజయ్‌కు ముందే తెలుసని ఆయన పేర్కొన్నారు. సినిమా విడుదలైన తర్వాత విజయ్ పెద్దగా బాధపడలేదని, అదే రోజు సాయంత్రం తన తదుపరి సినిమా అయిన 'ఖుషి' సినిమాపై పూర్తి దృష్టి పెట్టారని అప్పట్లో ఆనంద్ వెల్లడించారు.తాను నటించిన ఎపిక్ సినిమా విడుదల నేపథ్యంలో ఆనంద్ ఈ ఒపీనియన్స్ ను మీడియాతో పంచుకున్నారు.