తెలుగు టెలివిజన్ రంగంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 10 చాలా గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఈ సీజన్‌లో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టారు. వీరిలో 10 మంది సెలబ్రిటీలు కాగా, 6 గురు కామనర్స్ ఉన్నారు. ఇది పదవ సీజన్ కావడంతో ప్రేక్షకులు భారీ అంచనాలతో ఉన్నారు. ఈసారి ఎలాంటి సర్ప్రైజ్‌లు ఉంటాయి, టాస్క్‌లు ఎలా మారుతాయి అని అందరూ చర్చించుకుంటున్నారు.ప్రతిసారీ బిగ్‌బాస్ ప్రారంభం అయినప్పటి నుంచి చివరి రోజు వరకు కంటెస్టెంట్లకు అండగా నిలిచేవారు ఒక గ్రూప్‌గా ఏర్పడతారు. తమ ఫేవరెట్ కంటెస్టెంట్ కోసం ఫ్యాన్ పేజీలు, ఓటింగ్ కోసం రిక్వెస్ట్లు, క్యాంపెయినింగ్‌లు అభిమానంతో చేస్తారు. సోషల్ మీడియాలో జరిగే రచ్చ అంతా ఇంతా కాదు. సెలబ్రిటీలు కావడం వల్ల కొందరికి స్వతహాగా ఉండే ఫ్యాన్స్ బేస్‌తో పాటు ఇతర సెలబ్రిటీల మద్దతు కూడా లభిస్తుంది.
నామినేషన్స్ మరియు ఓటింగ్ సమయంలో ఈ సపోర్ట్ బాగా వర్కవుట్ అవుతుంది. తాజాగా బిగ్‌బాస్ తెలుగు 10 లోని సెలబ్రిటీలకు వారి ఫ్రెండ్స్ అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా కొందరికి సపోర్ట్ చేస్తూ పోస్ట్ చేశాడు.
జబర్దస్త్ ద్వారా పరిచయమైన ప్రతిభావంతులలో హైపర్ ఆది కూడా ఒకరు. తన పంచ్‌లు, ప్రాసలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటాడు. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్‌కు చేరుకుని తెలుగు వినోద రంగంలో తనదైన ముద్ర వేశారు ఆది. ప్రతిభకు తోడు కష్టపడితే ఏదైనా సాధించవచ్చని ఆది నిరూపించారు. జబర్దస్త్‌లోకి ఆది వచ్చిన తర్వాత ఆ షో రూపురేఖలే మారిపోయాయి. స్కిట్లలో పంచ్‌లు, కౌంటర్లతో చాలా మందిని జబర్దస్త్‌కు చేరువ చేశాడు ఆది. రైజింగ్ రాజు, దోరబాబు, శాంతి స్వరూప్, గణపతి తదితరులతో కూడిన తన టీమ్‌తో సంచలనాలు సృష్టించాడు ఆది.
ఒకప్పుడు కేవలం ఆది స్కిట్స్ కోసమే జబర్దస్త్ చూసే జనాలు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.జబర్దస్త్‌తో పాటు పలు సినిమాల్లోనూ నటించి తన సత్తా చాటాడు ఆది. కమెడియన్‌గా కాకుండా సినిమాల స్క్రిప్ట్స్, కథ, సంభాషణలు అందిస్తూ దూసుకెళ్తున్నాడు. జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, తదితర షోలలోనూ ఆది సందడి చేస్తున్నాడు. బిగ్‌బాస్ తెలుగులో పలు సీజన్లలో హైపర్ ఆది పేరు వినిపించినప్పటికీ అతను అంతగా ఆసక్తి చూపించలేదు. అయితే బిగ్‌బాస్ స్టేజ్‌పై అప్పుడప్పుడు సందడి చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటాడు.తాజాగా బిగ్‌బాస్ తెలుగు 10 ప్రారంభం కావడంతో ముగ్గురు కంటెస్టెంట్స్‌కి హైపర్ ఆది అండగా నిలిచాడు. తన జబర్దస్త్ ఫ్రెండ్స్ అయిన ఆటో రాంప్రసాద్, పొట్టి నరేష్‌తో పాటు యాంకర్ వర్షిణికి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు.
చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ల సినిమాలు చేస్తూ పెరిగిన ఆది.. తన అభిమాన హీరో పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలోనూ చేరి ఆ పార్టీ కోసం పనిచేస్తున్నాడు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పాటు కూటమి అభ్యర్థుల తరపున విస్తృతంగా ప్రచారం చేశాడు. ఈ రకంగా ఆదికి జబర్దస్త్ కమెడియన్‌గా సెపరేట్ ఫ్యాన్ బేస్‌తో పాటు మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలలో మంచి గుర్తింపు ఉంది. ఆయన ఒక మాట చెబితే వినేవారు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆదికి ఉన్న క్రేజ్.. రాంప్రసాద్, వర్షిణి, పొట్టి నరేష్‌లకు బిగ్‌బాస్‌లో ఎంత వరకు ఓట్లు వేయిస్తుందో చూడాలి.