నెల ప్రారంభంలో అంటే జనవరి 1, 2 తేదీల్లోనే సైక్ సిద్ధార్థ్, వనవీర లాంటి వైవిధ్యమైన చిత్రాలు విడుదలై ప్రేక్షకుల్లో 2026 క్యాలెండర్ మొదలవ్వడమే టాలీవుడ్లో ఒక సరికొత్త జోష్ కనిపించింది. జనవరి నెలలో చిన్నవి, పెద్దవి కలిపి దాదాపు 20 సినిమాలు థియేటర్ల తలుపుతట్టాయి.మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు సందడి చేయగా.. అసలు సిసలైన సినిమా పండగ మాత్రం సంక్రాంతి సీజన్‌తోనే మొదలైంది. ఏదేమైనా చిన్న సినిమాలను పక్కనబెడితే ఈ సంక్రాంతి సీజన్ టాలీవుడ్ బాక్సాఫీస్‌కు కాసుల వర్షం కురిపించిందనే చెప్పాలి. ఈ సంక్రాంతికి అసలు సిసలైన విజేత మన శంకరవరప్రసాద్ గారు. ఎప్పటిలాగే పండక్కి వచ్చి బాక్సాఫీస్‌ను రప్ఫాడించాడు బాస్. వింటేజ్ చిరును గుర్తుచేస్తూ వచ్చిన ఈ సినిమా మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్లలో దుమ్ము దులిపేసింది. కేవలం మౌత్ టాక్‌తోనే కాకుండా, రిపీట్ ఆడియన్స్ వల్ల ఏకంగా 350 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.
మెగాస్టార్ స్టామినా ఏమాత్రం తగ్గలేదని, సంక్రాంతి బరిలో దిగితే రికార్డులు బద్దలవ్వాల్సిందేనని ఈ కలెక్షన్స్ మరోసారి నిరూపించాయి. మెగాస్టార్ ప్రభంజనం ఒకవైపు కొనసాగుతుండగానే.. మరోవైపు కంటెంట్ ఉన్న సినిమాలు సైలెంట్‌గా తమ సత్తా చాటాయి. ముఖ్యంగా నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు చిత్రం అంచనాలకు మించి రాణించి, అనూహ్యంగా 100 కోట్ల క్లబ్బులో చేరి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. రెండేళ్లకు పైగానే సెట్స్ మీదున్న ఈ చిత్రం.. అంచనాలు నిలబెడుతూ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసింది. ఇక ఏమాత్రం హడావిడి లేకుండా.. కేవలం కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ నమ్ముకుని వచ్చిన నారీనారీ నడుమ మురారి బాక్సాఫీస్ దగ్గర సైలెంట్ హిట్‌గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ రెండు సినిమాలకు బ్రహ్మరథం పట్టడంతో డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లోకి వెళ్లడమే కాకుండా భారీ లాభాలను కళ్లజూశారు.
విజయాలు ఉన్నచోటే పరాజయాలు కూడా ఉండటం సహజం. కానీ ఈసారి భారీ అంచనాలతో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర చతికిలపడటం ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్పై ముందు నుంచి ఆకాశమంత అంచనాలు ఉన్నప్పటికీ.. రొటీన్ కథనం కారణంగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అలాగే టైటిల్‌తోనే ఆసక్తి రేకెత్తించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా థియేటర్లలో నిలదొక్కుకోలేకపోయింది. ఈ రెండు చిత్రాలు ఓపెనింగ్స్ రాబట్టినప్పటికీ, లాంగ్ రన్లో మాత్రం చేతులెత్తేశాయి. ఇక చివరగా చెప్పుకోవాల్సింది ఓం శాంతి శాంతి శాంతి సినిమా గురించి. ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకు పర్లేదనే టాక్ వచ్చింది. విమర్శకులు సైతం కథ బాగుందని, మేకింగ్ కొత్తగా ఉందని ప్రశంసించారు. కానీ ఆ పాజిటివ్ టాక్ కలెక్షన్ల రూపంలోకి మారలేకపోయింది. మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ కాకపోవడమో లేదంటే సంక్రాంతి పోటీలో వెనుకబడిపోవడమో తెలియదు కానీ.. కంటెంట్ బాగున్నా కమర్షియల్‌గా మాత్రం ఈ సినిమా ఫెయిల్యూర్ గా మిగిలింది. మొత్తంగా చూస్తే 2026 జనవరి నెల టాలీవుడ్‌కు మిశ్రమ ఫలితాలను అందించినా, సక్సెస్ రేట్ పరంగా మాత్రం సూపర్ హిట్టే..!