ప్రముఖ నటి కీర్తి భట్, విజయ్ కార్తీక్‌ల ఎంగేజ్మెంట్ రద్దు వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వీరు అధికారికంగా విడిపోతున్నట్లు ప్రకటించిన వెంటనే.. విజయ్ కార్తీక్ చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు నెట్టింట పెద్ద దుమారాన్నే రేపాయి. కీర్తి ఆర్థిక కారణాల వల్లే తనను వదిలేసిందని.. వేరే వారి కోసం చూస్తోందంటూ విజయ్ చేసిన ఆరోపణలతో నెటిజన్లు ఆమెను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. దీనివల్ల ఆమె క్యారెక్టర్‌పై అనేక రకాల మీమ్స్, ట్రోల్స్ పుట్టుకొచ్చాయి. అయితే కేవలం ఒక వైపు వెర్షన్ మాత్రమే విని తనను జడ్జ్ చేయడంపై కీర్తి భట్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న నెగెటివ్ ప్రచారం, వస్తున్న ట్రోల్స్‌పై ఆమె ఎమోషనల్ అయింది.
దయచేసి ఒక పక్షం వాదనల ఆధారంగా ఎవరినీ అంచనా వేయకండి, నా గురించి పూర్తిగా తెలియకుండా నిందలు వేయడం సరికాదు అంటూ తనను విమర్శించే వారికి.. గుడ్డిగా నమ్మే వారికి కీర్తి ఒక విన్నపం చేసింది.
ఈ వివాదంపై మరింత స్పష్టత ఇస్తూ.. తన పాత పోస్ట్‌ను ఒకసారి గమనించాలని కీర్తి కోరింది. అందులో తాను ఎవరి బలహీనతలను గానీ, తాను ఎదుర్కొన్న క్లిష్టమైన వ్యక్తిగత పరిస్థితులను గానీ ఎప్పుడూ ప్రస్తావించలేదని గుర్తు చేసింది. తనకు కావాల్సింది కేవలం పరస్పర అవగాహన మాత్రమేనని.. అందుకే చట్టబద్ధంగా, పారదర్శకంగా ఈ బంధం నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఒకరిపై బురద జల్లడం తన ఉద్దేశం కాదని, కానీ తన మౌనాన్ని చేతగానితనంగా చూడొద్దని ఆమె స్పష్టం చేసింది. ముఖ్యంగా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో తన గురించి సృష్టిస్తున్న అసత్య కథనాలు, వాడుతున్న థంబ్‌నెయిల్స్ తనను మానసికంగా తీవ్రంగా కృంగదీస్తున్నాయని కీర్తి వాపోయింది.
కేవలం వ్యూస్ కోసం ఊహాగానాలతో రాస్తున్న కథనాలు ఒక మనిషిని ఎంతలా దెబ్బతీస్తాయో ఆలోచించాలని కోరింది. ప్రస్తుతం జరుగుతున్న చర్చలు, అసత్య ప్రచారాలు తన వ్యక్తిగత జీవితాన్ని, ప్రశాంతతను పూర్తిగా నాశనం చేస్తున్నాయని ఆమె కన్నీరు పెట్టుకుంది. చివరగా ట్రోలర్స్, గాసిప్ రాయుళ్లకు కీర్తి భట్ ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న కొన్ని సోషల్ మీడియా పేజీలు, వ్యక్తుల పేర్లను తాను గమనించానని.. భవిష్యత్తులో ఈ పరిణామాల వల్ల తనకు ఏదైనా జరిగినా, తాను తీసుకోబోయే కఠిన నిర్ణయాలకు గానీ వారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు చెబుతూ ఆమె తన ఆవేదనను ముగించింది.