రెమ్యునరేషన్‌ అడిగితే కొడుతున్నారు… మీర్జాపూర్‌ యాక్టర్‌ కన్నీటి వీడియో…!

'లాపతా లేడీస్', 'మీర్జాపూర్' లాంటి ప్రాజెక్టులతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సతేంద్ర సోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వీడియో తీవ్ర కలకలం రేపుతోంది.

Post Published By: dialnews
Updated : 29 June 2026, 12:50 PM IST

'లాపతా లేడీస్', 'మీర్జాపూర్' లాంటి ప్రాజెక్టులతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సతేంద్ర సోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వీడియో తీవ్ర కలకలం రేపుతోంది. రెమ్యునరేషన్‌ అడిగినందుకు ఓ సినిమా డైరెక్టర్ తనపై దాడి చేసి, చంపేస్తానని బెదిరించాడని సతేంద్ర కన్నీరు పెట్టుకుంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. సతేంద్ర సోని మధ్యప్రదేశ్‌లోని మైహార్‌లో 'పెడ్ పల్కి' అనే సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి వెళ్లాడు. ఈ సినిమాకు పుష్పేంద్ర సింగ్ దర్శకుడు మరియు నిర్మాత. మొత్తం 10 రోజుల షూటింగ్ కాగా, అడ్వాన్స్‌గా 50 వేలు ఇచ్చి, మిగతా డబ్బులు షూటింగ్ సమయంలో ఇస్తామని ముందుగా ఒప్పందం చేసుకున్నారు. అయితే వరుసగా 8 రోజులు షూటింగ్ పూర్తయ్యాక కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో సతేంద్ర దర్శకుడిని తన రెమ్యునరేషన్‌ అడిగాడు.

డబ్బులు అడిగినందుకు "పది నిమిషాల్లో హోటల్ ఖాళీ చేసి వెళ్లిపో, మళ్ళీ ఇక్కడ కనిపిస్తే చంపేస్తాం" అని దర్శకుడు పుష్పేంద్ర సింగ్ తీవ్రంగా బెదిరించాడని సతేంద్ర ఆరోపించాడు. దర్శకుడి భార్య, ఆ సినిమా హీరోయిన్ అయిన ప్రగతి చౌహాన్ కూడా తనను బూతులు తిట్టిందని ఏడూస్తూ వీడియో పోస్ట్‌ చేశాడు. భయపడిపోయి తన తోటి నటులతో కలిసి హోటల్ నుంచి బయటకు నడుచుకుంటూ వెళ్తుండగా.. దర్శకుడు, ఆయన భార్య కారులో వెంబడించి నడిరోడ్డుపై తనను చితకబాదారని ఆరోపించాడు. తనను కాపాడేందుకు వచ్చిన శ్రీధర్‌పై కూడా వాళ్లు దాడి చేశారని చెప్పాడు.

ఈ చేదు అనుభవం తర్వాత మధ్యప్రదేశ్ పోలీసుల సహాయంతో సతేంద్ర సోని మరియు ఇతర నటులు సురక్షితంగా ముంబై చేరుకున్నారు. ముంబై రైల్వే స్టేషన్ నుంచి మరో వీడియోను పోస్ట్ చేస్తూ, తమకు సహాయం చేసిన పోలీసులకు అతను కృతజ్ఞతలు తెలిపాడు. సతేంద్ర సోని వీడియో వైరల్ కావడంతో 'ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్' ఈ వ్యవహారంపై స్పందించింది. నటీనటులకు డబ్బులు ఇవ్వకుండా ఇలా బెదిరింపులకు, దాడులకు పాల్పడటం దారుణమని మండిపడింది. వెంటనే దర్శకుడు, నిర్మాత అయిన పుష్పేంద్ర సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌ను అసోసియేషన్ కోరింది.

Published : 
  • 29 June 2026, 12:50 PM IST