కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో చెప్పడం కష్టం. టాలెంట్ ఉండి, సరైన బ్రేక్ కోసం ఎదురుచూసే వారికి అదృష్టం తలుపు తడిితే వారి కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతుంది. ప్రస్తుతం అలాంటి ఒక బంపర్ ఆఫర్ సొంతం చేసుకుని వార్తల్లో నిలిచింది యంగ్ బ్యూటీ యోగలక్ష్మి.తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్, స్టార్ హీరో శింబు కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ సినిమా ‘అరసన్’లో ఆమె మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఒక అవార్డు ఫంక్షన్‌లో ఆమె స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. యోగలక్ష్మి మొదట వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సోషల్ మీడియాలో మరియు ప్రేక్షకులలో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. నటనపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామకు ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఈ చిత్రంలో ఆమె కనబరిచిన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమెకు పరిశ్రమలో ఊహించని క్రేజ్ లభించింది. అదే క్రేజ్ ఇప్పుడు ఆమెను కోలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటైన ‘అరసన్’లో భాగమయ్యేలా చేసింది.
ఈ ప్రాజెక్టులో సెలెక్ట్ అయిన విషయమై యోగలక్ష్మి మాట్లాడుతూ తన సంతోషాన్ని పంచుకుంది. "శింబు గారి సరసన 'అరసన్' సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కిందని తెలియగానే, నా ఆనందానికి అవధులు లేవు. ఈ గుడ్ న్యూస్ వినగానే మొదట మా అమ్మకు ఫోన్ చేసి చెప్పాను. ఆమె ఎంతో సంతోషపడ్డారు. వెట్రిమారన్ లాంటి గొప్ప దర్శకుడి పర్యవేక్షణలో, శింబు లాంటి స్టార్ హీరోతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
ఈ అద్భుతమైన ప్రయాణం కోసం నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను" అంటూ ఎమోషనల్ అయ్యింది. కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలో ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు మళ్లీ శరవేగంగా పుంజుకుంది. చెన్నైలోని ఈసీఆర్ పరిసర ప్రాంతాలలో సరికొత్త షెడ్యూల్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ వెట్రిమారన్ మార్క్ ‘వడ చెన్నై’ వాతావరణాన్ని తలపించేలా ఒక భారీ సెట్‌ను నిర్మించారు. ఈ సెట్‌లో యోగలక్ష్మి మరియు హీరో శింబులపై కీలకమైన యాక్షన్ మరియు డ్రామా సీన్లను చిత్రకరిస్తున్నట్లు సమాచారం.
ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను వి క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్. థాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.సినిమాలో ఆండ్రియా, సముద్రఖని వంటి ఎందరో సీనియర్ నటీనటులు ప్రాధాన్యత కలిగిన పాత్రల్లో నటిస్తున్నప్పటికీ, కథ పరంగా శింబు సరసన యోగలక్ష్మి పాత్ర చాలా కీలకమైనదని, కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ఈ ఏడాది దీపావళి కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు.మొత్తానికి వెట్రిమారన్-శింబు కాంబోలో వస్తున్న ఈ సినిమా యోగలక్ష్మి కెరీర్‌ను ఏ స్థాయికి తీసుకెళ్తుందో చూడాలి.