ప్రస్తుతం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్న ప్రధాన అంశం 'సూపర్ ఎల్-నినో'. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరికల ప్రకారం, ఇప్పటికే ప్రారంభమైన ఎల్-నినో ప్రభావం.. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ పరిస్థితి తీవ్రరూపం దాల్చి 'సూపర్ ఎల్-నినో'గా మారే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 'ఎల్-నినో' అనేది స్పానిష్ పదం, దీనికి "దివ్య బాలుడు" అని అర్థం. పసిఫిక్ మహాసముద్రంలోని ఈక్వటోరియల్ ప్రాంతం.. అంటే భూమధ్యరేఖ ప్రాంతంలో సముద్ర ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరిగినప్పుడు ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితి ఏర్పడుతుంది.
సాధారణంగా సముద్ర ఉష్ణోగ్రత సగటు కంటే 1.5 డిగ్రీ సెల్సియస్ పెరిగితే ఎల్-నినో ప్రభావం మొదలవుతుంది. అయితే ఇటీవల ఇది ఏకంగా 2.6 డిగ్రీ సెల్సియస్ పెరగడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. 1850 నుండి లెక్కిస్తున్న వాతావరణ వివరాల ప్రకారం, ఇది అత్యంత బలమైన నాలుగో ఎల్-నినోగా నిలిచే అవకాశం ఉందని అంచనా. దీని కారణంగా భారత దేశంలో పాటు ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదముంది. అయితే ఎల్-నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఒకేలా ఉండదు. ఒకవైపు తీవ్రమైన కరువులు, వడగాడ్పులు ఉంటే, మరోవైపు అకాల వర్షాలు, వరదలు సంభవిస్తాయి.
భారతదేశంలో నైరుతి రుతుపవనాలు బలహీనపడటానికి ఎల్-నినో ప్రధాన కారణం. దీనివల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి అనేక భారతీయ రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గి కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. వర్షాభావం వల్ల పంట దిగుబడులు తగ్గి వ్యవసాయం, ఆధారిత రంగాలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటాయి. రాబోయే కొన్ని నెలల్లో దేశంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే గణనీయంగా పెరిగి తీవ్రమైన వడగాడ్పులు వచ్చే అవకాశం ఉంది. WMO తెలిపిన వివరాల ప్రకారం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను విచ్ఛిన్నం చేయగల శక్తి ఎల్-నినోకు ఉంది. ఈ అసాధారణ పరిస్థితులను తట్టుకోవడానికి అన్ని దేశాల జాతీయ వాతావరణ సంస్థలు, జలవనరుల విభాగాలు మరియు విపత్తు నిర్వహణ బృందాలు సమిష్టిగా పనిచేయడం తక్షణ అవసరం. వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ, మానవ ప్రాణాలకు మరియు జీవనోపాధికి నష్టం వాటిల్లకుండా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండటం అత్యంత కీలకం.