తీవ్రరూపం దాల్చిన నేపాల్ వరదలు ఓ యుద్ధానికి సమానమైన నష్టాన్ని మిగిల్చాయి. అయితే.. శతాబ్దాల సహజ వనరులను ధ్వంసం చేస్తూ.. టిబెట్ సరిహద్దుల్లో చైనా చేపట్టిన అస్తవ్యస్త నిర్మాణాలే ఈ భారీ ప్రళయానికి దారితీశాయా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. హిమాలయ పర్వత ప్రాంతాలు ఎప్పుడూ అత్యంత సున్నితమైన పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంటాయి. గత కొంతకాలంగా చైనా సరిహద్దు వెంబడి చేపడుతున్న భారీ మౌలిక వసతుల నిర్మాణాలు, కొండలను తొలిచి చేస్తున్న ఆక్రమణలు నేపాల్ సరిహద్దు జిల్లాలను తీవ్ర భయాందోళనల్లోకి నెట్టేశాయి. ఇటీవల నేపాల్‌లోని రసువా జిల్లాలో ప్రవహించే త్రిశూలి నదీ పరివాహక ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు, మంచు తుఫానులు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ విపత్తు వెనుక వర్షాలు మాత్రమే కారణం కాదని, సరిహద్దు అవతల చైనా చేపట్టిన అడ్డదిడ్డమైన కట్టడాలే ప్రధాన కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.
నేపాల్ వార్తా కథనాల ప్రకారం టిబెట్ ప్రాంతంలోని గైరాంగ్ పట్టణ పరిసరాల్లో చైనా నిర్మించిన భారీ కాంక్రీట్ కట్టడాలు ఈ పరిస్థితికి ముమ్మాటికీ కారణం. హిమాలయ పర్వతాల చరియలను, కొండలను విచక్షణారహితంగా తొలిచి నిర్మించిన కొత్త నివాస ప్రాంతాలు, గైరాంగ్ పోర్ట్ మౌలిక వసతులు ప్రకృతి సమతుల్యతను దారుణంగా దెబ్బతీశాయి. త్రిశూలి నది సహజ ప్రవాహానికి అడ్డుగా, నదుల సంగమ క్షేత్రాల వద్ద కాంక్రీట్ వంతెనలు, రోడ్లు నిర్మించడం వల్ల ప్రవాహ దిశ మారింది. గ్లేసియర్ ప్రాంతాల సమీపంలో భారీ యంత్రాలతో తవ్వకాలు జరపడం వల్ల స్థానిక ఉష్ణోగ్రతలు మారి, హిమపాతాలు, మంచుచరియలు విరిగిపడే ప్రమాదం పెరిగింది.
చైనా సరిహద్దు వైపు కొండచరియలు విరిగిపడి, నీటి ప్రవాహానికి అడ్డుకట్ట పడటంతో ఒకేసారి భారీగా వరద నీరు నేపాల్ వైపు ఉప్పొంగింది. త్రిశూలి నది ఉగ్రరూపం దాల్చడంతో రసువా జిల్లాలో శతాబ్ద కాలంలో చూడని విధ్వంసం చోటుచేసుకుంది. వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గల్లంతయ్యారు నదీ తీరంలో ఉన్న జలవిద్యుత్ ప్రాజెక్టులు, వంతెనలు, రహదారులు వరద తాకిడికి కొట్టుకుపోయాయి. టెలికాం వ్యవస్థలు మరియు విద్యుత్ లైన్లు దెబ్బతిని వేలాది గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి.
ఇలాంటి సరిహద్దు ప్రాంతాల్లో నదీ ప్రవాహంలో హఠాత్తుగా మార్పులు వచ్చినా లేదా కొండచరియలు విరిగిపడి నీరు ఆగిపోయినా, దిగువన ఉన్న నేపాల్‌కు ముందస్తు హెచ్చరికలు పంపాల్సిన బాధ్యత చైనాపై ఉంది. అయితే, గైరాంగ్ కౌంటీ అత్యవసర యాజమాన్య విభాగం సరిహద్దు రోడ్లను మూసివేసి సరిహద్దులో ట్రాఫిక్ ఆంక్షలు విధించిందే తప్ప, ప్రవాహం గురించి నేపాల్ అధికారులకు సకాలంలో సమాచారం అందించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిమాలయ పర్యావరణాన్ని వ్యాపార, సైనిక అవసరాల కోసం అడ్డదిడ్డంగా మార్చేసే ప్రయత్నం రెండు దేశాల పౌరుల ప్రాణాల మీదకు తెస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనా సరిహద్దుల్లో చేస్తున్న ఈ అశాస్త్రీయ నిర్మాణాలపై నేపాల్ ప్రభుత్వం తక్షణమే దౌత్యపరమైన నిరసన తెలపాలని, సరిహద్దు పర్యావరణ పరిరక్షణకు అంతర్జాతీయ కమిటీని ఏర్పాటు చేయాలని విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు.