మన జేబుల్లో ఉండే పది, ఇరవై రూపాయల నోట్లు త్వరలోనే పూర్తిగా మారిపోబోతున్నాయి. అవును, కేంద్ర ప్రభుత్వం ఇండియన్ కరెన్సీ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై కాగితపు నోట్ల స్థానంలో అత్యంత మన్నికైన ‘పాలిమర్’ అంటే.. ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన అధికారిక నివేదికను ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది.
అసలు మొదటి విడతగా రూ.10, రూ.20 నోట్లనే ఎందుకు మారుస్తున్నారంటే.. మార్కెట్‌లో ఎక్కువగా చేతులు మారేవి ఇవే. మనం వాడుతున్న కాగితపు నోట్లు త్వరగా మురికిగా మారడం, నీటిలో నానితే చిరిగిపోవడం జరుగుతుంది. కానీ ఈ పాలిమర్ నోట్లు సాధారణ నోట్ల కంటే 5 రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి. ఇవి నీటిలో నానినా, నలిగినా అస్సలు పాడవు. వీటిని రీసైకిల్ కూడా చేసుకోవచ్చు. పైగా వీటి వల్ల బ్యాక్టీరియా, మురికి అస్సలు అంటుకోవు.
అయితే ప్లాస్టిక్ నోట్లు తీసుకురావడం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసా..? నకిలీ నోట్ల దందాకు శాశ్వతంగా ముగింపు పలకడమే. ఈ పాలిమర్ నోట్లపై ముద్రించే హై-టెక్ సెక్యూరిటీ ఫీచర్లు, పారదర్శక విండోలను నకిలీలుగా సృష్టించడం దొంగ నోట్ల ముఠాలకు అసాధ్యం. ఇప్పటికే ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా వంటి దేశాలు ఈ ప్లాస్టిక్ నోట్లను వాడి నకిలీ కరెన్సీ ముప్పును పూర్తిగా తగ్గించాయి. ఇప్పుడు అదే బాటలో ఇండియా కూడా అడుగులు వేస్తోంది. త్వరలోనే ఆర్‌బీఐ ఈ కొత్త నోట్ల లభ్యతపై పూర్తి గడువును ప్రకటించనుంది.